నాపై చెప్పులు వేయమని ముఖ్యమంత్రే చెప్పారు: మమత సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై ఆదివారం కొందరు దుండగులు చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారు.
By: Garuda Media | 10 Aug 2026 7:40 PM ISTపశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై ఆదివారం కొంద రు దుండగులు చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారు. ఇదే సమయంలో ఆమెను `బందిపోటు రాణి` అంటూ.. నినాదాలు చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో 15 సంవత్సరాల పాలనకు తెరదించిన మమత.. ప్రస్తుతం విపక్షంలో ఉన్నారు. తాజాగా ఉత్తరపరగణా 24 జిల్లాలో తృణమూల్ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు.. మమత వచ్చారు. ఈ సమయంలో ఆమె కారును చుట్టుముట్టిన దుండగులు.. చెప్పులు విసిరారు. అదేసమయంలో బుదర పోశారు. కర్రలతో కారు అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనతో భీతిల్లిన మాజీ సీఎం మమత.. అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే.. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారి సూచనలు, సలహాలతోనే ఆయన ఆధ్వర్యంలోనే తనపై దాడి జరిగిందని.. ఇది పూర్తిగా బీజేపీ నేతల పనేనంటూ మమత ఆరోపించారు.
అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ``మాజీ ముఖ్యమంత్రిని, 15 ఏళ్లు రాష్ట్ర సీఎంగా వ్యవహరించిన నాపై ఇలా చేస్తారా? ఇది పక్కా ప్రణాళికతోనే జరిగింది. నేను ఇక్కడకు వస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చాం. కానీ, భద్రత కల్పించడంలోపోలీసులు విఫలమయ్యాయి. వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. బీజేపీ నాయకులు పోలీసుల కోసం పనిచేస్తున్నారు. ఈ విషయంపై కేంద్రం దృష్టి పెట్టాలి. విచారణ చేయాలి.`` అని సోమవారం కోల్‌కతాలో మీడియా ముందు ఆక్రోశించారు.
అమిత్ షా ఘటన గుర్తులేదా? : సీఎం
ఈ సమయంలో సీఎం సువేందు అధికారి కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానని, బీజేపీ పెద్దలను గద్దెదింపుతానని శపథం చేసిన మమతకు ఇప్పుడు కేంద్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అంతేకాదు.. గతంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను ల్యాండ్ కాకుండా అడ్డుకున్నారని.. సీబీఐ అధికారులపైనే దాడులు చేసి కేసులు పెట్టారని.. మమత అరాచక వాది.. అంటూ వ్యాఖ్యానించారు. ఆమె ను సొంత పార్టీ కార్యకర్తలే వద్దనుకుంటున్నారని.. వారే దాడులు చేశారని వ్యాఖ్యానించారు. దాడులు చేసింది ఎవరో మమతకు తెలుసునన్న ఆయన.. వారి పేర్లు ఇస్తే.. తక్షణమే అరెస్టు చేయిస్తామని చెప్పారు.
