Begin typing your search above and press return to search.

మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఎక్కడ? పార్టీ టాప్ లీడర్ ఆచూకీపై సందేహాలు

ఏపీలో మావోయిస్టుల ఎన్కౌంటర్లు, అరెస్టుల నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది.

By:  Tupaki Political Desk   |   20 Nov 2025 4:45 PM IST
మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఎక్కడ? పార్టీ టాప్ లీడర్ ఆచూకీపై సందేహాలు
X

ఏపీలో మావోయిస్టుల ఎన్కౌంటర్లు, అరెస్టుల నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఆయన ఎక్కడున్నదీ ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు. దండకారణ్యంలో రక్షణ లేకపోవడంతో షెల్టర్ కోసం మావోయిస్టులు ఏపీకి వచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు మిలట్రీ ప్లటూన్ కమాండర్ హిడ్మా ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. మరోవైపు ఇంటెలిజెన్స్ సమాచారంతో హిడ్మా టీంలోని సభ్యులతోపాటు మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ బాడీగార్డులను విజయవాడ, ఏలూరుల్లో అరెస్టు చేశారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో దేవ్ జీ బాడీగార్డులు ఉన్నారని ప్రకటించడంతో ఆయన కూడా షెల్టర్ కోసం ఏపీకి వచ్చాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా మావోయిస్టు అగ్రనేతలకు వివిధ అంచెల భద్రత ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దండకారణ్యంలో బలగాలు మోహరించడం, అక్కడ పోరాడే శక్తిని మావోయిస్టులు కోల్పోవడంతో సురక్షిత స్థావరాలను వెతక్కుంటూ జనారణ్యంలో ప్రవేశించినట్లు చెబుతున్నారు. దీంతో అగ్రనేతలు తమ గస్తీ టీములకు దూరంగా ఉంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేవ్ జీ అనుచరులను అరెస్టు చేయడంతో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారనేది తెలుసుకోడానికి విస్తృతంగా గాలిస్తున్నారు.

తెలంగాణకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఆయనకు ముందు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటరులో హతమయ్యారు. దీంతో దేవ్ జీ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆపరేషన్ కగార్ ఉధృతంగా కొనసాగుతుండటం వల్ల దేవ్ జీ తన బృందంతో దండకారణ్యాన్ని వీడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ, ఏలూరుల్లో దేవ్ జీ సహాయకులు ఉండటంతో ఆయన కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నక్కి ఉంటాడా? అనే అనుమానంతో గాలిస్తున్నారు.

ఇక హిడ్మా ఎన్కౌంటరు తర్వాత మావోయిస్టుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవిధంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయినట్లే కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న మావోయిస్టు విముక్త భారత్ కు చాలా చేరువలో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో గణపతి, దేవ్ జీ, రాజారెడ్డి మాత్రమే మిగిలినట్లు కనిపిస్తోందని అంటున్నారు. వరుస ఎన్కౌంటర్లలో 28 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. మరో నలుగురు లొంగుబాటులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో దేవ్ జీ, రాజారెడ్డి, గణపతిని పట్టుకుంటే మావోయిస్టు ఉద్యమానికి తెరపడినట్లేనని విశ్లేషిస్తున్నారు.