Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా ఎడ్యుకేషన్‌ ఎక్స్పెరిమెంట్‌.. వివాదంలో ‘మెటా’ జుకర్ బర్గ్

ప్రపంచ ప్రఖ్యాత సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ మెటా (Meta) అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ తాజాగా ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు.

By:  A.N.Kumar   |   7 Nov 2025 9:04 PM IST
సీక్రెట్ గా ఎడ్యుకేషన్‌ ఎక్స్పెరిమెంట్‌.. వివాదంలో ‘మెటా’ జుకర్ బర్గ్
X

ప్రపంచ ప్రఖ్యాత సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ మెటా (Meta) అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ తాజాగా ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఈసారి ఏదైనా సాంకేతిక ఆవిష్కరణతో కాకుండా తన ఇంట్లో రహస్యంగా ఒక ప్రైవేట్‌ పాఠశాలను నడపడం ద్వారా వార్తల్లో నిలిచారు.

* వివాదానికి కారణమైన 'బికెన్‌ బెన్‌ స్కూల్‌'

కేలిఫోర్నియాలోని సంపన్న ప్రాంతమైన పాలో ఆల్టో లోని తన విశాలమైన నివాసంలో జుకర్‌బర్గ్‌ 2021లోనే "బికెన్‌ బెన్‌ స్కూల్‌" పేరుతో ఒక అనధికారిక ప్రైవేట్‌ పాఠశాలను ప్రారంభించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పాఠశాలలో మాంటిస్సోరీ (Montessori) విధానంలో బోధన అందించారు. ఇక్కడ 30 నుండి 40 మంది విద్యార్థులకు విద్యను అందించినట్లు తెలుస్తోంది.

* స్థానికులకు అనుమానం – నిరసనలు

మొదట్లో రహస్యంగా సాగిన ఈ విషయం, ప్రతిరోజూ ఉదయం చిన్నారులను దింపుతున్న కార్లు జుకర్‌బర్గ్‌ ఇంటి వద్ద వరుసగా ఆగడం వలన స్థానికులకు అనుమానాలను రేకెత్తించింది. విచారణలో ఆయన నివాసంలోనే పాఠశాల నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

2022లోనే దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు నిరసనలు ప్రారంభించారు. జుకర్‌బర్గ్‌ లాంటి ప్రముఖుడు నిబంధనలు ఉల్లంఘించినా, అధికార యంత్రాంగం కళ్లుమూస్తోందని వారు తీవ్రంగా ఆరోపించారు.

* నోటీసులు – పాఠశాల మూసివేత

చివరికి 2024లో అధికారికంగా ఫిర్యాదు నమోదయిన తర్వాతే అధికారులు స్పందించారు. అనుమతులు లేకుండా పాఠశాలను నడపడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తూ, 2024 మార్చిలో జుకర్‌బర్గ్‌కు నోటీసులు జారీచేశారు. పలుమార్లు వివరణలు ఇచ్చిన అనంతరం, ఆ స్కూల్‌ను చివరకు 2024 ఆగస్టులో అధికారికంగా మూసివేశారు.

మెటా ప్రతినిధి బ్రియాన్‌ బేకర్‌ ప్రకారం... స్కూల్‌ను పూర్తిగా మూసివేయలేదని, కేవలం మరో ప్రాంతానికి మార్చారని తెలిపారు. అయితే, ఆ కొత్త ప్రదేశం వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు.

* పాత వివాదాల కొనసాగింపు

సిలికాన్‌ వ్యాలీ ప్రజలతో జుకర్‌బర్గ్‌ ఘర్షణలు కొత్తేమీ కాదు. గత పదేళ్లుగా ఆయన ఎస్టేట్‌లో నిరంతరం జరుగుతున్న నిర్మాణాలు, భారీ శబ్ద కాలుష్యం కారణంగా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే పాలో ఆల్టో పరిసరాల్లో 11 ప్రాపర్టీలను కొనుగోలు చేసి, వాటిని కలిపి ఒక సూపర్‌ ఎస్టేట్‌గా మార్చారు.

ఇప్పుడు "సీక్రెట్‌ స్కూల్‌" వివాదం కూడా దీనికి తోడు కావడంతో, టెక్‌ ప్రపంచంలో నూతన ఆవిష్కర్తగా పేరొందిన ఈ బిలియనీర్‌... ఈసారి మాత్రం "ఎడ్యుకేషన్‌ ఎక్స్పెరిమెంట్‌" కారణంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.