రాజకీయం: 2021 గాయాన్ని తవ్వుతున్నారు..!
2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎంగా ఉన్నమమతా బెనర్జీ.. తనపై కొందరు దాడి చేశారని.. దీంతో కాలికి గాయం అయిందని పేర్కొన్నారు.
By: Garuda Media | 4 Oct 2026 11:00 AM ISTరాజకీయం.. రాజకీయమే... అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రత్యర్థులను వేటాడి వెంటాడడంలో బీజేపీ తన విధానాలను కొనసాగిస్తోం ది. ఈ క్రమంలో తాజాగా 2021.. అంటే దాదాపు ఐదేళ్ల కిందట జరిగిన ఓ ఘటనపై విచారణకు ఆదేశించడం దేశం మొత్తాన్నీ నివ్వెర పోయేలా చేసింది. వాస్తవానికి ఆ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడం.. తప్పు చేశారని భావించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం.. వంటి అయిపోయాయి. నిజానికి నాడు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా ప్రజలు దాదాపు మరిచిపోయారు. కానీ.. బీజేపీ మాత్రం నాటి ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. ప్రత్యర్థులను మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది.
విషయం ఏంటి?
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీ ఆవిర్భవించిన తర్వాత.. తొలిసారి పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంది. దీంతో ప్రత్యర్థులను వేటాడుతోందన్నది రాజకీయంగా వస్తున్న విమర్శలు నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌లో కల్లోలం రేగడం.. ఈ పార్టీ చీలిపోవడం.. అసలు ఎవరికీకాకుండా పోవడం కూడా తెలిసిందే. అంతేకాదు.. మమత పరిస్థితి ఇప్పుడు దారుణంగా కూడా తయారైంది. దీంతో `ప్రత్యర్థి` అనే మాటే ప్రభుత్వానికి వినిపించడం లేదు. అయితే.. `ఇది చాలదు` అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
మమతా బెనర్జీకి సింపతీ కూడా దక్కకుండా.. ఆమెను రాజకీయంగా మరింత డైల్యూట్ చేయడంతోపాటు.. పేదలు, మహిళల్లో ఉన్న కొద్దిపాటి సానుభూతిని కూడా కనుమరుగయ్యేలా చేయాలన్నది కమల నాథుల లక్ష్యమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే 2021లో జరిగిన ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఒకవైపు పోలీసులతోను, మరోవైపు వైద్య శాఖ అధికారులతోనూ కూడా రెండు విచారణలు చేయించనున్నట్టు ఆయన ప్రకటించారు. ``నాటి గాయం తాలూకు నిజాన్ని తేలుస్తాం.`` అని కఠిన వ్యాఖ్యలు చేయడం వెనుక మమతను కార్నర్ చేశారని కొందరు వ్యాఖ్యానించారు.
అప్పట్లో ఏం జరిగింది?
2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎంగా ఉన్నమమతా బెనర్జీ.. తనపై కొందరు దాడి చేశారని.. దీంతో కాలికి గాయం అయిందని పేర్కొన్నారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక, ఆ గాయానికి కట్టుకుని ఆమె అలానేఎన్నికల ప్రచారంలో వీల్ చైర్ సాయంతోనే పాల్గొన్నారు. అయితే.. దీనిపై విమర్శలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘమే అప్పట్లో విచారణకు ఆదేశించింది. దీనిని విచారించిన అధికారులు అది దుండగులు చేసిన గాయం కాదని.. పొరపాటు మమత కాలు బెణికిందని తెలిపారు. నివేదికలు కూడా ఇచ్చారు. అయితే.. ఆమె కాలికి గాయం అయిందంటూ.. ప్రచారం చేసిన అధికారులు, సర్టిఫికెట్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు. దీంతో కథ ముగిసింది. ఆ సెంటిమెంటుతో మమత మరోసారి విజయం దక్కించుకున్నారు. అయితే.. తాజాగా నాటి కేసును వెలికి తీయాలని.. ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని.. మోసకారులను(పరోక్షంగా మమత) సహించేది లేదని సీఎం సువేందు వ్యాఖ్యానించడం గమనార్హం.
