పెళ్లైన మహిళలు ఎక్కువగా వెతికేది ఇవేనా?
మొత్తంగా చూస్తే గూగుల్ అనేది వివాహిత మహిళలకు ఒక రహస్య స్నేహితురాలిలా మారిపోయింది.
By: Madhu Reddy | 23 April 2026 8:00 PM ISTపెళ్లి తర్వాత ఒక మహిళ జీవితం పూర్తిగా మారిపోతుంది. కొత్త బాధ్యతలు, కొత్త మనుషుల మధ్య తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో బయట ఎవరినీ అడగలేని ఎన్నో సందేహాలకు పరిష్కారం కోసం నేటి గృహిణులు 'గూగుల్ తల్లి'ని ఆశ్రయిస్తున్నారు. భర్త ఇష్టాయిష్టాల నుంచి అత్తమామల మనసు గెలుచుకోవడం వరకు.. వివాహిత మహిళలు గూగుల్‌లో ఎక్కువగా వెతికే ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భర్త మనసు గెలవడం ఎలా?:
పెళ్లయ్యాక ప్రతి భార్య కోరుకునేది భర్త ప్రేమను, గుర్తింపును. అందుకే చాలామంది మహిళలు "భర్తను ఎలా ఇంప్రెస్ చేయాలి?", "ఆయనకు నచ్చే వంటకాలు ఏవి?" వంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. భర్త ఎప్పుడూ ఫోన్‌తో లేదా పనితో బిజీగా ఉంటే, ఆయనను ఎలా దారికి తెచ్చుకోవాలి? తమతో ఎక్కువ సమయం గడిపేలా ఎలా చేయాలి? అన్న చిట్కాల కోసం వెతుకుతుంటారు. ఇక ఇది ఆధిపత్యం కోసం కాదు, తమ వైవాహిక జీవితం మరింత మధురంగా ఉండాలనే తాపత్రయంతో చేసే శోధన మాత్రమే.
అత్తమామలతో సత్సంబంధాలు - మాతృత్వం:
భారతీయ కుటుంబాల్లో అత్తమామలతో కలిసిపోవడం ఒక సవాలుతో కూడిన పని. అందుకే కొత్త కోడళ్లు గూగుల్‌ను ఒక మెంటార్‌లా భావిస్తూ "అత్తగారిని ఎలా మెప్పించాలి?", "ఉమ్మడి కుటుంబంలో అందరితో ఎలా కలిసి ఉండాలి?" అనే సూత్రాలను వెతుకుతున్నారు. వీటితో పాటు మాతృత్వానికి సంబంధించిన అంశాలు సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటాయి. ఇక గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పెంపకం, ఒకవేళ భర్తకు పిల్లలు వద్దంటే ఆయనను ఎలా ఒప్పించాలి వంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాల కోసం మహిళలు గూగుల్‌ను అడుగుతున్నారు.
అందం.. ఆరోగ్యం.. అదనపు ఆదాయం:
ఎన్ని ఇంటి పనులున్నా, తనను తాను అందంగా ఉంచుకోవాలనే కోరిక ప్రతి మహిళకు ఉంటుంది. అందుకే పెళ్లి తర్వాత వచ్చే శారీరక మార్పులను ఎలా తగ్గించుకోవాలి, చర్మ సంరక్షణ వంటి చిట్కాల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేటి మహిళలు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. అందుకే "ఇంట్లో ఉండే ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?", "పెళ్లి తర్వాత కెరీర్‌ను ఎలా కొనసాగించాలి?" వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు.
గూగుల్ - ఒక సీక్రెట్ ఫ్రెండ్:
మొత్తంగా చూస్తే గూగుల్ అనేది వివాహిత మహిళలకు ఒక రహస్య స్నేహితురాలిలా మారిపోయింది. బయట ఎవరితోనూ పంచుకోలేని భయాలు, సందేహాలు, చిన్నపాటి అసంతృప్తులకు పరిష్కారం కోసం వారు సెర్చ్ ఇంజిన్‌ను నమ్ముకుంటున్నారు. ఇక అటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే, ఇటు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి గూగుల్ ఇచ్చే సమాచారం వారికి ఎంతో తోడ్పడుతోంది. తమ కుటుంబం సంతోషం కోసం వారు పడే తపన అంతా ఈ సెర్చ్ హిస్టరీలోనే కనిపిస్తోంది.
