Begin typing your search above and press return to search.

విడాకుల వెనుక చీకటి నిజాలు… తొలిసారి మౌనం వీడిన మేరీ కోమ్

బాక్సింగ్ రింగులో తన పిడికిలి పవర్‌తో ప్రపంచాన్ని గడగడలాడించిన 'మేరీ కోమ్' ఇప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పోరాటం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.

By:  A.N.Kumar   |   11 Jan 2026 1:00 PM IST
విడాకుల వెనుక చీకటి నిజాలు… తొలిసారి మౌనం వీడిన మేరీ కోమ్
X

బాక్సింగ్ రింగులో తన పిడికిలి పవర్‌తో ప్రపంచాన్ని గడగడలాడించిన 'మేరీ కోమ్' ఇప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పోరాటం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఒలింపిక్ పతక విజేతగా భారతీయుల గుండెల్లో నిలిచిన ఆమె తన వైవాహిక బంధం ముగియడానికి గల కారణాలను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

నమ్మకమే కొంపముంచింది.. ఆర్థిక మోసాల వెల్లడి

రింగులో ప్రత్యర్థులను చిత్తు చేయడంలో బిజీగా ఉన్న మేరీ కోమ్ తన సొంత ఇంట్లోనే జరుగుతున్న మోసాన్ని పసిగట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త గురించి ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమయ్యాయి. ఆమె కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తులను తన భర్త తన పేరు మీదకు మార్చుకున్నాడని ఆమె ఆరోపించారు. తన సంతకాన్ని దుర్వినియోగం చేసి భారీ మొత్తంలో అప్పులు చేశాడని.. దీనివల్ల తాను దాదాపు దివాలా తీసే స్థితికి చేరుకున్నానని మేరీ కోమ్ వెల్లడించారు. 2022లో గాయం కారణంగా ఆమె విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఈ ఆర్థిక అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి.

విడాకుల ప్రకటన.. విమర్శలపై ఫైర్!

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలే తనను మౌనం వీడేలా చేశాయని ఆమె స్పష్టం చేశారు. "నన్ను దురాశపరురాలిగా, విలన్‌గా చిత్రీకరిస్తున్నారు. కానీ నేను అనుభవించిన నరకం ఎవరికీ తెలియదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నేను పూర్తిగా విశ్వసించిన వ్యక్తి నన్నే మోసం చేస్తున్నాడని తెలిసిన రోజు నా జీవితంలో అతిపెద్ద షాక్. నేను రింగులో ఎంత ధైర్యంగా పోరాడానో బయట కూడా అంతే ధైర్యంగా పోరాడుతున్నాను అని మేరీ కోమ్ వెల్లడించారు.

నలుగురు పిల్లల కోసం మళ్ళీ సమరానికి సిద్ధం

ప్రస్తుతం ఫరీదాబాద్‌లో నివసిస్తున్న మేరీ కోమ్ భుజాలపై భారీ బాధ్యతలు ఉన్నాయి. తన నలుగురు పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కూడా ఆమె చూసుకోవాల్సి ఉంది. కుంగిపోకుండా మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆమె ఎండార్స్‌మెంట్లు.. కమర్షియల్ ఈవెంట్‌లపై దృష్టి సారిస్తున్నారు.

తన జీవితం ఒక సుదీర్ఘమైన బాక్సింగ్ మ్యాచ్‌లాంటిదని.. ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ లేచి నిలబడి పోరాడటమే తనకు తెలుసని మేరీ కోమ్ చాటిచెప్పారు. క్రీడాకారిణిగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఆమె వ్యక్తిగత జీవితంలోని తుపానులను ఎదుర్కొని మళ్ళీ గెలుస్తుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.