Begin typing your search above and press return to search.

నితీష్ మీద కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్...బీజేపీ మీద నిప్పులు !

బీహార్ కి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నితీష్ కుమార్. ఆయనను సరిగ్గా ఆరు నెలల క్రితం సీఎం కుర్చీ నుంచి దించేశారు.

By:  Satya P   |   26 Oct 2026 9:15 AM IST
నితీష్ మీద కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్...బీజేపీ మీద నిప్పులు !
X

బీహార్ కి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు నితీష్ కుమార్. ఆయనను సరిగ్గా ఆరు నెలల క్రితం సీఎం కుర్చీ నుంచి దించేశారు. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ప్రతిష్టించబడ్డారు. నితీష్ ని రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఆయన్ని కేంద్ర మంత్రిగా చేస్తామని బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా ప్రచారం సాగింది. అయితే అది జరగలేదు, సరికదా గత ఆరు నెలలుగా నితీష్ కుమార్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. దీని మీద బీహార్ లో జేడీయూ నేతలు అంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ నితీష్ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది. ఇది వ్యూహాత్మకం అని అంటున్నారు.

నితీష్ పక్కా సోషలిస్ట్ :

బీహార్ మాజీ సీఎం నితీష్ సోషలిస్టు అని ఆయన సొంత రాష్ట్రం పాట్నాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ మాట్లాడారు. సోషలిస్టు నాయకుడైన నితీష్ కుమార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని నమ్మే వారితో చేతులు కలపడం బాధ కలిగిస్తోందని ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ పక్కా సోషలిస్ట్ అన్నారు. దీనిని బట్టి ఆయన వేరు బీజేపీ వేరు అన్నది స్పష్టంగా ఖర్గే చెప్పదలచారా అన్నది అంతటా చర్చిస్తున్నారు.

అసంతృప్తికి ఆజ్యమా :

ఇప్పటికే నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది. తాను కేంద్ర పెద్దలతో సరిసాటి నాయకుడిని అని ఇంకా చెప్పాలీ అంటే సీనియర్ మోస్ట్ లీడర్ అని నితీష్ భావిస్తున్నారు అన్నది కూడా చెబుతారు. అది కూడా నిజమే అన్నది తెలిసిందే. నితీష్ 1977 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆయన చాలా ఏళ్ళ క్రితమే కేంద్ర మంత్రి గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో కీలకం అయ్యారు. అలా చూస్తే ఆయన దిగ్గజ నేతగా ఎన్డీయేలో ఉన్నారు. అలాంటి నితీష్ కుమార్ ఇపుడు ఏమీ కాకుండా ఉన్నారు అన్నది అభిమానులలో అనుచరులలో ఉంది. దానికి కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న సాఫ్ట్ కార్నర్ కూడా ఆలోచింపచేస్తోంది.

అందరితో కలసి :

వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని ఎన్డీయే మిత్రులను తగ్గించాలని కాంగ్రెస్ ద్విముఖ్య వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ సోషలిస్ట్ అని చెప్పడం ద్వారా ఆయన్ని ఈ వైపునకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. అంతే కాదు దేశంలో రాజకీయం మారుతోంది అని కాంగ్రెస్ హింట్ ఇస్తోంది. అందువల్ల ఇండియా కూటమిదే రేపటి రోజులు అని ధీమా వ్యక్తం చేస్తోంది. అలా ఎన్డీయేకు ప్రస్తుతం బలం ఇస్తూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో తన ఎంపీల మద్దతుతో కీలకంగా ఉన్న జేడీయూ మీద ఈ సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉంటే :

ఈ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కొనసాగుతున్నంతకాలం అసలు ఎక్కడా శాంతి నెలకొనదని ఖర్గే సంచలన వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో ఓట్ల చోరీ పెద్ద ఎత్తున సాగుతోంది అని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మొత్తం దేశంలో ఎన్నికల నిర్వహణలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని ఖర్గే హెచ్చరించారు.