Begin typing your search above and press return to search.

మచాడోకు నోబెల్ శాంతి బహుమతి మనస్సాక్షి లేని నిర్ణయమా?

అటు ఆమెకు మద్దతుగా ఉంటానని ట్రంప్ సైతం ప్రకటించారు! ఈ క్రమంలో తాజాగా ఆమెపై విమర్శలు మొదలయ్యాయి.

By:  Raja Ch   |   12 Oct 2025 3:00 AM IST
మచాడోకు నోబెల్  శాంతి బహుమతి మనస్సాక్షి లేని నిర్ణయమా?
X

వెనెజువెలా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు అయిన మరియా కొరీనా మచాడోకు అత్యున్నత గౌరవం లభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. అయితే... ఇంత అత్యున్నత పురస్కారాని ఎంపికైన ఆమె తాజాగా విమర్శలు ఎదుర్కోవడం వైరల్ గా మారుతోంది!

అవును... ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన రాజకీయ నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించిన సంగతి తెలిసిందే. వెనిజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నార్వే నోబెల్‌ కమిటీ వెల్లడించింది. అటు ఆమెకు మద్దతుగా ఉంటానని ట్రంప్ సైతం ప్రకటించారు! ఈ క్రమంలో తాజాగా ఆమెపై విమర్శలు మొదలయ్యాయి.

ఇజ్రాయెల్ - హమాస్ మధ్యలో మరియా!:

వెనిజులా ప్రజాస్వామ్య కార్యకర్త మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి వరించిన అనంతరం తాజాగా ఓ వివాదం తలెత్తింది. ఇందులో భాగంగా.. ఆమె గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన బాంబు దాడులకు మద్దతు ఇచ్చిందని.. ఆమె దేశంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విదేశీ జోక్యానికి కూడా పిలుపునిచ్చిందని విమర్శకులు ఎత్తి చూపారు.

అక్టోబర్ 7, 2023న హమాస్ ఆకస్మిక దాడి తర్వాత ఆమె ఇజ్రాయెల్‌ కు సంఘీభావం ప్రకటించినప్పటికీ.. పాలస్తీనియన్లపై ఐడీఎఫ్ చేస్తోన్న పనులపై మాత్రం ఆమె వివేకంతో ఎప్పుడూ ఖండించలేదని అంటున్నారు! ఈ సందర్భంగా... ఆమె గత కొన్ని సంవత్సరాలుగా చేసిన పోస్టులు ఆమె నెతన్యాహు మిత్రురాలిని ధృవీకరిస్తున్నాయని చెబుతున్నారు.

నెతన్యాహు పార్టీకి మద్దతుపై సంతకం!:

మరోవైపు... 2020లో ఇజ్రాయెల్‌ లోని అధికార లికుడ్ పార్టీతో మచాడో సహకార పత్రంపై సంతకం చేశారని నార్వేజియన్ శాసనసభ్యుడు బ్జోర్నార్ మోక్స్నెస్ ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలో... గాజా మారణహోమంకు లికుడ్ పార్టీ బాధ్యత వహిస్తున్నందువల్ల ఈ అవార్డు నోబెల్ ఉద్దేశ్యానికి అనుగుణంగా లేదని ఆయన అన్నారు.

ఇదే క్రమంలో.. ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వంటి అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయాలనేది పూర్తిగా మనస్సాక్షి లేని నిర్ణయం అంటూ అమెరికా-ఇస్లామిక్ సంబంధాల మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో.. నోబెల్ కమిటీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరింది.