మావోయిస్ట్ పార్టీ లేఖకు ఆశన్న జవాబు.. ఏమన్నారంటే.?
‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమష్టిగా తీసుకున్న నిర్ణయమే లొంగిపోవడం’ అని ఆశన్న వివరించడం ద్వారా.. ఈ లొంగుబాటు వ్యక్తిగత భయం కాదని, ఒక ప్రణాళికాత్మక మార్పు అని అర్థం అవుతోంది.
By: Tupaki Political Desk | 26 Oct 2025 2:09 PM ISTఅరణ్యాల లోపల సాగిన ఆ ‘విప్లవ యాత్ర’కు ఇప్పుడు ఆత్మపరిశీలన ప్రారంభమైందా..? ఒకప్పుడు ‘తుపాకీ భాష’లో న్యాయం చెబుతామని చెప్పిన వారు.. ఇప్పుడు ఆ తుపాకీని అప్పగించి మాట్లాడుతున్నారంటే.. మారిపోయేందుకు ఒక్క క్షణం చాలన్న నిజం ఒప్పుకోక తప్పదు. మావోయిస్టు సిద్ధాంతకర్తలు మల్లోజుల వేణుగోపాల్‌రావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఇటీవల లొంగిపోవడం ఆ ఉద్యమ చరిత్రలో అతి పెద్ద మలుపు. కానీ ఆశన్న తాజాగా విడుదల చేసిన వీడియో మాత్రం.. ఆ లొంగుబాట వెనుక ఉన్న మానసిక యుద్ధాన్ని, సిద్ధాంత సంక్లిష్టతను మరో కోణంలో చూపిస్తోంది. లోంగిపోయిన తర్వాత మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖతో ఇద్దరికి, వారి అనుచరులకు భద్రతను పెంచారు. లొంగిపోయి దాదాపు రెండు వారాలకు ఎక్కువగానే అయినా వారు భత్రత మధ్యనే జీవిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ రికార్డు చేసిందో తెలియదు కానీ ఒక వీడియో మాత్రం రిలీజ్ అయ్యింది. ఇందులో ఆశన్న తన లొంగుబాటు గురించి పార్టీకి వివరించారు. ఆశన్న మాట్లాడుతూ.. ‘ఇది ద్రోహం కాదు, దారి మార్పు’ అని స్పష్టంగా చెప్పడం గమనార్హం. తుపాకీతో సాగిన విప్లవం ఇప్పుడు ఆలోచనలతో సాగాలని ఆయన పార్టీకి సైతం పిలుపునిచ్చారు. ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమష్టిగా తీసుకున్న నిర్ణయమే లొంగిపోవడం’ అని ఆశన్న వివరించడం ద్వారా.. ఈ లొంగుబాటు వ్యక్తిగత భయం కాదని, ఒక ప్రణాళికాత్మక మార్పు అని అర్థం అవుతోంది.
అడవి పోరాటాలకు కాలం చెల్లింది..
ఇది కేవలం లొంగుబాటు కాదు ఇది ఒక ఆత్మపరిశీలన. ఉద్యమం అంటే కేవలం అడవిలో ఉండిపోవడం కాదు.. బుల్లెట్లు, రక్తమే జవాబు కాదు.. సమాజం మార్చే ఆలోచన కూడా కావచ్చని ఆశన్న స్పష్టం చేశారు. ‘విప్లవం ఆగింది కానీ ఆత్మ సజీవంగా ఉంది’ అనే ఆయన మాటలు, ఒక ఉద్యమం అంతర్గతంగా ఎలా పరిణమిస్తుందో చెప్పే సూచికలుగా కనిపిస్తున్నాయి. మావోయిస్టు నాయకత్వం మాత్రం తమ లొంగుబాటును తీవ్రంగా తప్పు పట్టింది. పార్టీ ఇచ్చిన ప్రకటనలో ‘వారు విప్లవ ద్రోహులు, ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు ఆశపడి లొంగిపోయారు.’ అని ఆరోపించింది. అది కేవలం ఆశన్నపై కోపం కాదు, ఒక అంతర్గత భయానికి ప్రతిబింభం. ఎందుకంటే మావోయిస్టు సిద్ధాంతం ఇప్పటి యుగంలో క్షీణించిపోతుందనే భయం వారికి తట్టుకుంటోంది.
ప్రశాంతంగా కనిపించిన మావోయిస్టులు..
ఆశన్న రికార్డు చేసిన వీడియోలో ఆయన చుట్టూ ఉన్న మావోయిస్టులు రంగురంగుల దుస్తుల్లో ఉల్లాసంగా కూర్చొని కనిపించారు. తుపాకులు లేకుండా, ఆనందంగా ఉన్నట్లు కనిపించింది. అది ఒక విప్లవం నుంచి సాధారణ జీవనానికి మారుతున్న రూపాంతరం అని కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. ఒకప్పుడు అరణ్యంలో గర్జించిన వారు ఇప్పుడు పుస్తకం చేతిలో పెట్టుకొని, ప్రశాంతంగా తమ నిర్ణయాన్ని వివరించడం.. అది యుద్ధం ముగిసిందన్న సంకేతం కాకపోవచ్చు.. కానీ యుద్ధం రూపం మారుతోందన్న సూచన మాత్రం ఖచ్చితంగా అయ్యే ఉంటుంది.
ప్రభుత్వాలు సైతం స్వాగతిస్తు్న్నాయి..
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ పరిణామాన్ని మానవ కోణంలోనే స్వీకరించాయి. ఆశన్న వంటి నాయకులు లొంగిపోవడం అనేది కేవలం ఆయుధాల సమర్పణ కాదు.. ఒక తాత్విక సమర్పణ. ఈ మార్పును అందరూ సానుకూలంగా చూడడం లేదు. ఇంకా విప్లవ పంతాలోనే సాగుతున్న వారికి ఆశన్న చేసింది పార్టీకి మోసంగా కనిపిస్తుంది. విప్లవం బలహీనపడిందన్న భావన అక్కడ ఉన్నవారికి కూడా పెరుగుతోంది అని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరో వైపు ఆశన్న చెప్పిన “మేము కేవలం మార్గం మార్చుకున్నాం, గమ్యం కాదు’ అన్న మాటలు, మావోయిజం కొత్త రూపంలో తిరిగి పుట్టవచ్చన్న సంకేతంగా కూడా భావించవచ్చు.
ఉద్యమం దశ మార్చుకుంటుందన్న ఆశన్న
ఎందుకంటే ప్రతి విప్లవం రెండు దశలతో ఉంటుంది. ఒకటి ఆయుధాలతో, మరొకటి ఆలోచనలతో.. ఆశన్న, మల్లోజుల వంటి నాయకులు తుపాకీని వదిలేసి పుస్తకాన్ని పట్టుకోవడం అంటే.. రెండో దశ మొదలైనట్లే. ప్రశ్న ఒక్కటే మిగిలింది ఆ పుస్తకం రక్తపుటలు రాయదా, లేక మానవతా పుటలు రాయదా? మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు ఎటు వెళ్తుందో ఎవరికీ స్పష్టంగా తెలియకపోయినా.. ఆశన్న వీడియో మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్తోంది. విప్లవం లొంగలేదు, కేవలం తీరు మార్చుకుంది అంతే.. తుపాకీని పేల్చిన చేతులు ఇప్పుడు ప్రజల కోసం ప్రజాలతోని జన జీవనంలో పోరాటాలకు తెరతీసిందని ఆశన్న మాటల్లో అర్థం చేసుకోవచ్చు.
