Begin typing your search above and press return to search.

మావోయిస్టుల్లో లొంగిపోయేది ఎందరు? నేటి బంద్ పిలుపు చెబుతున్నదేంటి?

మావోయిస్టు పార్టీ గందరగోళ పరిస్థితుల్లో ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   30 Nov 2025 12:15 PM IST
మావోయిస్టుల్లో లొంగిపోయేది ఎందరు? నేటి బంద్ పిలుపు చెబుతున్నదేంటి?
X

మావోయిస్టు పార్టీ గందరగోళ పరిస్థితుల్లో ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 1న సామూహిక లొంగుబాటు ప్రయత్నాలు చేస్తున్న మావోయిస్టు పార్టీ నేతలు.. ఆదివారం ఏజెన్సీ బంద్ కు పిలుపునివ్వడం చర్చనీయాంశం అవుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటరుకు నిరసనగా ఆదివారం ఏజెన్సీలో బంద్ పాటించాలని గతంలో మావోయిస్టులు పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు తర్వాత మావోయిస్టు ఎంఎంసీ కమిటీ నుంచి సామూహిక లొంగుబాటుకు లేఖ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం బంద్ పిలుపును ఉపసంహరించుకుంటారా? అనే చర్చ జరిగింది. కానీ, మావోయిస్టుల నుంచి అటువంటి ప్రకటన ఏదీ విడుదల కాకపోగా, హిడ్మా ఎన్కౌంటరుగా ప్రతికారంగా దాడులకు తెగబడే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ మనగడే ప్రశ్నార్థకంగా మారింది. వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. మరోవైపు మొండిగా పోరాడుతున్న వారు ఎన్ కౌంటర్లలో హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కమిటీ తమకు జనవరి 1వ తేదీ వరకు గడువు ఇస్తే, సామూహికంగా లొంగిపోతామని కొద్దిరోజుల క్రితం లేఖ విడుదల చేశాడు. ఒక్కొక్కరు కాకుండా అంతా ఒకేసారి లొంగిపోతామని, అంతవరకు పోలీసు కాల్పులు ఆపాలని కోరారు. అదే సమయంలో తాము కూడా ఎటువంటి కార్యకలాపాలను చేపట్టమని ఆ లేఖలో వెల్లడించారు. ఈ లేఖ వచ్చిన తర్వాత ఏజెన్సీ బంద్ ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆదివారం ఏజెన్సీలో బంద్ జరుగుతోంది. దీంతో జనవరి 1న లొంగిపోతామనే ప్రకటన మావోయిస్టు పార్టీ నిర్ణయమా? లేక ఎంఎంసీ కమిటీ నిర్ణయమా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మావోయిస్టులు దళాల వారీగా లొంగిపోతున్నారు. గత నెలలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులైన మల్లోజుల వేణుగోపాలరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వంటి వారు తమ దళాలు, ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా సైతం లొంగుబాటు ప్రయత్నాల్లో ఉంటూ తన దళాన్ని విజయవాడలో రహస్యంగా దాచినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే హిడ్మా ఎన్కౌంటరు, ఆ తర్వాత ఆయన దళం అరెస్టు జరిగినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాల తర్వాత లొంగుబాటు దిశగా ప్రకటనలు చేస్తున్న ఎంఎంసీ కమిటీ.. కూడా తన దళం వరకు సామూహిక లొంగుబాటు ప్రయత్నాలు చేస్తోందా? అన్న చర్చ సాగుతోంది.

తాజాగా ఏజెన్సీ బంద్ చూస్తుంటే మావోయిస్టుల్లో ఇంకో వర్గం సాయుధ పోరాటానికి మొగ్గుచూపుతున్నట్లే కనిపిస్తుందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఏవోబీలో బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులకు ఎవరు సారథ్యం వహిస్తున్నారనేదే ఉత్కంఠ రేపుతోంది. చాలాకాలంగా ఏపీ ఏజెన్సీలో మావోయిస్టుల జాడ లేదని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల హిడ్మా ఎన్ కౌంటరుకు ముందే ఛత్తీస్‌గఢ్ నుంచి కొన్ని దళాలు ఇటువైపు వచ్చాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఏపీ ఏజెన్సీలో మావోయిస్టులు మాటు వేశారా? అన్న అనుమానాలతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక హిడ్మా ఎన్కౌంటరుకు నిరసనగా బంద్ పిలుపునివ్వడం, ప్రతికారదాడులు చేస్తామని పోలీసులకు హెచ్చరించడం చూస్తుంటే ఈ ప్రాంతంలో ఎవరైనా పెద్ద నేత తిష్ట వేశారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే జనవరి 1న సాయుధ పోరాటం ముగింపు అంటూ ఏం ఉండదని, ఒక వర్గం మాత్రమే లొంగిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. తాజా పరిణామాలతో మావోయిస్టుల భవిష్యత్తు కార్యాచరణ సస్పెన్స్ గా మారిందని అంటున్నారు.