కూటమి సర్వేలో షాకింగ్ రిజల్ట్.. 20 శాతమే పాజిటివ్ టాక్!?
కూటమి ప్రభుత్వం చేపట్టిన ఓ సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ను కేవలం 20 శాతం మంది మాత్రమే వినియోగిస్తున్నారని స్పష్టమైంది.
By: Tupaki Political Desk | 29 Dec 2025 11:00 PM ISTకూటమి ప్రభుత్వం చేపట్టిన ఓ సర్వేలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ను కేవలం 20 శాతం మంది మాత్రమే వినియోగిస్తున్నారని స్పష్టమైంది. అసలు ఇలాంటి పద్దతి అంటూ ఒకటి ఉందని ఏజెన్సీ జిల్లా వాసులకు ఏ మాత్రం తెలియదని సర్వేలో వెల్లడైంది. వచ్చే ఏడాదిలో అంటే 2026 జనవరి తర్వాత రాష్ట్రంలోని అన్ని రకాల సేవలను వాట్సాప్ లోనే అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి తరుణంలో ఏడాదిగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ పై మెజార్టీ ప్రజలకు ఎటువంటి అవగాహన లేదని ప్రభుత్వ సర్వేలో తేలడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది జనవరి 30న ప్రారంభించిన ఈ సేవలకు ‘మన మిత్ర’ అనే పేరు పెట్టారు. ప్రారంభించిన తొలి రోజుల్లో సుమారు 200 రకాల సేవలను వాట్సాప్ లోనే అందించేవారు. చిటికెలో సేవలు అందుతాయని ప్రభుత్వ పెద్దలు గొప్పగా చాటుకున్న ఈ పథకం మరో నెల రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఇక జనవరిలో 200 సేవలతో ప్రారంభించిన మన మిత్రను దశల వారీగా విస్తరించారు. ప్రస్తుతం దాదాపు 600 సేవలు వాట్సాప్ లోనే అందిస్తున్నారు.
ఆర్టీసీ టికెట్ల నుంచి జనన మరణ ధృవీకరణ పత్రాలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇలా ప్రజలకు ఎంతో అవసరమైన పత్రాలను ఇంటి వద్దే పొందే సౌకర్యం మన మిత్ర వాట్సాప్ గవర్నెర్స్ లో కల్పించారు. దీనికి ప్రత్యేక ఫోన్ నెంబరు కూడా సమకూర్చారు. అయితే ఎక్కడే ఏమైందో కానీ, వాట్సాప్ గవర్నెర్స్ ను ప్రజలు సరిగా వినియోగించుకోలేక పోతున్నారని ప్రభుత్వ సర్వేలోనే వెల్లైందని చెబుతున్నారు. వాట్సాప్ గవర్నెర్స్ తీసుకొచ్చిన 11 నెలల తర్వాత ప్రభుత్వం చేయించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఇందులో 68 శాతం మంది ‘మన మిత్ర’ కోసం తమకు తెలియదని స్పష్టంగా తెలిపారు. 80 శాతం మంది అసలు వాడలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనే ఈ షాకింగ్ రిజిల్ట్ వచ్చిందని చెబుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ఈ సేవలను వినియోగించుకున్నట్లు సమాచారం. నిజానికి ఈ విధానం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యం లభించే అవకాశం ఉన్నప్పటికీ ప్రచారం చేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
జనవరిలో మన మిత్ర ప్రారంభించిన తర్వాత ఏప్రిల్, మే నెలల్లో విడుదలైన టెన్త్, ఇంటర్ పరీక్ష ఫలితాల సమయంలో ఎక్కువ మంది వినియోగించుకున్నారు. ఆ తర్వాత దీనిపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో ప్రజలు ఎప్పటిలానే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. మన మిత్ర ప్రవేశపెట్టిన వెంటనే ఇంటింటికీ ఈ సమాచారం చేరవేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అయితే 1.4 కోట్ల కుటుంబాలకు ఈ సమాచారం చేరలేదని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని అంటున్నారు. సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనకపోయినా, ప్రభుత్వం కనీసం ప్రశ్నించకపోవడం గమనార్హం.
