జగన్.... చరిత్ర నీ వెన్నుపోటు మరవదు !
ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అభ్యర్ధికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడాన్ని ఆయన పూర్తి స్థాయిలో తప్పు పట్టారు.
By: Satya P | 9 Sept 2025 5:26 PM ISTజగన్ మీద ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అభ్యర్ధికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడాన్ని ఆయన పూర్తి స్థాయిలో తప్పు పట్టారు. జగన్ తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీకి దాసోహం అయ్యారని విమర్శించారు. తన మీద సీబీఐ కేసులు ఉన్నాయన్న భయంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరించారని నిందించారు.
ప్రజల తీర్పుని అలా :
జగన్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమికి వ్యతిరేకంగా అయితే ఆయన ఎన్డీయే కూటమి అభ్యర్ధికి అనుకూలంగా ఎలా ఓటు చేస్తారు అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు జగన్ పూర్తిగా సరెండర్ అయిపోయారని ఆగ్రహించారు. జగన్ మోడీ బాబుల ఒత్తిడికి లొంగిపోయి భయంతో కూడిన విధేయతను ఢిల్లీ పాలకుల మీద చూపించారు అని ఆయన ఫైర్ అయ్యారు.
పిరికి వారుగా ఉంటూ :
తన సొంత ప్రయోజనలా కోసం తన రాజకీయ మనుగడ కోసం జగన్ ఈ రోజున ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించారని ఆయన అన్నారు. ఏపీ ప్రజలు పిరికి వారిని కోరుకోవడం లేదని ధైర్యవంతులను వారు కోరుకుంటున్నారు అని మాణిక్కం ఠాగూర్ అన్నారు. చంద్రబాబు మోడీ నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి ఓటు వేయాలని జగన్ వైసీపీ ఎంపీలను కోరడం కూడా దారుణం అన్నారు.
మిధున్ రెడ్డి ఓటు ఎవరికి :
ఇక ఏపీలో గత కొన్నాళ్ళుగా లొక్కర్ స్కాం కేసులో జైలులో ఉంటున్న మిధున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి బెయిల్ వచ్చిందని తనను జైలులో పెట్టించిన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్ధికి ఆయన ఎలా ఓటు వేస్తారు అని మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారా లేక తనను జైలుకు పంపించిన వారికి మిధున్ రెడ్డి వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ బాధిత వర్గాలకు అతి పెద్ద వెన్నుపోటు పొడిచారు అని అన్నారు రైతులను ఆయన ఏకంగా వంచించారు అని అన్నారు. ఏపీలో యూరియా దొరకక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు మద్ధతుగా ఉండకుండా వారిని జగన్ వెన్నుపోటు పొడిచారు అని నిందించారు.
ఇది స్ట్రాటజీ కాదు సరెండర్ :
జగన్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించినది స్ట్రాటజీ ఏ మాత్రం కాదని ఆయన ఢిల్లీ పెద్దలకు సరెండర్ అయ్యారు అని మాణిక్కం ఠాగూర్ పూర్తి స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజలు వివిధ వర్గాల వారు వైసీపీని నమ్మి ఓటేస్తే వారి తీర్పుని జగన్ తనకు అనుకూలంగా చేసుకున్నారని తన స్వీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేశారు తప్ప వేర విషయం ఆలోచించలేదని అన్నారు. అతే కాదు ప్రజా స్వామ్య శక్తులు ఒక వైపు ఉంటే వారిని బలపరచకుండా జగన్ చారిత్రాత్మకమైన అతి పెద్ద తప్పు చేశారు అని ఆయన ఫైర్ అయ్యారు.
జగన్ కి ఇది మొదలు :
ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల మీద పట్టు బిగించాలని చూస్తున్న కాంగ్రెస్ ఇపుడు జగన్ ని కూటమి పార్టీల వైపు కలిపేసింది దాంతో ఏపీలో బీజేపీ దాని వ్యతిరేక భావజాలం కలిగిన శక్తులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి జగన్ మీద మరిన్ని తీవ్ర విమర్శలు రానున్న కాలంలో చేస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద ఎన్డీయే అభ్యర్ధిని మద్దతు జగన్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ సహా ప్రజాతంత్ర శక్తులు అయితే ఆగ్రహంగా ఉన్నాయని అంటున్నారు. దీనికి వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ ఏమిటో చూడాల్సి ఉంది.
