Begin typing your search above and press return to search.

యువతలో సరికొత్త మార్పు.. అలాంటి పెళ్లికే ఓటు..

సాధారణంగా పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం . కాబట్టి చాలా హుందాగా.. లగ్జరీగా వివాహం చేసుకోవాలని చాలామంది కలలు కంటారు.

By:  Madhu Reddy   |   13 Dec 2025 11:12 AM IST
యువతలో సరికొత్త మార్పు.. అలాంటి పెళ్లికే ఓటు..
X

సాధారణంగా పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం . కాబట్టి చాలా హుందాగా.. లగ్జరీగా వివాహం చేసుకోవాలని చాలామంది కలలు కంటారు. అలా పెళ్లి అంటే మూడు ముళ్లు.. ఏడడుగులు.. 2 మనసుల కలయిక.. పెళ్లి అంటే భాజా భజంత్రీలు.. బంధుమిత్రులు.. మామిడి తోరణాలు.. పిల్లల అల్లర్లు.. బావ మరదళ్ల సరదాలు.. పసందైన పిండి వంటలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో.. ఒకప్పుడు ఐదు రోజుల పాటు జరిగే ఈ పెళ్లిళ్లు ఇప్పుడు లక్షలు కాదు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి మరి రెండు రోజుల్లోనే పెళ్లి తంతును పూర్తి చేస్తున్నారు.

తల్లిదండ్రులు జీవితకాలం సంపాదించిన డబ్బును పెళ్లి పేరిట ఇలా వృధాగా ఒకటి, రెండు రోజుల్లో ఖర్చు చేయడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. అయితే ఇలా చేస్తేనే పెళ్లి అంటారా.. సింపుల్గా వివాహం చేసుకుంటే అది పెళ్లి కాదా.. ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలి అని ఈతరం యువత కంకణం కట్టుకుందేమో అనిపిస్తుంది. తాజాగా కొంతమంది యువత తమ పెళ్లి సందర్భంగా చేసిన పనులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్షల రూపాయలను వృధాగా ఖర్చు చేసి.. పెళ్లి చేసుకోవడం కంటే ఆ డబ్బులు ఇతరులకు ఉపయోగించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం ఉత్తమం అని నిరూపిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈమధ్య కాలంలో ఆదర్శ వివాహానికి యువత ఎక్కువగా ఓటు వేస్తున్నారు. అందులో భాగంగానే వివాహానికి ఖర్చు చేయాలనుకున్న డబ్బును తిరిగి సమాజానికి సేవగా ఇస్తున్నారు. ఇటీవల కేరళలోని ఇడుక్కి అనే ప్రాంతానికి చెందిన కలేష్ కుమార్ , సుజిత దంపతులు ఇలాగే తమ వివాహానికి వచ్చిన బహుమతులను వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటన బాధితులకు సహాయంగా అందించారు. బబ్లు చౌదరి, భూమిక పాండే వెధర్భా ప్రాంతానికి చెందిన పేద రైతులు, వితంతు వివాహాలకు అయ్యే ఖర్చును తామే స్వయంగా భరిస్తున్నారు.

పోలీస్ దంపతులైన మనోజ్ పాటిల్, సరితా లేఖర్ కూడా తమ వివాహానికి ఎటువంటి ఖర్చు చేయకుండా ఆ డబ్బును తమ గ్రామ ఉన్నత పాఠశాల, పబ్లిక్ లైబ్రరీకి విరాళాలు ఇచ్చారు. ఇక్కడ ఒక జంట వినూత్నంగా ఆలోచించి పేద పిల్లల చదువులకు కావాల్సిన డబ్బులు సమకూర్చారు. కాన్పూర్ లోని అమిత్, దీక్ష యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 11 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకొని వారి చదువులకు అయ్యే పూర్తి ఖర్చులను తామే భరిస్తామని నిర్ణయించుకున్నారు.

మరోవైపు ఐఆర్ఎస్ అధికారులైన చందన్ కుమార్, కృష్ణమూర్తిలు విభిన్నంగా తమ ఇంట్లోని పూజ గదిలోనే పెళ్లి చేసుకొని.. పెళ్లికి అవ్వాల్సిన ఖర్చు మొత్తాన్ని 20 మంది పిల్లలు చదువు కోసం కేటాయించారు.

ఇలా ఎంతోమంది యువత.. సమాజంలో మార్పు కోసం పాటుపడుతూ జీవితంలో అత్యంత ఘనంగా జరుపుకోవాల్సిన వేడుకలను సింపుల్గా జరుపుకుంటూ.. వాటి ద్వారా మిగిలిన డబ్బును సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నారు. ఇక వారు అలా చేస్తున్నారు

. వీరు ఇలా చేస్తున్నారు అని మనం ఎక్కడో పేపర్లో చదవడం కంటే మనలో కూడా ఇలాంటి మార్పు వస్తే సమాజం ఇంకా మెరుగు పడుతుంది అని చెప్పవచ్చు.. ఏది ఏమైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తేనే సమాజం బాగుపడుతుంది అనడంలో సందేహం లేదు