Begin typing your search above and press return to search.

మ‌మత అంతే..బెంగాల్ బీజేపీ ఎంపీకి అనూహ్యంగా ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు

ప‌శ్చిమ బెంగాల్ లో 2011 నుంచి తిరుగులేని అధికారం చెలాయిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఈసారి మాత్రం చాలా క‌ష్ట కాలం న‌డుస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

By:  Tupaki Political Desk   |   24 Feb 2026 9:00 PM IST
మ‌మత అంతే..బెంగాల్ బీజేపీ ఎంపీకి అనూహ్యంగా ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు
X

ప‌శ్చిమ బెంగాల్ లో 2011 నుంచి తిరుగులేని అధికారం చెలాయిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఈసారి మాత్రం చాలా క‌ష్ట కాలం న‌డుస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఒక‌వైపు బీజేపీ ముప్పేట దాడి.. మ‌రోసారి పాల‌నా వైఫ‌ల్యాలు.. అటు చూస్తే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో అశాంతి.. హిందువులే టార్గెట్ గా హ‌త్య‌లు, అత్యాచారాలు..! ఇన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో ఏప్రిల్-మే నెల‌ల్లో జ‌రిగే ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌కు మ‌మ‌త‌కు స‌వాల్ విసురుతున్నాయి. ఐదేళ్ల కింద‌ట గ‌ట్టి పోటీ ఎదురైనా గ‌ట్టెక్కింది మ‌మ‌త స‌ర్కారు. ఈసారి మాత్రం బీజేపీ వ‌దులుకునే ఆలోచ‌న‌లో లేన‌ట్లు క‌నిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో బెంగాల్ అత్యున్న‌త పుర‌స్కారానికి బ‌ద్ద శ‌త్రువైన బీజేపీ ఎంపీని ఎంపిక చేశారు మ‌మ‌త‌. ఆయ‌న ఈ అత్యున్న‌త అవార్డు ప్ర‌దానం చేయ‌డం బెంగాల్ లో ఇప్పుడు చ‌ర్చ‌నీయం అవుతోంది.

మ‌హ‌రాజ్... ఎవ‌రీయ‌న‌..?

అనంత మ‌హ‌రాజ్.. అస‌లు పేరు నాగెన్ రాయ్. బీజేపీ రాజ్య స‌భ స‌భ్యుడు. ఈయ‌న‌కే బంగా విభూష‌ణ్ అవార్డును ప్ర‌దానం చేసింది మ‌మ‌త స‌ర్కారు. 2023లో ఈయ‌న‌ను బీజేపీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. నాగెన్ రాయ్ ది బెంగాల్ లో కీల‌క‌మైన రాజ్ బ‌న్షీ సామాజిక వ‌ర్గం. ఉత్త‌ర బెంగాల్ కు చెందిన‌వాడు. ఈ ప్రాంతంలో టీఎంసీ చాలా బ‌ల‌హీనంగా ఉంది. అక్క‌డ ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓట‌మి పాలైంది. అందుకే మ‌మ‌త‌... త‌న‌దైన శైలిలో పావులు క‌దిపారు.

రాజ‌కీయ ఊహాగానాల‌కు ఊతం

గ‌త‌వారం చివ‌ర్లో మ‌మ‌తా బెన‌ర్జీ... నాగెన్ రాయ్ స‌హా 25 మంది ప్ర‌ముఖుల‌కు అవార్డులు అంద‌జేశారు. ఈయ‌న రాజ్ బ‌న్షీకి సామాజిక‌వ‌ర్గం ప్ర‌ముఖ నాయ‌కుడు కావ‌డంతో రాజ‌కీయ ఊహాగానాలు చెల‌రేగాయి. అభిమానులు రాయ్ ను.. అనంత మ‌హారాజ్ అని పిలుచుకుంటారు. క‌ళ‌లు, క‌ల్చ‌ర‌ల్, సాహిత్యం, ప్ర‌జాపాల‌న‌-ప్ర‌జాసేవ‌లో చేసిన అసాధార‌ణ సేవ‌ల‌కు గాను బంగా విభూష‌ణ్‌ అవార్డులు అంద‌జేస్తుంటారు. ఇదే సంద‌ర్బంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌ను మ‌మ‌తా కొనియాడారు. రాజ్ బ‌న్షీ వ‌ర్గం ప్ర‌గ‌తికి ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌శంసించారు.

సామాజిక సేవ‌కుడు..

నాగెన్ రాయ్.. సామాజిక సేవ చాలా గొప్ప‌ది. ఈయ‌న 75 మంది విద్యార్థులు న్యాయ‌వాదులు అయ్యేందుకు సాయం చేశారు. వీరిలో 40 మంది సివిల్స్ సాధించారు. దీంతో బెంగాల్ లో చాలా పేరున్న వ్య‌క్తిగా మారారు. అయితే, తాను ఏ పార్టీలోనూ చేర‌డం లేద‌ని ఆయన కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. వాస్త‌వానికి నాగెన్ రాయ్ గ‌తంలో టీఎంసీతో చాలా స‌న్నిహితంగా మెలిగారు. త‌ర్వాత బీజేపీ వైపు మొగ్గుచూపారు. 2024లో మ‌మ‌తా ఆయ‌న నివాసానికి వెళ్లారు. ఇటీవ‌ల బెంగాల్ లో స‌ర్ (స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్) అమ‌లును రాయ్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. రాజ్ బ‌న్షీ సామాజిక వ‌ర్గాన్ని ఇది ఇబ్బంది పెడుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చివ‌రి నిమిషంలో పేరు...?

వాస్త‌వానికి బంగా విభూష‌ణ్ అవార్డుల జాబితాలో మొద‌ట నాగేన్ రాయ్ పేరు లేద‌ట‌. త‌ర్వాత చేతితో రాసి చేర్చిన‌ట్లు తెలిసింది. దీనిపై ధ్రువీక‌ర‌ణ లేదు. రాజ్ బ‌న్షీలు ఉత్త‌ర బెంగాల్ లో నిర్ణ‌యాత్మ‌కం కావ‌డంతో.. నాగేన్ కు అవార్డు రావ‌డం చ‌ర్చ‌నీయ‌మైంది.