ఈడీతో ఢీ..డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన మమత..బెంగాల్ లో రచ్చరచ్చ
బీజేపీ-మమతా బెనర్జీల మధ్య అసలే ఉప్పు-నిప్పులా ఉండే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా మూడు-నాలుగు నెలలు ఉండగానే రాజకీయం రణరంగంగా మారుతోంది.
By: Tupaki Political Desk | 8 Jan 2026 6:03 PM ISTబీజేపీ-మమతా బెనర్జీల మధ్య అసలే ఉప్పు-నిప్పులా ఉండే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా మూడు-నాలుగు నెలలు ఉండగానే రాజకీయం రణరంగంగా మారుతోంది. ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా వీధుల్లోకి వచ్చేసి ఆందోళనలకు దిగే టీఎంసీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు మరోసారి తన ఫైర్ చేపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢీ అంటూ రంగంలోకి దిగారు. రాజకీయ సలహాలిచ్చే కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయం సాక్షిగా గురువారం కోల్ కతాలో రచ్చరచ్చ జరిగింది. ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కాగా.. దాని కో ఫౌండర్ ప్రతీక్ జైన్. గురువారం ఈయన నివాసంలో ఈడీ రైడింగ్ కు వెళ్లింది. సోదాలు చేస్తుండగా ఏకంగా మమతా బెనర్జీ అక్కడకు వెళ్లారు. ప్రతీక్ నివాసం నుంచి ఆమె డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో ల్యాప్ టాప్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని చెబుతోంది. తమ సోదాల వెనుక రాజకీయం లేదని తెలిపింది.
హై కోర్టుకెక్కిన ఈడీ
మమతా కీలక డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లిన వైనంపై ఈడీ నేరుగా హైకోర్టుకు వెళ్లింది. ఆమె తమ దర్యాప్తును అడ్డుకున్నారంటూ ఫిర్యాదు చేసింది. మరోవైపు మమతా.. ఈడీ సోదాలను రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు. బీజేపీ కుట్ర అంటూ మండిపడుతున్నారు. అయితే, ఈడీ కోర్టుకు చేసిన ఫిర్యాదులో సీఎం స్థాయిలో మమతా తమ దర్యాప్తును అడ్డుకోవడమే కాదు.. బొగ్గు అక్రమ రవాణా-మనీ ల్యాండరింగ్ నిందితులను కాపాడాతున్నారని ఆరోపించింది. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.
డ్రామా.. డ్రామా..
గురువారం కోల్ కతాలో డ్రామా జరిగింది. ఉదయం 7.30కు ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లింది ఈడీ. అయితే, ఈ విషయం తెలిసింది మధ్యాహ్నం ఆయన ఇంటికి సీఎం మమతా బెనర్జీ, కోల్ కతా పోలీసులతో కలిసివెళ్లారు. అప్పటివరకు తమ సోదాలు ప్రశాంతంగా సాగాయని, కానీ, మమతా పోలీసులతో వచ్చి రెండు ప్రదేశాల్లోని కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారని ఈడీ ఆరోపించింది. ఇది తమ విధులకు ఆటంకం కలిగించడమేనని పేర్కొంది. అనుప్ మజీ అనే వ్యక్తి సారథ్యంలోని బొగ్గు అక్రమ రవాణా మాఫియా కార్యకలాపాలకు సంబంధించి బెంగాల్లోని ఆరు ప్రాంతాల్లో గురువారం సోదాలు చేపట్టామని వివరించింది. ఢిల్లీలో నాలుగుచోట్ల సోదాలు చేశామని ఈడీ తెలిపింది.
ఈ సోదాలు మా పార్టీ డేటా కోసమే..
ప్రతీక్ జైన్ ఇంటి నుంచి వెళ్లిపోతూ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఇంటి వద్దనే మీడియాతో ఆమె మాట్లాడారు. ఈడీ సోదాల లక్ష్యం తమ పార్టీ డేటానే అని అన్నారు. ఈడీ తమ ట్యాక్స్ పేపర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలనూ తీసుకున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన (సర్)లో కోటిన్నర ఓట్లను తొలగించారని, తమ పార్టీ ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈడీ తెలుసుకునే ఉద్దేశంలో ఉందని పేర్కొన్నారు. తాము ఎంత సౌమ్యులం అయినా సహించలేం కదా? అని ప్రశ్నించారు. ఐప్యాక్ టీమ్ తమకు సేవలు అందిస్తోందని.. తమ డేటా వారి వద్ద ఉందని మమత చెప్పారు. దానిని స్వాధీనం చేసుకుని ఎన్నికలను గెలవాలనేది ప్రత్యర్థుల వ్యూహం అని ఆరోపించారు. తాము ఇలాగే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మొత్తమ్మీద ఈడీ సోదాలు బెంగాల్ లో రచ్చరచ్చగా మారాయి.
