నాకేమన్నా వయసైపోయిందా.. తప్పుకోనికి: మల్లారెడ్డి
రాజకీయాల్లో ఉన్న నాయకులు అంత తొందరగా రిటైరయ్యే బాపతు కాదన్నది అందరికీ తెలిసిందే.
By: Garuda Media | 10 Aug 2025 10:50 PM ISTరాజకీయాల్లో ఉన్న నాయకులు అంత తొందరగా రిటైరయ్యే బాపతు కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే.. సెంటిమెంటు కోసం.. కొందరు నాయకులు ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ``ఇదే చివరి సారి పోటీ.. దయచేసి ఓటేయండి!`` అని వేడుకోవడం అందరికీ తెలిసిందే. ఇది కొందరు ప్రజలపై ప్రయోగించే సెంటిమెంటు అస్త్రం. దీనికి ఫిదా అయ్యే ఓటర్లు ఉంటారు కాబట్టి.. అలా వారు గట్టెక్కే ప్రయత్నం చేస్తారు.
ఇలానే.. గత ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి కూడా సెంటిమెంటు అస్త్రం ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇదే చివరి ఎన్నిక అని.. ఇక, తాను రిటైర్మెంటు తీసుకుంటా నని ప్రచారం చేశారు. దీంతో ఏమనుకున్నారో ఏమో.. ఓటర్లు ఆయనను గెలిపించారు. అయితే.. ఇదే విషయాన్ని తాజాగా ఆయన ముందు మీడియా ప్రస్తావించింది. `ఎప్పుడు రిటైరవుతున్నారు సర్?`` అని ప్రశ్నించగానే.. మల్లారెడ్డి అగ్గిమీద గుగ్గిలం లెక్క మండిపడ్డారు.
తనదైన శైలిలో మాట్లాడుతూ.. ``నాకేమన్నా వయసైపోయిందా.. తప్పుకోనికి`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ``జస్ట్ 73. అప్పుడే ఏమైనపోయినట్టు. జర్మనీ జపాన్ లలో ఉద్యోగులకు కూడా రిటైర్మెంటు ఉండదు తెలుసా? ఇంక, రాజకీయాల కెల్లి ఏడుంటది?. ఒకాయన రాజ్యసభలో 90 ఏళ్లయినా.. ఉన్నడు ఎరికెనా?`` అంటూ.. మాజీ ప్రధాని దేవెగౌడ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే.. మొత్తానికి తాను రిటైరయ్యే ఆలోచనలో లేనన్నారు. అంతేకాదు.. నియోజకవర్గంలో నా మాదిరి ఎవరైనా చేస్తరా? అని ప్రశ్నించారు.
ఇక, తన విద్యాసంస్థలను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నట్టు మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. దేశంలో యూనివర్సిటీలు స్థాపించే పనిలో ఉన్నానన్న ఆయన.. తెలంగాణ ప్రఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటొద్దా? అని ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం తనకు కాలేజీలు ఉన్నాయని, త్వరలోనే విశ్వవిద్యాలయాలను కూడా పెడతానని చెప్పుకొచ్చారు. ఈ మాట ఎలా ఉన్నా.. మేడ్చల్‌లో మాత్రం బీఆర్ ఎస్ నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. ఇక, పార్టీలు మారే విషయంపైనా మల్లారెడ్డి స్పందిస్తూ.. తాను ఏ పార్టీలోకీ మారేది లేదన్నారు.
