అసలైన టీఎంసీ ఎవరిది? మమత వర్సెస్ రెబల్స్.. ఈసీ కోర్టుకు బంతి
బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు తృణమూల్ పై తమకే సర్వహక్కులు ఉన్నాయని ప్రకటించుకున్నారు.
By: Tupaki Political Desk | 23 Jun 2026 8:00 PM ISTబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు తృణమూల్ పై తమకే సర్వహక్కులు ఉన్నాయని ప్రకటించుకున్నారు. అంతేకాకుండా పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి మమతా బెనర్జీని తొలగించారు. అదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంపీ అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీఎంసీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సివుంది. ప్రస్తుతం కార్యవర్గ పదవీకాలం ముగియడంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సోమవారం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇక మంగళవారం మాజీ ముఖ్యమంత్రి మమత కూడా తనదే అసలైన టీఎంసీ అంటూ ప్రకటన చేశారు. తన అధ్యక్షన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఎంపిక చేస్తూ ఆ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
పశ్చిమబెంగాల్ లో అధికారం కోల్పోయిన తర్వాత టీఎంసీ పార్టీ ఛిన్నాభిన్నం అయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీని ఎన్నుకున్నారు. మమతను కాదని రితబ్రతను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసిన ఎమ్మెల్యేలు తొలుత తమ నాయకురాలుగా మమత ఉంటారని ప్రకటించారు. అయితే అనూహ్యంగా సోమవారం తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి మమతను తప్పించి ఆమె స్థానంలో హౌరా సెంట్రల్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ను చైర్మన్ గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మరో 30 మందికి వివిధ పదవులను కట్టబెట్టారు. దీంతో తృణమూల్ తో మమతకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
పార్టీ అధినేత్రిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఎమ్మెల్యేలు కేడర్ పై పట్టు సాధించేందుకు మమత సన్నిహితులతోనూ మంతనాలు సాగిస్తున్నారు. మమతకు అత్యంత నమ్మకస్తులుగా పేరున్న కోల్ కతా మాజీ మేయర్ ఫిర్హద్ హకీమ్, అరూప్ బిశ్వాస్ వంటి వారిని తమ వర్గంలో చేర్చుకుని కీలక పదవులు అప్పగించారు. ఈ పరిణామాలతో షాక్ కు గురైన మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తిరుగుబాటు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు పార్టీపై తన ఆధిపత్యం నిరూపించుకునేలా కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి పంపారు. తృణమూల్ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎవరిని గుర్తిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.
కాగా, తాజా రాజకీయాలతో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 1998లో తృణమూల్ ను స్థాపించిన మమతను పార్టీ నుంచి బయటకు పంపడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ తో విభేదించి సొంతంగా పార్టీ పెట్టిన మమత 2011లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు గెలిచి పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ ప్రభుత్వాన్ని నడిపారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయని అంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతపై ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో రాజకీయంగా చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అవాంతరాలను అధిగమించి ఆమె మళ్లీ పూర్వంలా పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? అన్నదే ఇప్పుడు సందేహాస్పదంగా చెబుతున్నారు. మమత వయసు రీత్యా ఆమె మళ్లీ రాజకీయంగా క్రియాశీలమయ్యే పరిస్థితులే ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయని అంటున్నారు.
