నవంబర్ 1 నుంచి అమలులోకి... ఏమిటీ 'జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్'?
మనకు చాలా ప్రదేశాల్లో 'నో స్మోకింగ్ ' బోర్డుకు కనిపిస్తుంటాయి. అయితే ఇకపై మాల్దీవుల్లో కూడా అలాంటి బోర్డులు కనిపించనున్నాయి.
By: Raja Ch | 3 Nov 2025 2:00 AM ISTమనకు చాలా ప్రదేశాల్లో 'నో స్మోకింగ్ ' బోర్డుకు కనిపిస్తుంటాయి. అయితే ఇకపై మాల్దీవుల్లో కూడా అలాంటి బోర్డులు కనిపించనున్నాయి. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. కొంతమందికి మాత్రం ఈ పొగాకు వినియోగం విషయంలో నిషేధం విధించబడింది. అది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఈ నిర్ణయం సంచలనంగా మారింది.
అవును... పొగాకు వినియోగంపై ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మాల్దీవులు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... మాల్దీవుల్లో పొగాకుపై 'జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్' శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో.. ప్రపంచంలో ఇలాంటి నిషేధం ఉన్న ఏకైక దేశంగా మాల్దీవులు నిలిచింది.
ఈ నిబంధన ప్రకారం.. జనవరి 2007 తర్వాత జన్మించిన ఏ వ్యక్తైనా మాల్దీవుల భూభాగంలో పొగ తాగడానికి వీల్లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు నుండి ఈ విధానానికి మద్దతు లభించింది. ఈ సందర్భంగా స్పందించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ... ప్రజారోగ్యాన్ని కాపాడటం, పొగాకు రహిత తరాన్ని ప్రోత్సహించడం ఈ నిషేధం లక్ష్యం అని తెలిపింది.
ఈ కొత్త నిబంధన ప్రకారం.. జనవరి 1, 2007న లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులు మాల్దీవులలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడం, ఉపయోగించడం లేదా విక్రయించడం నిషేధించబడింది అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో.. తక్కువ వయస్సు గల వ్యక్తికి పొగాకు ఉత్పత్తులను అమ్మితే 50,000 రుఫియా (సుమారు రూ.2,90,000) జరిమానా విధించబడుతుంది.
పర్యాటకులకు నిషేధం వర్తిస్తుంది!:
ఈ నిషేధం పర్యాటకులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేపింగ్ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం, పంపిణీ, స్వాధీనం, ఉపయోగం కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్ ల నిషేధం వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. నిషేధిత వేప్ పరికరాలను ఉపయోగిస్తే 5,000 రూఫియా జరిమానా విధించబడుతుంది.
కాగా.. ఇప్పటివరకు ధూమపానానికి వ్యతిరేకంగా అటువంటి చట్టాన్ని అమలు చేసిన మొదటి, ఏకైక దేశం న్యూజిలాండ్. కానీ దానిని ప్రవేశపెట్టిన ఒక సంవత్సరం లోపే నవంబర్ 2023లో అది రద్దు చేయబడింది. బ్రిటన్ లో కూడా ఇలాంటి నిషేధాన్ని ప్రతిపాదించారు కానీ, అది ఇంకా శాసన ప్రక్రియలో ఉంది.
