Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి కారు దిగడం ఖాయమేనా ?!

బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతారన్న ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి.

By:  Tupaki Political Desk   |   26 Sept 2026 4:20 PM IST
మల్లారెడ్డి కారు దిగడం ఖాయమేనా ?!
X

బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతారన్న ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీల్లో చేరడం ఖాయం అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన ఖండిస్తూ వస్తున్నారు.

అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విద్యాసంస్థల ఆక్రమణల మీదకు వచ్చినప్పుడు బెంగళూరులో ప్రస్తుత సీఎం, అప్పటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారని, ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం, బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లడం పార్టీ మార్పుపై చర్చలకు దారితీసింది. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీ ఏఐ క్యాంపస్, డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాన అతిథిగా ఆహ్వానించడానికే అని వివరణ ఇచ్చారు.

తాజాగా ఆస్ట్రేలియా బ్రిస్బేన్ లోని ఇండియన్ కల్చరల్ సొసైటీ కన్వెన్షన్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా వెళ్లిన సందర్భంగా టూవుంబా మేయర్ జియోఫ్ మెక్ డొనాల్డ్ తో కలిసిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మల్లారెడ్డి, పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి ఉన్న ఫోటోలను ఎక్స్ లో షేర్ చేయడంతో పార్టీ మార్పు అంశం మీద మరోసారి చర్చ మొదలైంది.

ఆస్ట్రేలియా వెళ్లిన మల్లారెడ్డికి బ్రిస్బేన్ లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ కన్వీనర్ విన్నీ తూముకుంట ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆహ్వానం పలికాయి. అయితే ఆయన ఆ తర్వాత బీజేపీ ముఖ్యులతో సమావేశం కావడమే ఇక్కడ చర్చకు దారితీసింది.

మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మేడ్చల్, మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారని అంటున్నారు. కొన్ని ప్రస్తావనల్లో నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ టికెట్ అడుగుతున్నారని కూడా చెబుతున్నారు.

అయితే బీజేపీ మాత్రం ముందు పార్టీలో చేరి పనిచేయండి, ఆ తర్వాత టికెట్ల అంశాన్ని పరిశీలిద్దాం అంటున్నారని సమాచారం.

అయితే మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుండి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుండి బహిష్కరించిన అనంతరం ఆయన సొంత పార్టీ పెడతారని అనుకున్నా ఆయన బీజేపీలో చేరడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి అవుతారు, లేదా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్య పదవి ఇస్తారని ప్రచారం జరిగినా అది ఊహాగానాలకే పరిమితం అయింది. మరి మల్లారెడ్డి కోసం బీజేపీ ఏకంగా సిట్టింగ్ ఎంపీ ఈటెలను పక్కనపెట్టి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారన్నది అనుమానమే. వ్యాపారాలు, విద్యా సంస్థల నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నది నిజమే అని గత పరిణామాలు అన్నీ పరిశీలిస్తే అర్థమవుతోంది. కానీ ఆయన ఒక మంచి అవకాశం కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది.