Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎపిసోడ్ తో దీదీ అన్ని గీతలు దాటేశారా?

పశ్చిమబెంగాల్ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. ప్రోటోకాల్ ఇష్యూలో ఇప్పుడు వివాదంగా మారింది.

By:  Garuda Media   |   8 March 2026 9:38 AM IST
రాష్ట్రపతి ఎపిసోడ్ తో దీదీ అన్ని గీతలు దాటేశారా?
X

పశ్చిమబెంగాల్ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. ప్రోటోకాల్ ఇష్యూలో ఇప్పుడు వివాదంగా మారింది. దేశ ప్రోటోకాల్ విషయంలో మొదటిస్థానంలో నిలిచేది రాష్ట్రపతి. అలాంటి ఆ పదవిలో ఉన్న వారికి ప్రోటోకాల్ ఇష్యూ ఎదురుకావటం షాకింగ్ అంశం. ఈ మొత్తం విషయాన్ని ప్రోటోకాల్ వివాదంగానో.. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి దుందుడుకు చర్యగా ఎవరికి వారు తీర్పు చెప్పేసుకునే కన్నా.. అసలేం జరిగింది? ఈ ఉదంతం వెనుక ఉన్న కారణాలేంటి? ఈ సందర్భంగా ఎవరేం మాట్లాడారు? వారి మాటల్లో నిజం ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రపతి హోదాలో పశ్చిమ బెంగాల్ కు వెళ్లిన సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ప్రసంగం మొదట్లోనే ప్రస్తావించారు ద్రౌపది ముర్ము. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఎక్స్ లో వీడియోను షేర్ చేయటంతో పాటు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇక్కడ రెండు అంశాల్ని ప్రస్తావించాలి. ఒకటి జరిగిన సంఘటనను జరిగినట్లుగా రిపోర్టు చేయటం. రెండోది.. దీని నేపథ్యం గురించి.. ఈ వివాదంలో ఎవరెవరు ఏమన్నారు? దాని వెనుక ఉన్న అంశాలతో పాటు.. ఎవరి వాదనలో సహేతుకత ఉందన్న విషయాన్ని ప్రస్తావించాల్సిందే. అప్పుడు మాత్రమే అసలు విషయం అర్థమవుతుంది.

ముందుగా అసలేం జరిగింది?

బెంగాల్ లోని డార్జిలింగ్ లో తొమ్మిదో అంతర్జాతీయ సంతాలీ సదస్సును ఆ సంస్థ అధ్యక్షుడు నరేష్ ముర్ము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి.. గవర్నర్.. లేదంటే మంత్రులు రావాలి. కానీ.. ఎవరూ రాలేదు. ఇటీవల గవర్నర్ మార్పు జరిగిన కారణంగా ఆయన వెళ్లలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లలేదు. చివరకు సిలిగురి మున్సిపల్ కొర్పొరేషన్్ మేయర్ గౌతమ్ దేబ్ మాత్రమే ఎయిర్ పోర్టుకు వెళ్లి రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదికను కూడా చివరి నిమిషంలో మార్చారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణంగా చెబుతున్నారు. ఈ సదస్సుకు హాజరైన రాష్ట్రపతి తన ప్రసంగంలో బహిరంగంగానే తప్పు పట్టారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు చెల్లెలు వంటి వారన్న రాష్ట్రపతి.. ‘నేనూ బెంగాల్ పుత్రికనే. నేను రావడాన్ని ఎందుకు అనుమతించలేదో అర్థం కావట్లేదు. ఆమె ఏమైనా కోపంగా ఉన్నారో నాకు తెలీదు. సాధారణంగా రాష్ట్రపతి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి.. మంత్రులు రావాలి. గవర్నర్ బదిలీ కావటంతో ఆయనా రాలేదు. ఇక్కడకు వచ్చినందుకు మీకు (మేయర్, ఇతర అధికారులు) ధన్యవాదాలు. ముందుగా అనుకున్నట్లు బిధాన్ నగర్ లో కార్యక్రమం జరిగి ఉంటే బాగుండేది. ఆ వేదికను నేను చూశాను. విశాలమైన మైదానంలో ఐదు లక్షల మంది పడతారు’ అంటూ తాను చేయాల్సిన వ్యాఖ్యల్ని చేశారు.

ఇంతకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ సంగతేంటి?

ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ నిర్వహించింది. దీని అధ్యక్షుడు నరేష్ ముర్ము. ఈ సంస్థ గిరిజన తెగ అయిన సంతాలీల భాష.. సంస్కృతి.. సంప్రదాయాలను రక్షించటమే లక్ష్యంగా పని చేస్తుంది. ఇదో ప్రైవేటు సంస్థ. దీనికి నిధులను.. సంతాలీ తెగకు చెందిన వారి విరాళాలతో నడుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంతాలీ కమ్యూటిని ఏకం చేయటమే ఈ సంస్థ లక్ష్యం. మారుతున్న కాలానికి తగినట్లు సంతాలీ తెగకు చెందిన కళలు.. ఆచారాలు..నృత్యాలు అంతరించిపోకుండా కాపాడుకోవటం .. ఈ గిరిజన యువతకు విద్యను అందిస్తూనే.. వారి మూలాలు మర్చిపోకుండా ప్రోత్సహించటం లాంటివి చేస్తుంటారు.

ఈ సంస్థ అధ్యక్షుడు నరేష్ ముర్ము బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

నరేష్ ముర్ము ఒక సామాజిక కార్యకర్త మాత్రమే కాదు. ఆయన బ్యాక్ గ్రౌండ్ పెద్దదే.ఆయన ఒక ప్రముఖ శాస్త్రవేత్త కూడా. దుర్గాపూర్ లోని సెంట్రల్ మెకానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) కు డైరెక్టర్ గా పని చేస్తుననారు. మెకానికల్ ఇంజనీరింగ్లో ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గ్రాఫేన్ పరిశోధనల్లో ఆయన విశేషంగా కృషి చేశారు. సంతాలీ భాష.. తన గిరిజన సంస్క్రతిని పరిరక్షించేందుకు ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ ను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నారు?

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పరిమితులను అతిక్రమించిందన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఒక గిరిజన మహిళగా.. దేశ ప్రథమ పౌరురాలిగా ఉన్న రాష్ట్రపతికి సరైన ప్రోటోకాల్ పాటించకపోవటం.. వేదికను పదే పదే మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమెను అవమానించిదన్నారు. ‘‘రాష్ట్రపతి స్వయంగా వ్యక్తం చేసిన బాధ.. ఆవేదన దేశ ప్రజలందరిని కలిచివేసింది. ప్రజాస్వామ్యం.. గిరిజన సాధికారతనునమ్మే ప్రతి ఒక్కరూ ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘‘రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనది. ఆ పదవికి ఉండే పవిత్రతను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కళ్లు తెరిచి తన తప్పు తెలుసుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

ఈ వివాదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందన ఏంటి?

రాష్ట్రపతి పదే పదే పశ్చిమ బెంగాల్ కు వస్తుంటే ఎలా? ఏడాదికి ఒకసారి వస్తే మేం ఘనంగా ఆహ్వానిస్తాం. గౌరవిస్తాం. కానీ.. ఎన్నికల సమయంలో ఇలా పదే పదే రాజకీయాల కోసం వస్తే.. ప్రతిసారీ మేమే పనులన్నీ వదిలేసి రావటం సాధ్యం కాదు. ఆమె ఇక్కడకి బీజేపీ స్క్రిప్టు చదవటానికి వచ్చారు. ఇది ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమం. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వెళ్లాలో వారే వెళ్లారు. రాష్ట్రపతి కార్యాలయం పంపిన అధికారిక లైన్ అప్ లో నా పేరు కానీ.. నా మంత్రుల పేర్లు కానీ లేవు. కేవలం మేయర్.. అధికారుల పేర్లు మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు నేను వెళ్లాల్సిన అవసరం ఏముంది?

మమత చెప్పినట్లు.. రాష్ట్రపతి పదే పదే బెంగాల్ కు వెళ్తున్నారా?

గత ఏడాది అంటే.. 2025 మొత్తంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కసారి మాత్రమే పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. ఆ తర్వాత ఏడాదిలో మళ్లీ ఇప్పుడు మాత్రమే బెంగాల్ కు వెళ్లారు. సీఎం మమత అన్నట్లు పదే పదే అనటంలో ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలో రావటం ఏమిటి? అన్నది. కానీ.. గణాంకాల ప్రకారం చూస్తే.. గత ఏడాది ఒకసారి.. ఈ ఏడాది ఇదే తొలిసారి. గత పర్యటనకు తాజా పర్యటనకు మధ్య ఎంతకాలం ఉందన్నది చూస్తే ఏడెనిమిది నెలలుగా చెప్పాలి.

వేదికను పదే పదే మార్చారా?

మొదట ఈ సదస్సును డార్జిలింగ్ జిల్లాలోని బిధాన్ నగర్ లో ఒక విశాలమైన గ్రౌండ్ లో నిర్వహించాలని భావించారు. ఈ గ్రౌండ్ 5 లక్షల మంది పట్టే సామర్థ్యం ఉందన్న మాట చెబుతారు. నిర్వాహకుల వ్యాఖ్యల ప్రకారం రాష్ట్ర పోలీసులు భద్రతా కారణాలు చూపించి నాలుగుసార్లు వేదికను మార్చాలని ఒత్తిడిని తెచ్చినట్లుగా చెబుతున్నారు. చివరగా ఈ సదస్సును సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న గోసాయిపూర్ లోని సంతోషిణి హైస్కూల్ మైదానంలో జరిగింది. తొలుత అనుకున్న వేదికకు.. చివరగా నిర్వహించిన వేదికకు మధ్య దూరం 20-25 కిలోమీటర్లు ఉంటుంది.

వేదిక మార్పు గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. ‘‘మొదట అనుకున్న బిధాన్ నగర్ మైదానం చాలా విశాలంగా ఉంది. అక్కడ 5 లక్షల మంది సులభంగా పట్టేవారు. ప్రభుత్వం దానిని రద్దీగా ఉందని చెప్పి గోసాయిపూర్ కు మర్చారు. దీని కారణంగా వేలాది మంది సంతాలీలు దూరాభారంతో రాలేకపోయారు’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంతాలీ సంస్థ నరేష్ ముర్ము మాట్లాడుతూ.. రాష్ట్రపతి పాల్గొన్న వేదిక దగ్గర ఒక బాత్రూం కూడా ఏర్పాటు చేయలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మొత్తంగా చూస్తే.. ఎన్నికల ఏడాదిలో రాష్ట్రపతి గిరిజనులను ప్రభావితం చేసేలా ప్లాన్ చేశారన్న భావన సీఎం మమత మాటల్లో వినిపిస్తుంది. ఒకవేళ.. అదే నిజమని అనుకుందాం. రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటే.. విమర్శలు ఎదురు కావా? తప్పుడు సంప్రదాయాన్ని తీసుకొచ్చిన రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచిపోరా? ఒకవేళ రాష్ట్రపతి హోదాలో ఉన్న ద్రౌపది ముర్ము.. కేంద్ర ప్రభుత్వ రాజకీయ అజెండాకు తగ్గట్లు నడుచుకున్నారనే అనుకుందాం. అలా చేసినా.. చెడ్డపేరు రాష్ట్రపతికి.. కేంద్రప్రభుత్వానికే వస్తుంది కదా.

ఒకవేళ సీఎం మమత పేర్కొన్నట్లు రాష్ట్రపతి కార్యాలయం పంపిన అధికారిక లైన్ అప్ లో తన పేరు లేదన్నదే నిజమని అనుకుందాం. అలా లేకున్నా.. రాష్ట్రపతి హోదాకు తాను గౌరవించానని.. తనను అవమానించినా.. తాను మర్యాదగా స్పందించానని చెప్పుకునే వీలుంది కదా. అలాంటప్పుడు దీదీకి సానుభూతి వ్యక్తమవుతుంది కదా? బెంగాల్ కు తరచూ వస్తున్నారన్న దీదీ మాటల్ని సాంకేతికంగా చూసినా.. ఏడెనిమిది నెలలు అన్నది దీర్ఘకాలంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. దూకుడు.. మొండితనం.. ఏదైతే అదే అవుతుందన్న తెగింపు.. వీటన్నింటితో పాటు దీదీ మూర్ఖత్వం వెరసి.. రాష్ట్రపతికి చేదు అనుభవాన్ని మిగిల్చాయని చెప్పాలి. ఎదుటోళ్లు మర్యాదపూర్వకంగా వ్యవహరించకుంటే మాత్రం.. మనం మన మర్యాదను ఎందుకు మిస్ చేసుకోవాలన్న కోణంలో చూస్తే.. దీదీ దూకుడు గీతలన్నీ దాటేసేలా చేశాయన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పకతప్పదు.