Begin typing your search above and press return to search.

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. తెలంగాణలో లొంగిపోయిన ఇద్దరు అగ్ర నేతలు

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు విప్లవాన్ని వీడుతూ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   28 Oct 2025 4:03 PM IST
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. తెలంగాణలో లొంగిపోయిన ఇద్దరు అగ్ర నేతలు
X

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు విప్లవాన్ని వీడుతూ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఆపరేషన్ కగార్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అణచివేత ఆపరేషన్లు తీవ్రతరం చేయడంతో లొంగుబాట్లు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెలలోనే మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇద్దరు ప్రధాన నేతలతోపాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ క్రమంలోనే మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మరో ఇద్దరు అగ్రనేతలు సరెండర్ అయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చేపట్టిన కీలక ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు, తెలంగాణ రాష్ట్ర కమిటీ నేత బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఈ ఇద్దరు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో విప్లవాన్ని వీడుతున్నట్లు ప్రకటించారు. పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నపై సుమారు రూ.25 లక్షల రివార్డు ఉంది. ఆయన లొంగుబాటు తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెబుతున్నారు. తెలంగాణలో ఈ ఏడాది సుమారు 480 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

కొద్దిరోజుల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తోపాటు సుమారు 200 మంది మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్ సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో మరో కీలక నేత ఆశన్న లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయుధాలను సైతం ప్రభుత్వానికి అప్పగించారు. వీరి లొంగుబాటును తీవ్రంగా వ్యతిరేకించిన మావోయిస్టు పార్టీ.. సరికొత్త రీతిలో విప్లవాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. అయితే వారి ప్రయత్నాలను వమ్ము చేస్తూ తాజాగా మరో ఇద్దరు లొంగిపోవడం విశేషం.

2026 మార్చినాటికి దేశంలో మావోయిస్టులను తరమేస్తామని కేంద్రం ప్రకటిస్తోంది. వరుస ఎన్ కౌంటర్లతో ఉద్యమాన్ని దెబ్బతీసింది. కేంద్ర బలగాలు ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టులకు నిలువ నీడ లేకుండా పోయింది. అధునాతన ఆయుధాలతో బలగాలు ఆపరేషన్ కొనసాగించడం వల్ల మావోయిస్టులు ఉనికి చాటుకోవడం కూడా గగనమవుతోంది. ఇదే సమయంలో ప్రజల నుంచి వారికి సహకారం లభించడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యమం కొనసాగించలేమన్న కారణంతో మల్లోజుల వంటి కొందరు నేతలు సాయుధ పోరాటం వీడాలని పిలుపునిచ్చారు.

అయితే కొందరు మావోయిస్టు నేతలు సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికే మొగ్గుచూపడంతో ఆశన్న, చంద్రన్న, మల్లోజుల వంటి నేతలు తమ దళాలతో లొంగిపోతున్నారు. ఇక మావోయిస్టు గెరిల్లా ఆర్మీ కమాండర్, మరో అగ్రనేత హిడ్మా కూడా లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. మావోయిస్టు ఉద్యమంలో హిడ్మా పాత్ర అత్యంత కీలకంగా చెబుతారు. పలు భీకర దాడులకు ఆయన సూత్రధారి అన్న ప్రచారం ఉంది. అలాంటి నేత కూడా లొంగిపోవాలనే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా ఉధృతంగా సాగుతోంది. హిడ్మా కూడా తెలంగాణ పోలీసులతో టచ్ లో ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై పోలీసులు అధికారికంగా ఇంతవరకు స్పందించలేదు.