మల్లోజుల, ఆశన్నలకు 'వై' కేటగిరీ భద్రత.. ఏం జరిగింది?
మావోయిస్టు అగ్రనాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు కేంద్ర ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రత కల్పించనున్నట్టు తెలిసింది.
By: Garuda Media | 20 Oct 2025 9:33 AM ISTమావోయిస్టు అగ్రనాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు కేంద్ర ప్రభుత్వం `వై` కేటగిరీ భద్రత కల్పించనున్నట్టు తెలిసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలు, మరోవైపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటోందని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుందని.. అప్పటి వరకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా వారికి రక్షణ కల్పిస్తారని తెలిపారు. ప్రస్తుతం మల్లోజుల, ఆశన్న లు ఇరు రాష్ట్రాల పోలీసుల భద్రతలోనే ఉన్నారని స్పష్టం చేశారు.
ఏం జరిగింది?
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో కకావికలం అవుతున్న మావోయిస్టు పార్టీలో.. కొందరు నేతలు పట్టుబడుతున్నారు. మరి కొందరు తెగించి పోరాడి భద్రతా బలగాల కాల్పుల్లో హతులవుతున్నారు. ఈ క్రమంలోనే అగ్రనేతలు ఇటీవల ప్రాణాలు కోల్పో యారు. అయితే.. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు.. ఇటీవల ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయా రు. వారితోపాటు 280 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా అప్పగించారు. ఈ పరిణామాలు మావోయిస్టు పార్టీనికుదిపేశాయి. ఒకప్పుడు పార్టీ కి సిద్ధాంతాలు సమకూర్చిన వారే చేతులు ఎత్తేయడంతో మిగిలిన వారు రగిలిపోతున్నారు.
ఈ క్రమంలోతాజాగా మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన చేసింది. మల్లోజుల, ఆశన్నలను విప్లవ ద్రోహులుగా చిత్రీకరించింది. వీరు పార్టీకి, ఉద్యమానికి కూడా తీరని ద్రోహం చేశారని ఆరోపించింది. మల్లోజుల సహచరి గతంలోనే లొంగిపోయిన దరిమిలా.. అప్పటి నుంచే మల్లోజుల మహారాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో వారిని `ప్రజలే` శిక్షిస్తారని వ్యా ఖ్యానించింది. తద్వారా మావోయిస్టుల నుంచే ఈ కీలక నేతలకు ముప్పు ఉంటుందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. గతంలోనూ లొంగిపోయిన మావోయిస్టులను..మావోయిస్టులే హత మార్చిన ఘటనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులకు లొంగిపోయిన ఇద్దరు కీలక నేతల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరలో మల్లోజులకు, ఆశన్న కు `వై` కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రానికి విన్నవించాయి. ఈ భద్రత సమకూరితే వారికి రోజుకు ఆరుగురు చొప్పున భద్రతా సిబ్బంది కాపలాగా ఉంటారు. ఫలితంగా వారికి భద్రతకల్పించినట్టు అవుతుంది.పైగా.. మావోయిస్టు అగ్రనేతలు లొంగి పోయినప్పుడు భద్రత కల్పిస్తామంటూ ప్రభుత్వాలు కూడా హామీ ఇస్తాయి. ఇప్పుడే జరుగుతుందని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.
