నక్సలైట్లతో నో కాంప్రమైజ్.. తేల్చేసిన కేంద్రం.. మావోయిస్టుల రియాక్షన్ ఏంటో?
మావోయిస్టులతో శాంతి చర్చలకు ఏ మాత్రం అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.
By: Tupaki Political Desk | 29 Sept 2025 5:43 PM ISTమావోయిస్టులతో శాంతి చర్చలకు ఏ మాత్రం అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. నెల రోజుల సమయం ఇస్తే సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని, కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. దీంతో ఆపరేషన్ కగార్ మరింత జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని అంతమొందిస్తామని సంకల్పంతో పనిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వం దండకారుణ్యంతోపాటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపింది. ఆధునిక టెక్నాలజీ సాయంతో మావోయిస్టుల ఏరివేత ప్రారంభించిన బలగాలు వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు శాంతిజపం చేస్తున్నా, కేంద్రం ససేమిరా అంటుండటం గమనార్హం.
కేంద్ర బలగాల దూకుడుతో మావోయిస్టు ఉద్యమం కకావికలమైందని అంటున్నారు. వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది కాలంలో సుమారు వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా దాదాపు ఈ సంఖ్యకు అటు ఇటుగా లొంగుబాట్లు జరిగాయి. ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పార్టీ అగ్రనాయకత్వం కూడా ఉండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు శాంతి పల్లవి అందుకోగా, మరికొందరు వారిని తిరస్కరిస్తూ సాయుధ పోరాటం కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా శాంతి చర్చలకు అవకాశం లేదని, అయితే లొంగిపోతే స్వాగతిస్తామని స్పష్టం చేసింది.
మావోయిస్టుల నుంచి వస్తున్న శాంతి చర్చల ప్రతిపాదనలపై తాజాగా స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. అయితే మావోయిస్టులు లొంగిపోతామని ముందుకు వస్తే భద్రతా బలగాలు వారిపై ఒక్క తూటా కూడా పేల్చకుండా ఉండేలా స్వాగతిస్తామని వెల్లడించారు. నక్సల్స్ ముక్త్ భారత్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రజల్లో గందరగోళం రేపడానికే నక్సలైట్లు శాంతిచర్చల ప్రతిపాదన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతవరకు జరిగిందంతా పొరపాటని కాల్పుల విరమణ ప్రకటించాలని, తామంతా లొంగిపోతామని నక్సలైట్లు కోరుతున్నారు. నేనేమి చెబుతున్నానంటే కాల్పుల విరమణ ఉండబోదు. ఒక వేళ వారు లొంగిపోతే కాల్పుల అవసరమే రాదు. ఆయుధాలు అప్పగిస్తే ఒక్క తూటా కూడా పేలదు అంటూ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
దీంతో మావోయిస్టుల శాంతి ప్రతిపాదనపై కేంద్ర వైఖరి స్పష్టమైందని అంటున్నారు. దాదాపు 15 రోజుల క్రితం మావోయిస్టుల నుంచి ప్రకటన రాగా, కేంద్రం ఇప్పుడే స్పందించింది. ఇన్నాళ్లు మావోయిస్టుల ప్రతిపాదనపై కేంద్రం వైఖరి తీవ్ర ఉత్కంఠ రేపింది. శాంతి చర్చలకు మావోయిస్టులు ముందుకు రావడంతో కేంద్రం అంగీకరించే అవకాశం ఉందా? అనే సందేహం తలెత్తింది. 2004లో ఏపీ ప్రభుత్వం నక్సల్స్ తో శాంతి చర్చలు జరిపింది. ఆ తర్వాత పలు రాష్ట్రాలు మావోయిస్టులతో చర్చలకు సిద్ధమైనా వారి నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. కానీ, ఇప్పుడు మావోయిస్టులే భేషరతుగా శాంతిజపం చేస్తుండటంతో ప్రభుత్వం ప్రజాస్వామ్య కోణంలో శాంతి చర్చలకు బాటలు వేస్తుందని పౌరహక్కుల నేతలు భావించారు. కానీ, కేంద్రం మాత్రం మావోయిస్టుల అణచివేతకే మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలు పంపుతోందని అంటున్నారు. భేషరతుగా లొంగిపోవాలని, ఆయుధాలు వదిలేయాలని పిలుపునిస్తోంది. దీంతో మావోయిస్టుల ప్రతిస్పందన ఎలా ఉండనుందనేది ఉత్కంఠ రేపుతోంది.
