అమెరికాలో తెలివితక్కువ, బుద్ధిహీనమైన, ద్వేషపూరిత వ్యక్తులు ఉన్నారు.. మార్క్ రూబియో హాట్ కామెంట్స్
అమెరికాలో భారతీయులు.. ప్రవాస భారతీయ సమాజంపై పెరుగుతున్న వ్యతిరేకత.. మతపరమైన దాడుల ప్రతిపాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By: A.N.Kumar | 21 Oct 2026 11:45 AM ISTఅమెరికాలో భారతీయులు.. ప్రవాస భారతీయ సమాజంపై పెరుగుతున్న వ్యతిరేకత.. మతపరమైన దాడుల ప్రతిపాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విదేశాల్లో స్థిరపడిన భారతీయుల భద్రత, సామాజిక గౌరవంపైన ఈ పరిణామాలు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం వంటి కీలక రంగాల్లో అమెరికా అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్న ప్రవాస భారతీయులపై ద్వేషపూరిత భావజాలం వ్యక్తమవడం పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత పర్యనటలో ఉన్న అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్క్ రూబియోను తాజాగా భారతీయ విలేఖరి ఇంటర్వ్యూ చేశారు. అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న ద్వేషం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సమాజంలో కొందరు తెలివితక్కువ, బుద్ధిహీనమైన, ద్వేషపూరిత వ్యక్తులు ఉంటారనే విషయాన్ని ఆయన అంగీకరించినప్పటికీ ఈ సమస్య అమెరికా అంతటా వ్యాపించిందని చెప్పడం సమంజసం కాదని’’ స్పష్టం చేశారు. ద్వేషపూరిత భావజాలం ఒక్క అమెరికాకే పరిమితం కాదని.. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయని వ్యాఖ్యానించారు. కొందరి అభిప్రాయాలు.. అక్రమ చర్యలను ఆధారం చేసుకుని మొత్తం అమెరికా సమాజానికి భారత్ వ్యతిరేక ముద్ర వేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేకత కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ కనిపిస్తోందనేది కొదనగలిగిన వాస్తవం. హెచ్-1బీ వీసాలు, ఉద్యోగ అవకాశాలు, వలస విధానాల చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చలు క్రమంగా జాతీయతా ఆధారిత వివక్షగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ విధానాలను లేదా నియామకాల ప్రాధాన్యతలను విమర్శించడం వేరు..ఒక వ్యక్తి జాతి లేదా మతం ప్రాతిపదికన వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వేరు. విధానపరమైన చర్చకు, జాతి విద్వేషానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనికి తోడు ప్రచురితమైన గణాంకాలు కూడా ఈ పరిస్థితుల తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. ఆయా నివేదికల ప్రకారం.. అమెరికాలో మొత్తం ద్వేషపూరిత నేరాల సంఖ్య కొంత తగ్గినప్పటికీ మైనారిటీ వర్గాలు.. మతపరమైన సమూహాలైన సిక్కులు, హిందువులపై దాడులు లేదా ద్వేషపూరిత ఘటనలు పెరుగుతుండటం గమనార్హం. ఇటీవల ఇల్లినాయిస్లోని అరోరా ప్రాంతంలో ఉన్న ఒక హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం ఈ భయాలను నిజం చేస్తోంది.
భారత్-అమెరికా మధ్య రక్షణ, వాణిజ్యం, విద్య, పరిశోధన రంగాల్లో సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. ఇరు దేశాల బంధానికి ప్రవాస భారతీయులే ప్రధాన వారధిగా నిలుస్తున్నారు. కొందరు వ్యక్తులు చేసే విద్వేషపూరిత కామెంట్లు ఈ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయలేవు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలను కేవలం వ్యక్తిగత ద్వేషంగా కొట్టిపారేయకుండా.. బాధితులకు తగిన న్యాయం అందించడం, వర్ణ వివక్ష.. మత ద్వేషానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం అమెరికా యంత్రాంగానికి ఎంతో ముఖ్యం. దౌత్య బంధాలు బలంగా ఉండటంతో పాటు క్షేత్రస్థాయిలో పౌరుల భద్రతకు హామీ లభించినప్పుడే ప్రవాసుల్లో ఆత్మవిశ్వాసం నిలుస్తుంది.
