Begin typing your search above and press return to search.

మోనాలిసాతో పోల్చొద్దు.. ముస్లిమ్‌తో పెళ్లికి నేను వ్య‌తిరేకం.. వైర‌ల్ గ‌ర్ల్ మాన్సీ రాజ్‌పుత్!

సోషల్ మీడియా యుగంలో రాత్రికి రాత్రే వైరల్ కావడం.. ఆ పబ్లిసిటీతో ఫాలోయింగ్ తెచ్చుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది.

By:  Sivaji Kontham   |   15 Aug 2026 10:33 PM IST
మోనాలిసాతో పోల్చొద్దు.. ముస్లిమ్‌తో పెళ్లికి నేను వ్య‌తిరేకం.. వైర‌ల్ గ‌ర్ల్ మాన్సీ రాజ్‌పుత్!
X

సోషల్ మీడియా యుగంలో రాత్రికి రాత్రే వైరల్ కావడం.. ఆ పబ్లిసిటీతో ఫాలోయింగ్ తెచ్చుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. 61 లీటర్ల భారీ కాన్వడ్‌ను మోస్తూ దాదాపు 180 కిలోమీటర్ల సుదీర్ఘ కాన్వడ్ యాత్ర పూర్తి చేసిన మాన్సీ ఠాకూర్ (మాన్సీ రాజ్‌పుత్) అనే ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సాధారణ రీల్స్ చేయడం మానేసి... భక్తిపరమైన కాన్వడ్ యాత్ర రీల్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకున్న ఈ గాజుక‌ళ్ల యువ‌తి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చలకు దారితీశాయి.

కాన్వడ్ యాత్రతో విపరీతమైన గుర్తింపు సాధించిన మాన్సీని గతంలో మహాకుంభమేళా సమయంలో వైరల్ అయిన `మొనాలిసా`తో పలువురు పోల్చడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ''నన్ను మొనాలిసాతో ముడిపెట్టి మాట్లాడకండి. నేను సనాతన ధర్మాన్ని పాటించే పరమశివుని భక్తురాలిని. నన్ను ఎవరైనా పిలవాలనుకుంటే `కాన్వడ్ యాత్ర వైరల్ షేర్ని` అని మాత్రమే పిలవాలి'' అంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు మాన్సీ రాజ్ పుత్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

మొనాలిసాతో పోలికలను తిరస్కరించడమే కాకుండా.. మాన్సీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత రాజకీయ రంగు పూశాయి. ''మొనాలిసా ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది... నేను అటువంటి వివాహాలకు పూర్తిగా వ్యతిరేకం. నేను నా హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను'' అని మాన్సీ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ ప్రకటనతో యువ‌తి తీవ్ర స్థాయిలో మద్దతుదారులను.. అలాగే విమర్శకులను కూడా ఎదుర్కొంటున్నారు.

యాత్ర సమయంలో రిజర్వేషన్ల వ్యవస్థ- ప్రభుత్వ విధానాలపై మాన్సీ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆమె కష్టాన్ని చూసి ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేయగా... తాను ప్రభుత్వంపై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదని మాన్సీ స్పష్టత ఇచ్చారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చాలామంది నెటిజన్లు ఈ యువ‌తిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. సాధారణ కంటెంట్‌తో రాని ఆదరణను పొందేందుకు మతపరమైన... సంచలనాత్మక విషయాలను ఆసరాగా చేసుకుని పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

ఏది ఏమైనా తన శివభక్తి - సుదీర్ఘ కాన్వడ్ యాత్ర ద్వారానే తనకు సమాజంలో గుర్తింపు రావాలని మాన్సీ రాజ్‌పుత్ గట్టిగా కోరుకుంటున్నారు. మరొకరితో పోలికలు లేకుండా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నా పబ్లిసిటీ కోసం ఇన్‌ఫ్లూయెన్సర్ల ఎత్తుగడలు.. వాటిపై వచ్చే సామాజిక విమర్శల నడుమ ఈ కాన్వడ్ యాత్ర `వైరల్ షేర్ని` వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.