Begin typing your search above and press return to search.

ఆ తంతును ఆపండి.. చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ..

భక్తి, సంప్రదాయాల పేరుతో జరిగే జంతుబలుల అంశం ఇప్పుడూ ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Political Desk   |   6 May 2026 3:55 PM IST
ఆ తంతును ఆపండి.. చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ..
X

భక్తి, సంప్రదాయాల పేరుతో జరిగే జంతుబలుల అంశం ఇప్పుడూ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గంగమ్మ జాతర సందర్భంగా వేలాది మూగజీవాలను బలి ఇవ్వడంపై జంతు ప్రేమికులు ఆందోళన చెందడం సహజం. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంలో నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శాంతికి, కరుణకు నిలయమైన మన సంస్కృతిలో హింసకు తావుండకూడదనే ఆమె వాదనపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తిరుపతి గంగమ్మ జాతరలో జరగనున్న జంతుబలులపై కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. 18, 19 తేదీల్లో జరగనున్న జాతరలో వేలాది జంతువులను బలి ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో, ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ బలులను తక్షణమే నిలిపివేసి, చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

మేనకా ఆవేదన

భక్తి పేరుతో వేలాది జంతువులను చంపడాన్ని ఖండించారు. జాతరలో జరిగే ఈ సామూహిక బలులు మన సంస్కృతికి మచ్చ తెస్తున్నాయని, ఇది సరైంది కాదని ఆమె పేర్కొన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఘటనను దేశం గమనిస్తోందని, ఇది ‘సామూహిక మారణకాండ’ అని అభివర్ణించారు. దేశంలో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అవి కఠినంగా అమలు కాకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శించారు.

జంతుబలులకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆమె సూచించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జంతుబలులను నిషేధించి, కొబ్బరికాయలు కొట్టడం వంటి పద్ధతులను ప్రోత్సహిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. జంతువుల ప్రాణాలను తీయడానికి బదులుగా కొబ్బరికాయలు, పండ్లు, పుష్పాలను సమర్పించాలని ఆమె సూచించారు. ఆలయాల్లో భక్తులకు అవగాహన కల్పిస్తే ఈ మార్పు సాధ్యమవుతుందని, ఇప్పటికే అనేక ఆలయాలు ఇలాంటి మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నాయని తెలిపారు. బలులు కేవలం జంతువులకే కాదు, సమాజానికి కూడా హానికరమని ఆమె హెచ్చరించారు. జాతరల సమయంలో జరిగే హింస చిన్నపిల్లలు, యువతపై చెడు ప్రభావం చూపుతుందని, ఇది హింసను సహజంగా భావించే పరిస్థితిని కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం తాగి వచ్చే కొందరు భక్తులు హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉందని, ఇది సమాజానికి ప్రమాదకరమని ఆమె స్పష్టం చేశారు.

ముందుచూపు ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకొని జంతుబలులను అరికట్టాలని మేనకా గాంధీ కోరారు. వైద్యులు, విద్యావేత్తల నుండి కూడా తనకు ఇలాంటి విన్నపాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.