Begin typing your search above and press return to search.

RSS, కాంగ్రెస్.. వైరం కొనసాగుతోంది

ఖర్గే తన ప్రసంగంలో సర్దార్ పటేల్ ను 'ఐరన్ మ్యాన్'గా, ఇందిరా గాంధీని 'ఐరన్ లేడీ'గా అభివర్ణించారు.

By:  A.N.Kumar   |   31 Oct 2025 6:40 PM IST
RSS, కాంగ్రెస్.. వైరం కొనసాగుతోంది
X

నెలలు, రోజులు, సంవత్సరాలు మారినా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీకి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కు మధ్య ఉన్న పాత వైరం మాత్రం చల్లారడం లేదు. ఈ సిద్ధాంతపరమైన పోరాటం మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలతో చర్చనీయాంశమైంది.

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఈ పాత ఘర్షణకు తాజాగా ఊతమిచ్చాయి. దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తున్నందుకు RSSను నిషేధించాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు.

ఖర్గే మాట్లాడుతూ.. "సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ ఇద్దరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం జీవితాంతం పోరాడారు. కానీ నేడు ఆ విలువలను ధ్వంసం చేసే శక్తులు BJP-RSS రూపంలో దేశాన్ని వెనక్కి లాగుతున్నాయి. 1948లో మహాత్మా గాంధీ హత్య జరిగిన తర్వాత RSSను సర్దార్ పటేల్ స్వయంగా నిషేధించారని చరిత్ర చెబుతోంది. కాబట్టి దేశం ఏకతను కాపాడాలంటే మళ్లీ అలాంటి చర్యలు అవసరమే" అని ఖర్గే వ్యాఖ్యానించారు.

* ఐరన్ మ్యాన్, ఐరన్ లేడీ కృషి

ఖర్గే తన ప్రసంగంలో సర్దార్ పటేల్ ను 'ఐరన్ మ్యాన్'గా, ఇందిరా గాంధీని 'ఐరన్ లేడీ'గా అభివర్ణించారు. భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం ఈ ఇద్దరు మహానాయకులు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, నేటి BJP-RSS విధానాలు దేశంలో చాలా సమస్యలకు కారణమని ఆయన ఆరోపించారు.

* కొనసాగుతున్న సిద్ధాంతపరమైన పోరాటం

స్వాతంత్ర్యానంతర కాలం నుంచి కాంగ్రెస్, ఆర్‌ఎస్సెస్‌ (RSS) మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అంటే లౌకికతత్వం , దేశ ఐక్యతకు అధిక ప్రాధాన్యత. RSS మాత్రం హిందుత్వం , సాంస్కృతిక జాతీయవాదంపై ప్రధాన దృష్టిలో వెళుతుంది.. ఈ వివాదం ఎప్పటిలాగే దేశ ఐక్యత, హిందుత్వం, లౌకికత అనే విలువల చుట్టూ కేంద్రీకృతమై రాజకీయ వేడిని పెంచుతోంది.

* బీజేపీ ప్రతిస్పందన

అయితే, ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ (BJP) వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. "RSS దేశభక్తి, సేవా భావానికి ప్రతీక. కాంగ్రెస్‌ మళ్లీ పాత రాజకీయాలను తెరపైకి తెస్తోంది" అని ఆరోపించింది. RSS దేశం కోసం చేస్తున్న కృషిని కాంగ్రెస్ గుర్తించడం లేదని వారు విమర్శించారు.

ఈ విధంగా, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ – ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య కొనసాగుతున్న చారిత్రక, సైద్ధాంతిక వైరం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి పతాకస్థాయికి చేరింది.