Begin typing your search above and press return to search.

కొత్త చరిత్ర: కశ్మీర్ కు కార్లను ట్రైన్లలో డెలివరీ

తాజాగా కశ్మీర్ వ్యాలీకి మారుతి సుజుకి తమ కొత్త కార్ల స్టాక్ ను రైలుమార్గంలో డెలివరీ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Garuda Media   |   4 Oct 2025 1:41 PM IST
కొత్త చరిత్ర: కశ్మీర్ కు కార్లను ట్రైన్లలో డెలివరీ
X

కశ్మీర్ అన్నంతనే గుర్తుకు వచ్చే అంశాలకు భిన్నంగా ఇటీవల కాలంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. కశ్మీర్ వ్యాలీకి రైలు మార్గాన్ని జమ్ముతో కనెక్టు చేయటంతో ఇప్పుడు రవాణా పరంగా మరింత వేగాన్ని సంతరించుకోవటమే కాదు.. కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. తాజాగా కశ్మీర్ వ్యాలీకి మారుతి సుజుకి తమ కొత్త కార్ల స్టాక్ ను రైలుమార్గంలో డెలివరీ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఇంతకాలం వరకు జమ్ము నుంచి కశ్మీర్ కు ట్రైన్ కనెక్టివిటీ లేకపోవటంతో రోడ్డు మార్గంలోనే కొత్త కార్లను తీసుకెళ్లే వారు. అయితే.. ఈ రోడ్డు మార్గంలో కార్లను తరలించటం క్లిష్టంగానూ.. కష్టంగానూ ఉండేది.అందుకు ఎక్కువ సమయం తీసుకునేది. దీనికి తోడు ప్రతికూల వాతావరణంలో మరింత ఇబ్బందిగా ఉండేది. శీతాకాలం వస్తే రోడ్లను మూసేయటంతో.. వాహన డెలివరీలే కాదు.. వివిధ వస్తు ఉత్పత్తుల తరలింపు కష్టంగా ఉండేది.

ఇటీవల కాలంలో జమ్ము నుంచి కశ్మీర్ వ్యాలీకి రైలు మార్గం అందుబాటులోకి రావటంతో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా కశ్మీర్ వ్యాలీకి భారతీయ రైల్వే సేవల్ని వినియోగించిన మొదటి వాహన సంస్థగా మారుతి సుజుకీ ఇండియా నిలిచింది. జమ్ము - శ్రీనగర్ మధ్యన 300 కిలోమీటర్ల మధ్య నేషనల్ హైవేలో రవాణాకు సమస్యలు ఎదురయ్యేవి. తాజా పరిణామంతో పరిస్థితుల్లో మార్పులు రావటంతో పాటు.. జమ్ము - కశ్మీర్ వ్యాలీకి మధ్య దూరం తగ్గిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాజాగా మారుతీ సుజుకీకి చెందిన మానేసర్ తయారీ ప్లాంట్ నుంచి 116 కార్లతో రైలు శుక్రవారం ఉదయం దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ గూడ్స్ షెడ్ కు చేరిన వైనంతో కొత్త చరిత్రకు నాంది పలికినట్లుగా చెప్పక తప్పుదు.