Begin typing your search above and press return to search.

రెండో రోజు ఎన్కౌంటర్.. ఏడుగురు హతం, మృతుల్లో అగ్రనేతలు

చత్తీస్ ఘడ్ నుంచి మావోయిస్టులు ఏపీలోకి తరలిరావడంతో పోలీసుల నిఘా ఒక్కసారిగా పెరిగింది.

By:  Tupaki Political Desk   |   19 Nov 2025 3:33 PM IST
రెండో రోజు ఎన్కౌంటర్.. ఏడుగురు హతం, మృతుల్లో అగ్రనేతలు
X

అల్లూరి జిల్లా మారేడిమిల్లిలో వరుసగా రెండో రోజు ఎన్ కౌంటర్ జరిగింది. నవంబరు 18వ తేదీ మంగళవారం వేకువజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మాతో పాటు మరో ఐదురుగు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తప్పించుకున్న కొందరు మావోయిస్టులను బుధవారం ఉదయం పోలీసులు మట్టుబెట్టారు. మంగళవారం ఎదురుకాల్పులు జరిగిన చోటుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఏడుగురు నక్సల్స్ ఉన్నట్లు కూంబింగ్ దళాలు గుర్తించాయి. బలగాలు చుట్టుముట్టినట్లు గుర్తించిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారని పోలీసులు ప్రకటించారు. ఎన్ కౌంటరును ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు.

ఈ ఎన్ కౌంటరులో సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ ఇన్చార్జి జోగారావు అలియాస్ టెక్ శంకర్, దివంగత నేత నంబాల కేశవరావు ప్రోటెక్షన్ టీం కమాండర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నట్లు తొలుత వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కాగా, మృతులు అంతా చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు చెబుతున్నారు. మొత్తం నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఈ ఎన్కౌంటరులో చనిపోయారు. జోగారావు, జ్యోతితోపాటు సురేశ్, గణేష్, వాసు, అనిత, షమ్మిగా మిగిలిన వారిని గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

చత్తీస్ ఘడ్ నుంచి మావోయిస్టులు ఏపీలోకి తరలిరావడంతో పోలీసుల నిఘా ఒక్కసారిగా పెరిగింది. ఏవోబీతోపాటు తూర్పు, విశాఖ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనూ మావోయిస్టులు ఉన్నారేమోనన్న అనుమానంతో హై అలర్ట్ ప్రకటించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో గాలించి మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే 30 మంది వరకు మావోయిస్టులు పట్టుబడటం సంచలనంగా మారింది.

ఇక మావోయిస్టు ఆపరేషన్ పై ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్డా బుధవారం మీడియాతో మాట్లాడారు. మారేడుమిల్లిలో జరిగిన రెండు ఎన్కౌంటర్లను గుర్తిస్తున్నట్లు చెప్పడమే కాకుండా, మంగళవారం నాటి ఘటనలో హిడ్మా మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరే మార్గం లేదని, బయట ఉన్న వారంతా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న మావోయిస్టులు అంతా చత్తీస్ ఘడ్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ చొరబడకుండా పటిష్టనిఘా వేసినట్లు తెలిపారు. కాగా, నిన్న అరెస్టు అయిన వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, ప్లాటూన్ మెంబర్లు 23, డివిజనల్ కమిటీ మెంబర్లు 5, ఏరియా కమిటీ మెంబర్లు 19 ఉన్నారని ఏడీజీ వివరించారు.