జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకుల వింత ప్రచారం.. మొదలైన సందడి..
గెలిచిన తర్వాత కనీసం మొహం కూడా చూడని నాయకులు గెలుపు కోసం వృత్తి పని వారల వద్దకు వచ్చి విచిత్ర వేషాలు వేస్తుంటారు.
By: Tupaki Political Desk | 14 Oct 2025 2:05 PM ISTఎన్నికలు వచ్చాయంటే చాలు.. నాయకుల ఫీట్లు చూసి ఓటర్లు నవ్వుకుంటారు. గెలిచిన తర్వాత కనీసం మొహం కూడా చూడని నాయకులు గెలుపు కోసం వృత్తి పని వారల వద్దకు వచ్చి విచిత్ర వేషాలు వేస్తుంటారు. ఇది ప్రతీ ఎన్నికలో జరిగే తతంగమే. ఢిల్లీకి ఎన్నుకునే పార్లమెంట్ సభ్యుడి ఎన్నిక నుంచి వార్డుకు ఎన్నుకునే వార్డు సభ్యుడి వరకు నాయకులు డిఫరెంట్ డిఫరెంట్ ఫీట్లు చేస్తుంటారు. వారికి ఏమనిపించినా.. ఓటర్లు మాత్రం నవ్వుకుంటారు.
రాష్ట్రంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక మొదలైంది. ఇది మూడు ప్రధాన పార్టీల రాజకీయ నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారింది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే అన్ని ప్రధాన పార్టీలు రంగంలోకి దూకాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ప్రచార వ్యూహాలను సరిచేసుకుంటున్నాయి. కానీ ఈ సారి ప్రచారం పాత పద్ధతుల్లో సాగడం లేదు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి నాయకులు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.
‘హెయిర్ కట్ పబ్లిసిటీ’
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ప్రచారం మొదలు పెట్టారు. మంగళవారం ఆయన ఒక మంగళి షాపలో చేసిన పని వైరల్‌గా మారింది. దీనితో పాటు పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఒక స్థానిక సలూన్‌లోకి వెళ్లి షాపు కస్టమర్ కు హెయిర్ కట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోలో ఆయన సాధారణ ఓటర్లతో మాట్లాడడం. వారిని నవ్వుతూ పలకరించడం కనిపించింది. కానీ మంగళవారం మంగళి షాపు (సెలూన్ సెంటర్) ఓపెన్ చేయడంపై ఒకరిద్దరు విమర్శలు చేశారు. ఇది పాత వీడియోనా..? లేక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిందేనా.? అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. దీన్ని కొందరు ‘సాధారణ వ్యక్తిగా కనిపించాలనే ప్రయత్నం’ చేస్తున్నారు అని అభివర్ణిస్తే, మరికొందరు ‘ఇది రాజకీయ ప్రదర్శన మాత్రమే’ అంటున్నారు.
ఏదేమైనా, ఒక విషయం మాత్రం స్పష్టం ఇప్పుడు రాజకీయ ప్రచారం కూడా ‘వైరల్ కంటెంట్’ యుగంలోకి అడుగుపెట్టింది.
ఓటర్ల అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు కొత్త ట్రిక్స్..
జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ఓటర్ల మానసికత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సామాజిక మాధ్యమాలు ప్రభావం ఎక్కువ. అందుకే పార్టీలు కూడా ప్రచారాన్ని డిజిటల్ ఆలోచనతో మలుస్తున్నాయి.
ఎవరెవరు ఏమి చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
*బీఆర్ఎస్ అభ్యర్థి ప్రజల్లో సన్నిహితంగా కనిపించే ప్రయత్నంలో మునిగిపోయారు. సెలూన్లు, చాయ్ షాపులు, వీధి చర్చల్లో పాల్గొంటున్నారు.
*కాంగ్రెస్ అభ్యర్థి సోషల్ మీడియా లైవ్ ద్వారా యువతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహం రూపొందించారు.
*బీజేపీ మాత్రం ప్రచారాన్ని ‘క్రమశిక్షణతో కూడిన మైదాన యుద్ధం’లా మలుస్తూ, డోర్ టు డోర్ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తోంది.
ఓటు రాజకీయమా? లేక వినోదమా?
ఇప్పుడు ప్రచారంలో రాజకీయ వాదనలు కంటే వినోదం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు పార్టీలు తమ విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారాలు చెప్పేవి. ఇప్పుడు సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ ఇవే ప్రచారం ప్రధాన సాధనాలుగా మారాయి. ఈ మార్పు సమకాలీన పరిస్థితులకు అనుకూలం అనిపించినా.. అది సమస్యలను కప్పిపుచ్చే దిశలో కూడా వెళ్తోంది.
జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, పట్టణ సేవలు ప్రధాన సమస్యల గురించి మాట్లాడాలి.. కానీ ప్రచారంలో ఇవి కనిపించడం లేదు. ‘ఎవరి వీడియో ఎక్కువ వైరల్ అవుతుందో’ అనే పోటీ ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రజాస్వామ్యంలో ప్రచారం ఓటర్ల అవగాహనకు మార్గదర్శకం కావాలి, ఇప్పుడు అది సామాజిక ప్రదర్శన వేదికగా మారింది. మల్లారెడ్డి వంటి నేతలు సలూన్ వీడియోలతో ప్రజల్లో సామాన్యులమని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ప్రజలు ఇప్పుడు ఆ ‘షో’ కంటే సత్యం వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ప్రచారం అంటే కేవలం ముఖచిత్రం కాదు, అది వైఖరి ప్రతిబింబం. నాయకుడు ప్రజల్లోకి వెళ్లడం మంచి పరిణామం, కానీ అది సమస్యల పరిష్కారానికి దారి తీస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
‘కట్’ కాదు, ‘కనెక్ట్’ ముఖ్యం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయాలకే కాదు.. ప్రచార పద్ధతులకు కూడా పరీక్షే. నాయకులు వారి ఫొటోలు, వీడియోలు వైరల్ కావాలనుకోవచ్చు, కానీ ప్రజలు వాస్తవ పరిష్కారాల వైపే మొగ్గు చూపుతారు. సలూన్ సీన్లు, చాయ్ స్టాల్ ఫొటోలు ప్రచారంలో చక్కగా కనిపించొచ్చు,
కానీ చివరికి ఓటరు అడిగేది ఒక్క మాటే అదే ‘సమస్యల పరిష్కారం’.
