మమత మకాం అక్కడేనట...రఫ్ ఆడిస్తారా ?
నేను ఫ్రీ బర్డ్ ని అని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంగా చెప్పారు.
By: Satya P | 7 May 2026 9:04 AM ISTనేను ఫ్రీ బర్డ్ ని అని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంగా చెప్పారు. నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను అన్నట్లుగా ఆమె బిగ్ సౌండ్ చేశారు. మమతా బెనర్జీ అంటే పట్టుదలకు మారు పేరు. ఆమె వయసు 71 ఏళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే వయో భారం ఆమెను వెంటాడుతోంది. ఏకధాటిగా పదిహేనేళ్ళ పాటు పశ్చిమ బెంగాల్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ఆమె మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈసారి కనుక తనకు చాన్స్ వస్తే కొన్నాళ్ల పాటు సీఎం గా ఉండి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సీఎం పగ్గాలు అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ప్రధాని కావాలని ఎంతగానో కలలు కన్నారు. అయితే ఆమె కలలను బెంగాల్ లోనే కమలం పార్టీ కూల్చేసింది. దాంతో ఆమె తల్లడిల్లుతున్నారు. అయినా సరే తేరుకుని మరీ గర్జిస్తున్నారు. తాను స్వేచ్చా జీవిని కాబట్టి కాస్కో కాషాయం పార్టీ అని కూడా సవాల్ చేస్తున్నారు.
ఇండియా కూటమి మద్దతు :
తనకు ఇండియా కూటమి నుంచి పూర్తి మద్దతు ఉందని మమతా బెనర్జీ చెబుతున్నారు. రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే వంటి వారు అంతా తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారని కీలక నాయకులు తొందరలోనే బెంగాల్ వస్తారని కూడా ఆమె చెబుతున్నారు తాను ఒంటరిని కానని ఇండియా కూటమి తన వెంట ఉందని జాతీయ స్థాయిలో బీజేపీని ఎండగడతాను అని ఆమె స్పష్టంగా చెబుతున్నారు.
ఢిల్లీకే మకాం :
దాంతో మమతా బెనర్జీ ఆలోచనలు అన్నీ జాతీయ రాజకీయాల మీదనే ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ఆమె తన మకాం ని కోల్ కటా నుంచి ఢిల్లీకి మార్చేస్తారా అని కూడా అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. 2029లో లోక్ సభకు ఎన్నికలు ఉన్నాయి. ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. ఇక్కడ చూస్తే మమతా బెనర్జీ ఖాళీ అయిపోయారు. మామూలుగానే ఆమె జాతీయ స్థాయిలో రాణించాలని భావిస్తూంటారు. ఇపుడు కాలం కూడా కలసి వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. ఆమె ఢిల్లీలోనే ఉంటూ కేంద్రాన్ని ఎండగడుతూ మోడీ అండ్ షాల మీద నేరుగానే రాజకీయ యుద్ధానికి తెర తీస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
బలోపేతం అంటూ :
ఇండియా కూటమిని బలోపేతం చేస్తామని మమతా బెనర్జీ అంటున్నారు. ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. పెద్దన్నగా కాంగ్రెస్ ఉంది. అయితే ఆ పార్టీని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలకు కీలక స్థానం ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నారు మమత అయితే ఇండియా కూటమి సారధ్యం కోరుతున్నారని వార్తలు గతంలో వినిపించాయి. ఇపుడు ఆమె ఇండియా కూటమిలో కీలక పదవి కోసం పట్టుబడతారు అని అంటున్నారు. ఆమెకు ఎస్పీ తరఫున అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, అలాగే ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వంటి వారి మద్దతు దక్కుతుందని అంటున్నారు. ఇండియా కూటమికి బలమైన గొంతుక కావాలని అంటున్నారు. దాంతో మమతా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి దేశమంతా తిరిగి యాంటీ బీజేపీ స్లోగన్ తో ఇండియా కూటమికి బలాన్ని బలగాన్ని జనాభిమానాన్ని తీసుకుని రావాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. అయితే మమతా బెనర్జీకి ఈ కీలక పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ఎంత వరకూ మొగ్గు చూపిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. మమత దూకుడు రాజకీయం చేస్తారు, దాంతో ఆమెకు పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తుందని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.
