మమతా దీదీ ఫ్రస్ట్రేషన్... ప్రతీ ఇంటికీ పోలీసులు కాపలా !
మమతా దీదీ షాకింగ్ కామెంట్స్ తో కుడి ఎడమలుగా పెరు పొందిన బీజేపీ వామపక్షాలు ఒకే గొంతుకతో ఆమె మీద విరుచుకుపడుతున్నారు.
By: Satya P | 13 Oct 2025 8:12 PM ISTపశ్చిమ బెంగాల్ సీఎం గా మమతా బెనర్జీ 2011లో తొలిసారి గెలిచినప్పుడు దేశమంతా దానికి ఒక సంచలన విజయంగా అభివర్ణించింది. బెంగాల్ లేడీ టైగర్ ని ఆమెకు కితాబు ఇచ్చింది. ఎందుకంటే అప్పటికి 34 ఏళ్ళుగా అప్రతిహతంగా కమ్యూనిస్టులు బెంగాల్ ని పాలిస్తున్నారు. వారి కంచుకోటను బద్దలు కొట్టి ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా మహిళా నాయకురాలిగా మమతా బెనర్జీ సాధించిన ఆ విజయం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు కీర్తించారు. ఇక 2016 నాటికి మరోసారి మమత బెనర్జీ గెలిచి ద్వితీయ గండాన్ని దాటారు. దానికి కూడా అంతా ఆశ్చర్యంగా చూసారు. 2021లో అయితే మమతను మాజీ సీఎం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఈసారి మమత ఓటమి ఖాయమని అంతటా ప్రచారం జరిగింది. కానీ ఆసక్తికరంగా 2016 కంటే కూడా అధికంగా ఓట్లూ సీట్లూ సాధించి మమత హ్యాట్రిక్ సీఎం గా కొత్త రికార్డుని నెలకొల్పారు. ఇక 20216లో నాలుగో సారి ఎన్నికలు జరగనున్నాయి. గట్టిగా చూస్తే ఆరేడు నెలలు కూడా ఎన్నికలకు లేవు.
దీదీకి బిగ్ సవాల్ గా :
మరి పదిహేనేళ్ళుగా మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న మమతకు ఈ ఎన్నికలు ఒక విధంగా పెను సవాల్ గా మారుతున్నాయి. ఇప్పటికే యాంటీ ఇంకెంబెన్సీ అన్నది పెద్ద ఎత్తున జమ కూడుతున్న వేళ ఎన్నికల ముంగిట్లో ఉన్న సమయంలో మమతా బెనర్జీ ఫ్రస్టేషన్ కి గురి అవుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నారు. విపక్షం నుంచి వచ్చే విమర్శలకు మమత చెప్పే జవాబు కూడా తిరిగి వారికే ఆయుధంగా మారుతోంది. దీంతో దీదీ ఏమిటిది అని అంతా అనుకునే నేపథ్యం ఉంది అని అంటున్నారు.
షాకింగ్స్ కామెంట్స్ తో :
మమతా దీదీ షాకింగ్ కామెంట్స్ తో కుడి ఎడమలుగా పెరు పొందిన బీజేపీ వామపక్షాలు ఒకే గొంతుకతో ఆమె మీద విరుచుకుపడుతున్నారు. ఇంతకీ మమతా బెనర్జీ ఏమన్నారు అన్నది చూస్తే కనుక దుర్గాపూర్ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని క్యాంపస్ సమీపంలోనే సామూహిక అత్యాచారానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక గత ఏడాది కూడా ఇదే తరహాలో ఒక భయంకరమైన ఘటన జరిగింది. దాంతో పశ్చిమ బెంగాల్ లోని వైద్య కళాశాలలో కూడా వైద్య విద్యార్థులకు భద్రత కల్పించలేకపోతున్న ప్రభుత్వం అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానికి బదులు అన్నట్లుగా మమతా బెనర్జీ ఆ వైద్య విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వెళ్ళడమేంటి అని ఎదురు ప్రశ్నించడం విశేషం. అలా విద్యార్ధినులు రాత్రి వేళ బయటకు వెళ్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని కూడా మమత బెనర్జీ ప్రశ్నించారు.
ప్రాధమిక హక్కు ఉన్నా కూడా :
మమతా బెనర్జీ అన్న మాటలు ఏంటి అంటే ఎవరైనా ఎపుడైనా బయటకు వెళ్ళేందుకు ప్రాధమిక హక్కు ఉన్నా అర్ధ రాత్రి ఇష్టానుసారం బయటకు వెళ్తే ఎవరిది బాధ్యత అని ఎదురు ప్రశ్నించారు. అది కూడా హాస్టల్ నుంచి అడవికి అనుకుని ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎలా అని అన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు హాస్టల్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది కదా అని ఆమె అన్నారు. దీని మీద సదరు మెడికల్ కాలేజీ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అంతే కాదు నిందితులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని ఇప్పటికే ముగ్గురుని అరెస్ట్ చేశామని ఆమె చెప్పుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రైవేట్ కాలేజీలు తమ క్యాంపస్ లోపల చుట్టుపక్కనా భద్రతను నిర్దారించుకోవాలని ఆమె కోరారు. పోలీసులకు సైతం కొన్ని పరిమితులు ఉన్నాయని రాత్రి ఎవరు ఏ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారో పోలీసులకు ఎలా తెలుస్తుందని ప్రతీ ఇంటికీ పోలీసులు కాపలా ఉండలేరని మమత వ్యాఖ్యానించడమే ఇపుడు వివాదానికి కారణం అవుతోంది.
బాధ్యత మీది కాదా దీదీ :
అఫ్ కోర్స్ మమత అన్నదాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ తన రాష్ట్ర పరిధిలో జరిగిన ప్రతీ సంఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నది మూడు సార్లు సీఎం గా ఉన్న ఆమెకు తెలియదా అని అంటున్నారు. విపక్షాలు అయితే మమత ఈ విధంగా మాట్లాడమేమిటి అని మండిపడుతున్నాయి. శాతి భద్రతలను కాపాడడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ ఒక వైపు వామపక్షాలు మరో వైపు విమర్శలు చేస్తున్నాయి. మొత్తం మీద చూస్తే మమతా బెనర్జీ విపక్షాలు అంటున్నట్లుగా ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతున్నారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.
