Begin typing your search above and press return to search.

టీఎంసీ రెబెల్స్ మీద అనర్హత కత్తి...మమతా మజాకానా !

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన పార్టీని వీడి ప్రత్యర్థులతో చేతులు కలిపిన రెబెల్ ఎంపీల మీద అనర్హత వేటు కోరుకుంటున్నారు.

By:  Satya P   |   27 Aug 2026 9:17 AM IST
టీఎంసీ రెబెల్స్ మీద అనర్హత కత్తి...మమతా మజాకానా !
X

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన పార్టీని వీడి ప్రత్యర్థులతో చేతులు కలిపిన రెబెల్ ఎంపీల మీద అనర్హత వేటు కోరుకుంటున్నారు. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ కి గతంలోనే వినతి చేశారు. అయితే అక్కడ ఆలస్యం అవుతోందని ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీలు 20 మంది దాకా ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. పార్టీ గీత దాటిన రెబెల్ ఎంపీల విషయంలో లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ మొత్తం ప్రక్రియ వేగవంతమైంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా ఆ 20 మంది ఎంపీలకు నోటీసులు జారీ చేసి స్పందన తీసుకోవాలని కోరింది. ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్రెబల్ ఎంపీల అనర్హత పిటిషన్లపై లోక్‌సభ సచివాలయం కూడా స్పందించింది.

వివరణ ఇవ్వాలంటూ నోటీసులు :

ఇదిలా ఉంటే టీఎంసీ నుంచి తాముగా బయటకు వచ్చిన ఇరవై మంది రెబల్ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐ లో చేరిపోయారు. ఆ తరువాత వారంతా పార్లమెంట్ లో తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ ఆఫీసుని కోరారు. ఇక వీరంతా అధికార ఎన్డీయేలో తాము భాగస్వాములమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి నుంచి కొందరికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కూడా దక్కుతుందని ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ కీలక తరుణంలో ఒక్కసారిగా స్పీకర్ ఆఫీసు నుంచి వీరికి నోటీసులు అందాయి. ఈ విధంగా నోటీసులు అందుకున్న ఇరవై మంది రెబెల్స్ ఏడు రోజులలోగా తమ సమాధానం లేదా వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆ నోటీసులో కోరారు.

ఏమి జరుగుతుంది :

టీఎంసీ రెబెల్ ఎంపీలు నిన్నటి దాకా కాబోయే కేంద్ర మంత్రులని భావించారు. అంతే కాదు చాలా మంది అధికార పక్షంలో భాగస్వామ్యంతో కీలకంగా చలామణీ అవుతున్నారు. మరో మూడేళ్ల పాటు తమకు ఏ విధమైన ఢోకా ఉండదని కూడా వారు ఉన్నారు. అయితే ఇపుడు అనూహ్యంగా స్పీకర్ ఆఫీసు నుంచి నోటీసులు అందడంతో వీరంతా తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సి వస్తోంది. మరి ఏమి చెబుతారు, వారి వివరణ తరువాత స్పీకర్ ఆఫీసు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చర్చగా ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇరవై మందిపై అనర్హత వేటు వేయాల్సిందే అని తృణమూల్ కాంగ్రెస్ అయితే గట్టిగా కోరుతోంది.

సగం విజయం సాధించారు :

ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరి ఎన్డీయేతో కలసి పనిచేస్తున్న రెబెల్ ఎంపీలు కచ్చితంగా అనర్హతకు గురి కావాల్సిందే అని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. మరో వైపు ఈ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండడంతో స్పీకర్ ఆఫీస్ కూడా వేగంగా ఏదో ఒకటి తేల్చక తప్పని పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే రెబెల్ ఎంపీలకు నోటీసులు జారీ చేయడంతో ప్రక్రియ ప్రారంభం అయిందని దానికి వారి నుంచి సమాధానాలు వివరణ తీసుకున్న మీదట స్పీకర్ ఆఫీస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే రెబెల్ ఎంపీల మీద అనర్హత కత్తి వేలాడుతోంది. మమతా బెనర్జీ అయితే నోటీసుల దాకా కధను తీసుకుని వచ్చి సగం విజయం సాధించారు అని అంటున్నారు.