మార్గదర్శి : దశాబ్దాల కేసుకు తెర !
2011లో మార్గదర్శి హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసింది. 2018లో ఉమ్మడి హైకోర్టు ఈ కేసును క్వాష్ చేసింది.
By: Garuda Media | 21 Aug 2026 11:53 AM ISTరిజర్వుబ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్టాలను ఉల్లంఘించి 1997 నుండి 2006 వరకు రూ.2,541.59 కోట్లు సాధారణ ప్రజలు 2.75 లక్షల మంది నుండి డిపాజిట్లు సేకరించారని అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా 2008లో కేసులు నమోదు అయ్యాయి.
దాదాపు రెండు దశాబ్దాల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులలో సాగిన ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఈ పిటీషన్ దాఖలు వెనక ప్రజాప్రయోజనం కన్నా, వ్యక్తిగత ప్రయోజనం ఎక్కువగా కనిపిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
2006లో ఉండవల్లి ఫిర్యాదు ఆధారంగా 2008లో క్రిమినల్ కేసు నమోదు అయింది. 2011లో మార్గదర్శి హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసింది. 2018లో ఉమ్మడి హైకోర్టు ఈ కేసును క్వాష్ చేసింది. సేకరించిన డిపాజిట్లలో 2018 వరకు రూ.2596.98 కోట్లు తిరిగి చెల్లించారని, 5.33 కోట్లు ఖాతాల్లో ఉన్నందున కేసును క్వాష్ చేయడం జరిగింది. 2020లో ఉండవల్లి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను పార్టీలుగా చేర్పింది.
2024 ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు 2018లో తెలంగాణ హైకోర్టు తీర్పును రద్దు చేసి తిరిగి పంపింది. 2024 సెప్టెంబరు 26న హైకోర్ట్ రిజిస్ట్రీ పబ్లిక్ నోటీసు ఇచ్చింది. అయితే ఎవరూ క్లయిమ్స్ కు రాలేదు. దీంతో 2025 ఆగస్టు 4న తెలంగాణ హైకోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేసింది. దీంతో 2025లో హైకోర్టు తీర్పుపై ఉండవల్లి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటీషన్ ను డిస్మిస్ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మార్గదర్శికి పెద్ద ఊరటగా దీనిని భావించవచ్చు.
