Begin typing your search above and press return to search.

మౌని అమావాస్య అంటే ఏమిటి... ఆ రోజు ఏమి చేయాలి ?

సాధారణంగా అమావాస్య అంటే ఏమీ చేయరు, శుభంగా భావించరు, కానీ మౌనీ అమావాస్య అంటే మంచిదిగా చెబుతున్నారు. అలాగే శుభాలకు కూడా మేలు చేసేదే అని అంటున్నారు.

By:  Satya P   |   17 Jan 2026 12:00 PM IST
మౌని అమావాస్య అంటే ఏమిటి... ఆ రోజు ఏమి చేయాలి ?
X

మౌని అమావాస్య వస్తోంది. ఈ నెల 18న మౌని అమావాస్య. పుష్యమాసం ఆ రోజుతో ముగుస్తోంది. ప్రతీ హిందూ నెలలో వచ్చే అమావాస్య వేరు. ఈ మౌనీ అమావాస్య వేరు. మరి దీని విశిష్టత ఏమిటి అన్నది చూస్తే కనుక ఆధ్యాత్మికపరంగా ఎంతో ఉంది అని చెప్పాలి. మౌని అంటే మౌనం పాటించడం. అంటే అది ఒక దీక్ష అన్న మాట. అవును మౌనంగా ఆ రోజు ఉంటూ దీక్ష చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మికవాదులు చెబుతున్నారు.

పేరుకు అమావాస్య కానీ :

సాధారణంగా అమావాస్య అంటే ఏమీ చేయరు, శుభంగా భావించరు, కానీ మౌనీ అమావాస్య అంటే మంచిదిగా చెబుతున్నారు. అలాగే శుభాలకు కూడా మేలు చేసేదే అని అంటున్నారు. ఈ రోజున ఆధ్యాత్మిక పరులు హిందూ ధర్మం విశ్వసించేవారు నదులకు వెళ్ళి పవిత్ర స్నానాలు చేస్తారు. అలాగే తమకు తోచిన విధంగా దాన దాన ధర్మాలు కూడా చేస్తారు. ఆ రోజున మౌనంగా ఉంటే ఎంతో మేలు. దైవ ధ్యానంలో ఆధ్యాత్మికతతో ఉండడం ఇంకా మేలు అని చెబుతున్నారు. ఈ మౌనీ అమావాస్య చాలా ప్రత్యేకమైనది విశిష్టమైనది అని హిందూ శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి.

యోగులంతా ఆరాధించేది :

మౌనీ అమావాస్యను యోగ సాధకులు ఎక్కువగా పవిత్రంగా భావించి ఆరాధిస్తారు. మహా శివరాత్రికి ముందు వచ్చే అమావాస్యగా ఇది ఉండడంతో సాధువులు సంతులు యోగులు ఈ అమావాస్య వేళ ఆధ్యాత్మిక దీక్షలో ఉంటారు. అనే కాదు గంగా యమున సరస్వతీ కలిసే త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు, ఇది ఎంతో శుభకరమైన దినంగా కూడా భావిస్తారు.

ఘడియలు ఇవి :

ఇక ఈ మౌనీ అమావాస్య ఘడియలు ఎపుడు అంటే ఈ నెల 18న తెల్లవారుజామున వస్తుంది. అంటే 12.03 గంటలతో అమావాస్య తిధి మొదలవుతుంది అని చెబుతున్నారు. ఆ మరుసటి రోజు జనవరి 19 తెల్లవారుజామున 1.21 వరకూ మౌనీ అమావాస్యగానే పరిగణిస్తారు. ఇక ఉదయం నుంచే ఈ తిధి ఉండడం వల్ల భక్తులు అంతా వేకువ జామునే లేని పుణ్య స్నానాలు ఆచరించవచ్చు. అంతే కాదు బ్రహ్మ ముహూర్తం అయిన ఉదయం నాలుగు గంటల నుంచ్ ఆరున్నర గంటల మధ్యలో స్నానాలు చేయడం ఉత్తమమని అంటున్నారు.

విశేష దినంగా :

ఈ మౌనీ అమావాస్యకు ఎంతో విశేషం ఉంది. సూర్యుడు చంద్రుడు ఇద్దరూ మకర రాశిలో ఉంటారు. అలాగే గురువు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే నదీ స్నానం శ్రేష్టమైనది అని చెబుతారు. ఈ రోజున మంచి మాటలే మాట్లాడాలి. అయితే నోరు తెరిస్తే ఏమి మాట్లాడుతామో తెలియదు కాబట్టి మౌనంగా ఉండడమే మేలు అని భావించే మౌన దీక్ష చేయమని పెద్దలు చెబుతారు. ఇక గతించిన తమ పెద్దలకు పిండ ప్రదానం ఈ రోజున చేస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది. మొత్తానికి మౌనీ అమావాస్య రోజున భక్తితో ఉండాలని శాస్త్రం అయితే చెబుతోంది.