Begin typing your search above and press return to search.

పవన్ కు వీరజవాన్ తల్లిదండ్రుల రిక్వెస్ట్.. వెరీ ఇంట్రెస్టింగ్

దేశ సరిహద్దుల్లో శత్రువుల తూటాలకు ఎదురొడ్డి నిలిచి, భరతమాత ఒడిలో ఒరిగిన వీర జవాన్ మురళీ నాయక్ మరణించి ఏడాది కావస్తోంది.

By:  Tupaki Political Desk   |   30 March 2026 5:54 PM IST
పవన్ కు వీరజవాన్ తల్లిదండ్రుల రిక్వెస్ట్.. వెరీ ఇంట్రెస్టింగ్
X

దేశ సరిహద్దుల్లో శత్రువుల తూటాలకు ఎదురొడ్డి నిలిచి, భరతమాత ఒడిలో ఒరిగిన వీర జవాన్ మురళీ నాయక్ మరణించి ఏడాది కావస్తోంది. గతేడాది పహల్గాం దాడిలో ఆయన వీరమరణం పొందినప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ కన్నీరు మున్నీరైంది. ఆ సమయంలో జవాన్ స్వగ్రామానికి వెళ్లి, ఆ కుటుంబాన్ని ఎందరో ఓదార్చారు. ముఖ్యంగా జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ వీరజవాన్ మురళీనాయక్ స్వగ్రామానికి వెళ్లి స్వయంగా నివాళులర్పించారు. ఇక ఇప్పుడు మురళీ నాయక్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వైకుంఠ సమారాధన నిర్వహించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తూ మరళినాయక్ తల్లిదండ్రులు వీడియో విడుదల చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఎలా చేరుకోవాలో తమకు తెలియదని, అందుకే వీడియో విడుదల చేస్తున్నామని, ఈ వీడియో పవన్ కు చేరేవరకు షేర్ చేయాలని వీరజవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు కోరారు. ఆ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరోసారి మురళినాయక్ పోరాటాన్ని కళ్ల ముందు కదలాడేలా చేస్తూ కన్నీరు పెట్టిస్తోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కు వీరాభిమాని అయిన మురళి నాయక్ వైకుంఠ సమారాధనకు ఆయన తప్పనిసరిగా హాజరు కావాలని అంతా కోరుకున్నారు.

మురళి నాయక్ తల్లిదండ్రులు ఆహ్వానం డిప్యూటీ సీఎంకు తెలిసేవరకు షేర్ చేయాలని సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు. వచ్చే నెల 14న మురళీ నాయక్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. మురళీ నాయక్ బతికున్నప్పుడు పవన్ కల్యాణ్ అంటే ప్రాణంగా ఉండేవారని, ఆయన సిద్ధాంతాలే తమ బిడ్డకు స్ఫూర్తినిచ్చేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక గతేడాది మురళి నాయక్ తల్లిదండ్రులను పరామర్శించే సమయంలో పవన్ చూపిన మానవత్వం, ప్రకటించిన ఆర్థిక సాయం ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. ఇప్పుడు ఏడాది గడిచిన తర్వాత, తమ బిడ్డ ఆత్మ శాంతించాలంటే ఆ 'జనసేనాని' సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగాలని వారు బలంగా ఆకాంక్షిస్తున్నారు.

పవన్ నిర్ణయం ఇప్పుడు కీలకం

ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా, ప్రభుత్వ బాధ్యతల్లో అత్యంత బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. తన అభిమాని కుటుంబం చేసిన ఈ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది. రాజకీయం కంటే మానవత్వానికి, తనను నమ్మిన అభిమానులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పవన్.. కచ్చితంగా ఏదో ఒక రూపంలో తన మద్దతును తెలుపుతారని అభిమానులు భావిస్తున్నారు.