మావోయిస్టుల నుంచి సంచలన ప్రతిపాదన.. ముగ్గురు ముఖ్య మంత్రులకు లేఖ!
వరుస ఎన్కౌంటర్లతో కకావికలమైన మావోయిస్టు పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ప్రతిపాదన అందింది.
By: Tupaki Political Desk | 24 Nov 2025 4:41 PM ISTవరుస ఎన్కౌంటర్లతో కకావికలమైన మావోయిస్టు పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ప్రతిపాదన అందింది. తాము ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నామని, పార్టీలో చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది మావోయిస్టు పార్టీ. ఈ మూడు రాష్ట్రాలకు చెందిన స్పెషల్ జోనల్ కమిటీ అధికారి ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ విడుదలైంది. గతంలోనే సాయుధ పోరాటం విడిచిపెట్టి ప్రభుత్వంతో శాంతి చర్చలకు వెళదామని మావోయిస్టు పార్టీ మాజీ అధికారి ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అప్పట్లో ఆయన లేఖకు పార్టీకి సంబంధం లేదంటూ మావోయిస్టులు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన తర్వాత సోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత మావోయిస్టులపై మరింతగా అణచివేత కొనసాగడంతో తాజాగా సాయుధ పోరాట విరమణపై మావోయిస్టు పార్టీ లేఖ రాసింది.
‘‘దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేం సమర్థిస్తున్నాం. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్ దాదా, చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోంది. అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు సమయం ఇవ్వాలని మావోయిస్టు నేత అనంత్ ఆ లేఖలో కోరారు.
ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు మా పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకునేందుకు మాకు కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాలు తెలియజేసేందుకు సమయం కావాలి. ఇంత సమయం అడిగేందుకు ఇతర ఉద్దేశాలు ఏమీ లేవు. త్వరగా కమ్యూనికేట్ చేసేందుకు మాకు వేరే సులభ మార్గాలు లేనందున ఈ వ్యవధిని కోరుతున్నాం. భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలి. పీఎల్జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోం. మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఆపరేషన్ కగార్ చురుగ్గా సాగుతున్న సమయంలో మావోయిస్టులు ఉపిరి సలపలేని విధంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మావోయిస్టు విముక్త భారత్ నినాదంతో గర్జిస్తున్న కేంద్రం.. తన లక్ష్యానికి చేరుకోడానికి మరెంతో దూరం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా నీరసించిపోయిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులతో ఎలాంటి శాంతి చర్చలు ఉండవని ఇంతకు ముందే ప్రకటించారు. కానీ, మావోయిస్టులు ఇన్నాళ్లు శాంతి చర్చలు పేరుతో కాలయాపన చేశారు. ఇప్పుడు కేడర్, లీడర్లను భారీగా కోల్పోయిన తర్వాత ఆయుధాలు వీడతామంటూ ప్రకటనలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు బేషరతుగా లొంగిపోవడం ఒక్కటే మార్గమని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.
