Begin typing your search above and press return to search.

ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మాయావతి

మాయావతి. బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం దేశంలో ఒక రాజకీయ సంచలనంగా మారారు.

By:  Satya P   |   16 Jan 2026 9:20 AM IST
ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మాయావతి
X

మాయావతి. బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం దేశంలో ఒక రాజకీయ సంచలనంగా మారారు. దేశానికే గుండె కాయ లాంటి ఉత్తర ప్రదేశ్ లో అధికారాన్ని ఆమె అందుకున్నారు. నాలుగు పదుల వయసులో యూపీ వంటి పెద్ద స్టేట్ కి సీఎం అయ్యారు. బీఎస్పీ ఆనాడు దేశంలో అతి పెద్ద చర్చగా మారింది. సామాజిక న్యాయం రాజకీయ నినాదంగా మారడానికి కూడా బీఎస్పీ ఎదుగుదల ప్రధాన కారణంగా ఉందంటే అతిశయోక్తి కాదు, కాన్షీరాం స్థాపించిన బీఎస్పీని అధికారం అంచుల దాకా తీసుకుని వచ్చి ఉన్నతాసనం వైపుగా అడుగులు శరవేగంగా వేయించిన ఘనత మాత్రం కచ్చితంగా మాయావతిదే. ఎస్పీతో కొన్నాళ్ళు బీజేపీతో మరి కొన్నాళ్ళూ ఇలా మాయావతి పొత్తులు నెరిపి సీఎం గా యూపీని పాలించారు.

సోషల్ ఇంజనీరింగ్ తో :

అంతే కాదు ఆమె తన పార్టీ ద్వారా సోషల్ ఇంజనీరింగ్ లోనూ కొత్త వ్యూహాలు రచించారు. బ్రాహ్మణులు దళితులు ఇలా కలుపుతూ నయా ఫార్ములా రూపొందించారు. అలాగే ఇతర వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని గట్టిగా దెబ్బ కొట్టారు. ఈ పరిణామల కారణంగానే గత మూడున్నర దశాబ్దాలుగా యూపీలో కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. ఒక దశలో యూపీలో బీఎస్పీ బలమైన ఫోర్స్ గా ఉండేది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఏ రాజకీయ పార్టీకి అధికారం దక్కదన్న పరిస్థితి ఉండేది. కానీ కాలం మారింది. రాజకీయమూ మారింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ జమానాలో బీజేపీ బలంగా పుంజుకున్నాక యూపీలో నెమ్మదిగా బీఎస్పీ తన ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఎస్పీతో వైరం అలగే కాంగ్రెస్ తో కలహం కూడా ఆ పార్టీని ఇబ్బందిలో పడేశాయి. బీజేపీ అనుకూలత కూడా ఆమె పార్టీ ఓటు బ్యాంక్ ని బాగా దెబ్బ తీసింది.

సంచలన ప్రకటన :

ఇదిలా ఉంటే రానున్న కాలంలో పొత్తులకు తాము దూరంగా ఉంటామని ఏ పార్టీతో కలిసేది లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టంగా ప్రకటించారు. ఆమె తన 70వ పుట్టినరోజు సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక మీదట దేశవ్యాప్తంగా జరిగే అన్ని ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు 2027లో జరిగే ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

యోగీ సర్కార్ మీద ఫైర్ :

ఇక మాయావతి యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లే ఉందని అన్నారు. అన్ని విధాలుగా యోగీ సర్కార్ వైఫల్యం చెందింది అని ఆమె మండిపడ్డారు. ఇక బీఎస్పీ రాజకీయ విధానం గురించి చెబుతూ దేశంలో చిన్న, పెద్ద ఎన్నికలన్నింటిలో స్వతంత్రంగా పోటీ చేయడమే సరైనదని తమ పార్టీ నిర్ణయించిందని చెప్పారు. అందుకే ఇక మీదట ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని ఆమె తెలిపారు.

ఇండియా కూటమికి దెబ్బ :

మాయావతి పొత్తులు లేవని చెప్పడం ద్వారా ఇండియా కూటమికి దెబ్బ తీసే విధంగా వ్యవహరించారా అన్న చర్చ సాగుతోంది. యూపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తుంది. ఎస్పీ కాంగ్రెస్ పొత్తు ఉంది, మరి బీఎస్పీ కూడా కలిస్తే బలమైన ఫోర్స్ గా మారి బీజేపీని గద్దె దించవచ్చు అన్నది ఒక అంచనా. కానీ మాయావతి వేరుగా పోటీ చేస్తామని అంటున్నారు. అంతే కాదు దేశవ్యాప్తంగా తమ పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నారు. దాంతో ఆమె ఓటు బ్యాంక్ ముఖ్యంగా కాంగ్రెస్ కే ఎక్కువ చేటు చేస్తుందని చర్చ అయితే ఉంది. చూడాలి మరి మాయావతి ప్రకటన పట్ల ఇండియా కూటమి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో.