Begin typing your search above and press return to search.

రోడ్డెక్కిన సీఎం దీదీ.. మోడీ హ‌యాంలో ఇది నాలుగోసారి!

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ(దీదీ) మ‌రోసారి రోడ్డెక్కారు. త‌నే స్వ‌యంగా నిర‌స‌న‌కు దిగారు.

By:  Garuda Media   |   4 Nov 2025 11:09 PM IST
రోడ్డెక్కిన సీఎం దీదీ.. మోడీ హ‌యాంలో ఇది నాలుగోసారి!
X

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ(దీదీ) మ‌రోసారి రోడ్డెక్కారు. త‌నే స్వ‌యంగా నిర‌స‌న‌కు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తృణ మూల్ కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మంత్రుల‌ను రోడ్డెక్కేలా చేశారు. అటు కేంద్ర ప్ర‌భుత్వానికి, ఇటు ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఓట్ల రిగ్గింగుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపించారు. రాష్ట్ర రాజ‌ధాని కోల్‌క‌తా వీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీకి సీఎం మ‌మ‌త నేతృత్వం వ‌హించారు.

ఎందుకీ నిర‌స‌న‌?

ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను స‌వ‌రించాల‌ని నిర్ణ‌యించింది. `ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)`గా పిలిచే స‌ర్‌ను త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ.. ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌కు దిగారు. కేంద్రం-ఎన్నిక‌ల సంఘం కుమ్మ‌క్క‌యి.. స‌ర్‌ను చేప‌డుతున్నాయ‌ని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని తృణ‌మూల్ అనుకూల‌ ఓటును తీసేయ‌డ‌మే .. స‌ర్ ల‌క్ష్య‌మ‌ని ఆమె తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిని అధికారిక `సైలెంట్ రిగ్గింగ్‌`గా ఆమె అభివ‌ర్ణించారు.

ఈ నిర‌స‌న‌లో భాగంగా పాద‌యాత్ర నిర్వ‌హించారు. సుమారు 4 కిలో మీట‌ర్ల మేర‌కు మ‌మ‌తా బెన‌ర్జీ పాద‌యాత్ర‌గా న‌డిచారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి కూడా భారీ స్పంద‌న ల‌భించింది. ర‌హ‌దారులు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌తో నిండిపోయాయి. అనంత‌రం.. ఆమె మాట్లాడుతూ.. కేంద్రం చేతిలో కొన్ని వ్య‌వ‌స్థ‌లు కీలుబొమ్మ‌లుగా మారాయ‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకోవాల్సిన సంస్థ‌లు.. కేంద్రం చెప్పిన‌ట్టు వింటున్నాయ‌న్నారు. స‌ర్‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన‌సాగించేందుకు తాము ఒప్పుకోబోమ‌న్నారు.

ఇప్ప‌టికి నాలుగు సార్లు..

కాగా.. కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ నాలుగు సార్లు ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. 1) జీఎస్టీ ప‌న్నుల వాటాలో త‌మ‌పై వివ‌క్ష చూపిస్తున్నార‌ని విమ‌ర్శిస్తూ తొలిసారి. 2) కోల్‌క‌తాలో అప్ప‌గవ‌ర్న‌ర్‌, మాజీ ఉప‌రాష్ట్ర ప‌తి జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ నిర్ణ‌యాలు.. త‌మ బిల్లులను ఆమోదించ‌క‌పోవడాన్ని నిర‌సిస్తూ.. రెండో సారి సీఎంగా ఆమె నిర‌స‌న‌వ్య‌క్తం చేశారు.. 3) గ‌త ఏడాది ఆర్జీక‌ర్ ఆసుప‌త్రిలో ఓ వైద్య విద్యార్థినిపై జ‌రిగిన అమానుషంపై కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవ‌డాన్ని నిర‌సిస్తూ.. మూడోసారి ఉద్య‌మించారు. 4) తాజాగా స‌ర్‌ను వ్య‌తిరేకిస్తూ.. నాలుగోసారి మ‌మ‌తా బెన‌ర్జీ రోడ్డెక్కారు.