Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని ట్రంప్ వణికిస్తుంటే.. పెద్దన్నను ప్రకృతి షాకిస్తోంది

ఫెర్న్ గా పేర్కొంటున్న ఈ తుఫాను ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణంగా చెబుతున్నారు.

By:  Garuda Media   |   25 Jan 2026 3:40 PM IST
ప్రపంచాన్ని ట్రంప్ వణికిస్తుంటే.. పెద్దన్నను ప్రకృతి షాకిస్తోంది
X

ఏ ముహుర్తంలో డొనాల్డ్ ట్రంప్ ను రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా అమెరికన్లు ఎన్నుకున్నారో కానీ.. అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు ఆయనో పెద్ద పీడగా మారారు. అమెరికా ఫస్ట్ పేరుతో ఆయన చేస్తున్న చేష్టలు.. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి కొత్త తిప్పలు తీసుకొస్తున్న పరిస్జితి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అగ్రరాజ్య అధిపతి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అభినవ తుగ్లక్ మాదిరి ఆయన నిర్ణయాలు ఉంటున్నాయన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అమెరికా శ్రేయస్సు కోసం.. దాని భవిష్యత్తు కోసం అవసరమైతే తాము కోరుకున్న ఏ దేశమైనా తమలో కలిసిపోవాలి.. తమ పాదాక్రాంతం కావాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. నిలకడ లేని విధానాలు.. నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఆగమాగం అవుతున్న పరిస్థితి. ఇలా ప్రపంచాన్ని ట్రంప్ వణికిస్తుంటే.. ఆ దేశాన్ని మాత్రం ప్రకృతి గజగజలాడేలా చేస్తోంది. ఊహించని రీతిలో చోటు చేసుకున్న వాతావరణ మార్పులు అమెరికాకు షాకులుగా మారాయి. భారీ మంచు తుఫాను ఆ దేశాన్ని వణికిస్తోంది.

దేశంలోని పలు ప్రాంతాల్లో.. భారీ మంచు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మొత్తం 50 రాష్ట్రాల సముదాయమైన అమెరికాలో ప్రస్తుతం 18 పైగా రాష్ట్రాలు మంచు తుఫానుతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మంచు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బయట మొత్తం అడుగుల లోతున మంచు పేరుకుపోయింది. దీంతో జనజీవనం స్తంభించి పోయిన పరిస్థితి. పద్దెనిమిది రాష్ట్రాల్లో వాతావరణ అత్యవసర పరిస్థితిని విధించారు.

ఫెర్న్ గా పేర్కొంటున్న ఈ తుఫాను ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణంగా చెబుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అతి తీవ్రమైన తుఫానుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ దశాబ్దంలోనే అత్యంత దారుణమైన తుఫానుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఎంతో అత్యవసరమైతే తప్పించి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దన్న హెచ్చరికల్ని స్థానిక ప్రభుత్వాలు జారీ చేశాయి చాలా రాష్ట్రాల్లో విమాన సర్వీసులు ఆపేశారు. దాదాపు 10 వేల విమానాల సర్వీసులు నిలిచిపోయాయి. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు.. కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు ఎగబడటంతో దుకాణాల్లో వస్తువులు ఖాళీ అయిపోయాయి. అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి.

ఓక్లహామా నుంచి బోస్టన్ దాకా 1500 మైళ్ల మేర తీవ్ర తుఫానుకు ప్రభావితమైన పరిస్థితి. నార్త్ డకోటాతో సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి మైనస్ 40కు పడిపోయాయి. దీంతో వాహనాలు కూడా నడవని పరిస్థితి. టెక్సాస్స నుంచి వర్జీనియా వరకు భారీగా కురుస్తున్న మంచుతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదలు కొని వాణిజ్య రాజధాని న్యూయార్క్ సైతం మంచులో కూరుకుపోయిన పరిస్థితి.

అతి శీతల గాలులు భారీగా వీస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల చెట్లు.. కరెంటు స్తంభాలు నేలకు ఒరుగుతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నపరిస్థితి. చలి తీవ్రతకు తాళలేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్క శుక్రవారమే అమెరికా వ్యాప్తంగా 95 వేలకు పైగా కరెంటు కోతలు నమోదయ్యాయి. వీటిల్లో 37 వేలకు పైనే టెక్సాస్ లో చోటు చేసుకున్నాయి. మొత్తంగా ప్రకృతి కన్నెర్ర అగ్రరాజ్యాన్ని.. అగ్రరాజ్య ప్రజల్ని వణికిపోయేలా చేస్తున్న పరిస్థితి.