మావోయిస్టుల శాంతి సందేశాలు.. తెలంగాణ ప్రభుత్వానికి సంచలన లేఖ
గత ఆరు నెలలుగా పాటిస్తున్న కాల్పుల విరమణను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఓ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
By: Tupaki Political Desk | 3 Nov 2025 5:18 PM ISTమావోయిస్టు పార్టీ తెలంగాణశాఖ నుంచి అనూహ్య ప్రతిపాదన వచ్చింది. గత ఆరు నెలలుగా పాటిస్తున్న కాల్పుల విరమణను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఓ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రకటించింది. తెలంగాణలో శాంతికోసం గత ఏప్రిల్, మే నెలల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని, ఆ కారణంతో మేలో తాము కాల్పుల విరమణ ప్రకటించినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. గత ఆరునెలల కాలంలో అనుకున్న పద్ధతులను కొనసాగించామని, ఇప్పుడు మరో ఆరు నెలలు కాల్పుల విరమణను పొడిగిస్తున్నామని తెలిపారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్ నిర్మిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ చేపట్టింది. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులను ఏరివేస్తోంది. కేంద్ర ప్రభుత్వ బలగాల ధాటికి మావోయిస్టు అగ్రనేతలు సైతం అడవులను వీడుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సైతం ఉద్యమాన్ని వదిలేసి జనజీవనం కోసం పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో మావోయిస్టు పార్టీ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించడం, పైగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కాల్పుల విరమణకు ఉద్యమాలు చేశాయని చెప్పుకోవడం చూస్తే చేతులు ఎత్తేసినట్లేనంటున్నారు.
నిజానికి ఇటీవల లొంగిపోయిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సైతం ఇదే ప్రతిపాదన చేశారు. సాయుధ పోరాటం వీడుతామని, ప్రభుత్వం తమకు కొంత సమయం ఇవ్వాలని, శాంతి చర్చలకు తగిన వాతావరణం కల్పించాలని కోరారు. అయితే అప్పట్లో ఆయన రాసిన లేఖకు పార్టీతో సంబంధం లేదని, సాయుధ పోరాట పంథాను వీడేది లేదని తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ తేల్చిచెప్పారు. మల్లోజులను తప్పుపడుతూ ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. ఇప్పుడు అదే జగన్ పేరిట విడుదలైన లేఖలో తాము ఆరు నెలలుగా కాల్పుల విరమణను పాటిస్తున్నామని, మరో ఆరు నెలలు ఇదే విధానం కొనసాగిస్తామని చెప్పడం చర్చకు దారితీస్తోంది.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం విశేషంగా చెబుతున్నారు. ప్రజలు కోరుకున్నట్లు తాము కాల్పుల విరమణ పాటిస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించిందని లేఖలో పేర్కొన్న మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించారు. తెలంగాణలో నెలకొన్ని శాంతివాతావరణానికి భంగం కలిగేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ దుందుడుకు చర్యలను అన్నిపార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేథావులు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
