వేలంటైన్స్ డే స్పెషల్... మీ ‘ఎక్స్’ పై కోపం ఇలా తగ్గించుకుంటారా..!
ఈ వాలంటైన్స్ డే సందర్భంగా... ‘డాలర్స్ ఫర్ డంగ్’ అనే నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రకటించింది అమెరికాలోని మేరీల్యాండ్ జూ. ఇందులో పాల్గొనేవారు తమ "మాజీ"ల పేరును జంతువుల మలం కుప్పకు పెట్టొచ్చు.
By: Raja Ch | 11 Feb 2026 5:00 PM ISTజీవితంలో ప్రేమించడాలు, ప్రేమించబడటాలు అత్యంత సహజమైన విషయం అనే చెప్పాలి! అయితే ఇందులో కొంతమంది ప్రేమలు సక్సెస్ అయితే, మరికొన్ని ప్రేమలు ఫెయిల్ అవుతుంటాయి.. ఫలితంగా కొంతమందిని లూజర్స్ గా, డ్రింకర్స్ గా మారుస్తుంటాయి. ఒక మనిషి ఉన్నత స్థానాల్లోకి వెళ్లడానికి, పతనమైపోవడానికీ కూడా ఈ "ప్రేమ" చాలా సందర్భాల్లో కారణమవుతుందని చెబుతుంటారు. ఈ సందర్భంగా మోసపోయిన ప్రేమికులు తమ "ఎక్స్"పై కోపాన్ని ప్రదర్శించడానికి ఓ ఆఫర్ తెరపైకి వచ్చింది!
అవును... లవ్ సక్సెస్ అయినవారి సంగతి కాసేపు పక్కనపెడితే.. లవ్ ఫెయిల్యూర్ అయినవారి జీవితాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని అంటారు! అందులో కొంతమంది.. తనను మోసం చేసిన.. వారిపై ఆగ్రహంతో మరింత సక్సెస్ అయ్యి, వారి లైఫ్ వారు హ్యాపీగా బ్రతికితే.. ఇంకొంతమంది మాత్రం వారిపై నిత్యం పీకల్లోతు కోపాన్ని మెయింటైన్ చేస్తుంటారు! ఈ క్రమంలో తమ "ఎక్స్"పై కోపాన్ని తగ్గించుకోవాలనుకునేవారి కోసం అమెరికాలోని ఓ "జూ" ఓ ఆఫర్ తెరపైకి తెచ్చింది!
ఈ వాలంటైన్స్ డే సందర్భంగా... ‘డాలర్స్ ఫర్ డంగ్’ అనే నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రకటించింది అమెరికాలోని మేరీల్యాండ్ జూ. ఇందులో పాల్గొనేవారు తమ "మాజీ"ల పేరును జంతువుల మలం కుప్పకు పెట్టొచ్చు. ఈ సందర్భాన్ని గుర్తుంచుకోవడానికో, షేర్ చేసుకోవడానికో ఉపయోగపడేలా వారికి జూ నిర్వాహకులు ఒక పీడీఎఫ్ సర్టిఫికెట్ ను పంపుతారు. అయితే.. ఇందులో పాల్గొనాలనుకునేవారు 5 డాలర్లు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులను జూ పరిరక్షణకు ఉపయోగించనున్నారు.
ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టిన మేరీల్యాండ్ జ్యూ.. ఈ ప్రేమికుల దినోత్సవం నాడు హార్ట్ బ్రేక్ ను సరదాగా మార్చడానికి "డాలర్స్ ఫర్ డంగ్"సరైన మార్గం అని తెలిపింది. కేవలం 5 డాలర్స్ కి మీరు మీ "మాజీ"పై జంతువుల పేడ కుప్పకు పేరు పెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవచ్చు.. జంతు సంరక్షణ, పరిరక్షణకు మద్దతు ఇస్తూనే దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన మార్గం అని వెల్లడించింది. అంటే.. స్వామికార్యం, స్వకార్యం ఒకే దెబ్బతో అన్నట్లన్నమాట!
కాగా... మేరీల్యాండ్ జూ సుమారు వెయ్యి కంటే ఎక్కువ జంతువులకు నిలయంగా ఉండగా.. అందులో ప్రధానంగా ఆఫ్రికన్ పెంగ్విన్, పనామానియన్ గోల్డెన్ ఫ్రాగ్స్ వంటి వేగంగా అంతరించిపోతున్న జాతులూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజా డాలర్స్ ఫర్ డంగ్ కార్యక్రామానికి సుమారు 30 దేశాల నుంచి నిధులు వచ్చినట్లు చెబుతున్నారు!
