Begin typing your search above and press return to search.

H-1B వీసా వివాదం: రిపబ్లికన్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు..

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) కూటమిలో బలమైన వాణిగా ఉన్న టేలర్ గ్రీన్ తాజాగా H-1B వీసా విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు.

By:  A.N.Kumar   |   23 Nov 2025 8:00 PM IST
H-1B వీసా వివాదం: రిపబ్లికన్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు..
X

అమెరికా రాజకీయాలను కలవరపరిచే ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత వివాదాస్పదమైన H-1B వీసా ప్రోగ్రామ్ రద్దుపై రిపబ్లికన్ పార్టీలో తలెత్తిన తీవ్ర విభేదాలు, చివరకు ఆ పార్టీ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ సంచలన రాజీనామాకు దారితీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమెకు ఏర్పడిన దూరం, పార్టీ లోపల ఒంటరితనం నేపథ్యంలో గ్రీన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి తాను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రంప్‌తో ఢీకొన్న టేలర్ గ్రీన్ బిల్లు

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) కూటమిలో బలమైన వాణిగా ఉన్న టేలర్ గ్రీన్ తాజాగా H-1B వీసా విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమం "అమెరికన్ ఉద్యోగాలకు నష్టం కలిగిస్తూ విదేశీ ప్రతిభను ప్రోత్సహిస్తోంది" అని ఆరోపిస్తూ కాంగ్రెస్‌లో H-1B రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ విషయంలో ఆమె వైఖరి పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఉంది. అదే సమయంలో జరిగిన MAGA సమావేశంలో ట్రంప్ H-1B కార్యక్రమాన్ని బలంగా సమర్థించారు. "అమెరికాలోని కొన్ని ముఖ్య రంగాలలో నిపుణుల కొరత ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి విదేశీ ప్రతిభ అవసరం," అని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు టేలర్ గ్రీన్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. విదేశీ నిపుణుల ఆహ్వానం అవసరం లేదనే వాదనను బలంగా వినిపిస్తూ ఆమె తన బిల్లును ముందుకు తీసుకెళ్లారు.

మద్దతు ఉపసంహరించుకున్న ట్రంప్

టేలర్ గ్రీన్ బిల్లు ప్రవేశపెట్టిన 24 గంటల్లోనే ట్రంప్ బహిరంగంగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆమె ట్రైటర్ (ద్రోహి)" అని ఆమెను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. "నా ఉద్దేశం MAGA సమావేశంలో చెప్పాను. అది ఆమెకు అర్థం కాలేదు," అని ట్రంప్ అన్నారు. అంతేకాక, ఆమెకు ఇస్తున్న మద్దతును పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. దీంతో పార్టీ లోపల టేలర్ గ్రీన్ పూర్తిగా ఒంటరిగా మారిపోయారు.

రాజీనామా ప్రకటన: రిపబ్లికన్ శిబిరంలో సంక్షోభం

ట్రంప్ నుంచి వ్యతిరేకత, పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో మార్జోరీ టేలర్ గ్రీన్ చివరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. "జనవరి 5 నుంచి హౌస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను," అని ఆమె ప్రకటించారు. MAGA కాంప్‌లో కీలకమైన గ్రీన్ వైదొలగడం రిపబ్లికన్ పార్టీకి భారీ రాజకీయ నష్టంగా పరిగణించబడుతోంది. ఇది రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీలో శక్తుల సమీకరణాన్ని మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

H-1B: మళ్లీ కేంద్రంగా మారిన వీసా

ఈ పరిణామం మరోసారి H-1B వీసా ప్రోగ్రామ్‌ను అమెరికన్ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా నిలబెట్టింది. ఇండియన్లు , ఐటీ రంగానికి అత్యంత కీలకమైన ఈ వీసాపై భిన్న వాదనలు ఉన్నాయి. ఒక వర్గం ప్రతిభ లోటును నింపడంలో ఈ ప్రోగ్రామ్ కీలకమని వాదిస్తోంది. మరో వర్గం మాత్రం ఇది అమెరికన్ల ఉద్యోగాలను హరిస్తుందనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తోంది. టేలర్ గ్రీన్ రాజీనామాతో ఈ వీసాకు సంబంధించిన వివాదం మరింత వేడెక్కే అవకాశం ఉంది.