ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ
మమతా బయో మార్పుపై బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేశారని... అది ఇప్పుడు దీదీకి కూడా అర్థమైందని వారు విమర్శిస్తున్నారు.
By: A.N.Kumar | 9 May 2026 5:00 PM ISTపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఎన్నికల ఫలితాలపై రగులుతున్న రాజకీయ సెగలు, ఇప్పుడు ఒక చిన్న సోషల్ మీడియా అప్‌డేట్‌తో సరికొత్త మలుపు తిరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ఎక్స్ బయోలో చేసిన మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బయోలో మార్పు.. చర్చకు దారితీసిన సంకేతం
ఇప్పటివరకు తన ప్రొఫైల్ బయోలో “ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి అని గర్వంగా పేర్కొన్న దీదీ, తాజాగా దాన్ని తొలగించారు. దాని స్థానంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ 15వ, 16వ , 17వ ముఖ్యమంత్రి అని అప్‌డేట్ చేశారు. అంటే ఆమె తాను గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినట్లు మాత్రమే పేర్కొన్నారు తప్ప, ప్రస్తుతం అధికారంలో ఉన్నట్లు సూచించే 'ప్రస్తుత' అనే పదాన్ని తొలగించారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. మమతా బెనర్జీ వంటి సీనియర్ నేత తన సోషల్ మీడియాలో ఇలాంటి మార్పు చేశారంటే, అది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు.. దాని వెనుక బలమైన రాజకీయ సంకేతం ఉంది. తాను ప్రస్తుత ముఖ్యమంత్రినని చెప్పకుండా గత కాలానికి పరిమితం చేసుకోవడం ద్వారా ఆమె పరోక్షంగా ఎన్నికల ఫలితాలను లేదా మారిన రాజకీయ పరిస్థితులను అంగీకరించినట్లుగా భావిస్తున్నారు.
ఎన్నికల సంఘంపై ఆరోపణలు.. పోరాట బాట
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, బీజేపీకి అనుకూలంగా పని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆమె నిరంతరం ఆరోపిస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజల తీర్పును తారుమారు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఆమె అధికారికంగా తన ఓటమిని ఒప్పుకోలేదు సరే కదా సీఎం పదవికి రాజీనామా కూడా సమర్పించలేదు. అయితే, బయో మార్పుతో ఆమె తన వ్యూహాన్ని మార్చుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ కౌంటర్.. "ప్రజల తీర్పు ఇదే"
మమతా బయో మార్పుపై బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేశారని... అది ఇప్పుడు దీదీకి కూడా అర్థమైందని వారు విమర్శిస్తున్నారు. అవినీతి, బంధుప్రీతి మరియు హింసాత్మక రాజకీయాల వల్లే టీఎంసీ ఈ స్థితికి చేరుకుందని, మమతా బెనర్జీ తన ఓటమిని పరోక్షంగానైనా ఒప్పుకోక తప్పలేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియాలో జోరుగా చర్చ
ఈ పరిణామంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు."మమతా బెనర్జీ చివరకు నిజాన్ని గ్రహించారు, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం సమాచారాన్ని అప్‌డేట్ చేయడం మాత్రమేనని.. దీనికి రాజకీయ రంగు పులమడం అనవసరమని వాదిస్తున్నారు.
రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది?
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో మమతా బెనర్జీ ఒక బలమైన శక్తి. అటువంటి నేత తన హోదా విషయంలో తీసుకున్న ఈ చిన్న నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండవచ్చు. ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేక చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ "ఎక్స్ బయో" వ్యవహారం బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుకు కారణమైందని చెప్పవచ్చు. రానున్న కొద్ది గంటల్లో కోల్‌కతా రాజకీయ కేంద్రంగా ఎలాంటి కీలక ప్రకటనలు వెలువడతాయో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
