Begin typing your search above and press return to search.

రోల్స్ రాయిస్ కారు నడిపిన 72 ఏళ్ల బామ్మ.. వీడియో వైరల్ !

ఈమె తన సొంత రాష్ట్రమైన కేరళలో డ్రైవింగ్ స్కూలు కూడా నడుపుతోంది. కార్లు, ట్రక్కులు, ఫోర్క్ లిఫ్ట్ తో పాటు క్రేన్ లతో సహా వివిధ వాహనాలను నడపడంలో ఈమె ప్రావీణ్యం సంపాదించారు.

By:  Madhu Reddy   |   30 Aug 2025 1:22 PM IST
రోల్స్ రాయిస్ కారు నడిపిన 72 ఏళ్ల బామ్మ.. వీడియో వైరల్ !
X

అప్పుడప్పుడు ఎదురయ్యే కొన్ని సంఘటనలని చూస్తే సాహసాలకు వయసుతో సంబంధం లేదు అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా 72 సంవత్సరాల బామ్మ ఏకంగా రోల్స్ రాయిస్ కారు నడిపి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కేరళకు చెందిన 72 ఏళ్ల మణి అమ్మ అనే మహిళ.. కేరళ సాంప్రదాయ చీరను ధరించి.. దుబాయ్ లో విలాసవంతమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును నడిపి తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ.. ప్రపంచవ్యాప్త ప్రజలను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె కారు నడుపుతున్న తీరు చూస్తే ఆమె ఆత్మవిశ్వాసం, ప్రశాంతత చూసేవారిలో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాయి అని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది ఈమెను "డ్రైవర్ అమ్మ" అంటూ పిలుస్తున్నారు. ఇకపోతే ఈమె దగ్గర దాదాపు 11 రకాల వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ లు ఉండడం గమనార్హం.

ఈమె తన సొంత రాష్ట్రమైన కేరళలో డ్రైవింగ్ స్కూలు కూడా నడుపుతోంది. కార్లు, ట్రక్కులు, ఫోర్క్ లిఫ్ట్ తో పాటు క్రేన్ లతో సహా వివిధ వాహనాలను నడపడంలో ఈమె ప్రావీణ్యం సంపాదించారు. మణి అమ్మ గురిచి తెలుసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర.. మణి అమ్మ పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈమెను తన "మండో మోటివేషన్" అంటూ పిలిచారు. జీవితం పట్ల ఆమెకున్న ఇష్టాన్ని.. నేర్చుకోవాలనే తపనను ఆయన కొనియాడారు. ఇకపోతే సాంప్రదాయ చీరలో చాలా హుందాగా రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును ఆమె నడపడం చూసిన నెటిజన్స్ పలురకాల కామెంట్లు చేస్తున్నారు.

"అన్ని రకాల రేటింగ్ లతో చురుకైన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ ఈమె కావచ్చు" అంటూ కొంతమంది కామెంట్ చేయగా.. మరికొంతమంది "ఇప్పుడు విమానం నడిపేందుకు లైసెన్స్ తీసుకుందాం" అంటూ వ్యాఖ్యానించారు. ఇంకొంతమంది "ఈమె ధైర్య సాహసాలకు మెచ్చుకోవాల్సిందే. ఈ వయసులో కూడా 11 రకాల వాహనాలకు సంబంధించిన లైసెన్స్ లు పొందడం నిజంగా గ్రేట్.. ఎంతో మందికి ఆదర్శం" అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు నడపడం అంటే అంత సులభం కాదు. ఈమె మేధాశక్తి కూడా మరింత ఉన్నతంగా అనిపిస్తుంది అంటూ ఇలా ఎవరికి వారు తమకు నచ్చినట్టు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈ మహిళ ఇప్పుడు వార్తల్లో నిలిచారు.