నాదం ఝుమ్మంది.. రాజకీయం రమ్మంది.. ఈ ఎమ్మెల్యే గురించి తెలుసా?
తన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొంది.. ఫలితంగా ఇన్ స్టా, యూట్యూబ్ లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
By: Raja Ch | 16 Nov 2025 2:00 PM ISTతన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొంది.. ఫలితంగా ఇన్ స్టా, యూట్యూబ్ లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. గత ఏడాది ఆమె పాడిన శబరి పాట ప్రధాని మోడీనే ఆకర్షించింది.. ఆయన ప్రశంసలు సంపాదించుకుంది. అలా ఆని ఆమె కేవలం సోషల్ మీడియాలోనే టాప్ కాదు.
అంతకంటే ముందు ఇండియన్ ఐడియల్ లో పాల్గొంది.. ఆ తర్వాత, ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ లో విజేతగా.. రైజింగ్ సింగర్ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి జాతీయ స్థాయి క్రియేటర్లకు అవార్డులు ఇచ్చినప్పుడు అందులో ఆమె కూడా ఉంది. నాడు ఆమె కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. కట్ చేస్తే.. ఇప్పుడు పాతికేళ్లకే ఎమ్మెల్యే.
అవును... ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 202 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ 202 మంది ఎన్డీయే కూటమి సభ్యుల్లో పాతికేళ్ల మైథిలీ ఠాకూర్ ఒకరు. పైన చెప్పుకున్న ఇంట్రడక్షన్ అంతా ఆమె గురించే. బీహార్ రాజకీయాల్లో ఆమె తాజా సంచలనం.
బీహార్ లోని అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున రంగంలోకి దిగిన మైథిలీ ఠాకూర్... స్థానిక ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాపై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఫలితంగా... ఈసారి బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది.
కాగా... 2000 జూలై 25న మధునైలోని బేనిపట్టిలో రమేష్ ఠాకూర్, భారతి దంపతులకు జన్మించింది మైథిలీ. ఈమె తండ్రి శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. ఈ క్రమంలో రమేష్.. చిన్నప్పటి నుంచీ కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆమెతో పాటు.. ఆమె సోదరులు అయాచీ, రిష కూడా సంగీతం నేర్చుకున్నారు.
వాస్తవానికి ఆమె చిన్నప్పటి నుంచీ రియాలిటీ షోలలో పాడటానికి ప్రయత్నించినప్పటికీ... పలుమార్లు తిరస్కరించబడింది. ఇందులో భాగంగా.. ఆమె సరేగమప లిటిల్ చాంప్స్, ఇతర ప్రసిద్ధ సంగీత పోటీలల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె అందులో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ప్రయత్నం ఆపలేదు!
నాడు 2 ఓట్ల తేడాతో ఓడిపోయి...!:
తనదైన స్వరంతో మైథిలీ ఠాకూర్ 2016లో జీనియస్ యంగ్ సింగింగ్ కాంపిటీషన్ లో గెలిచి.. తన తొలి మ్యూజిక్ ఆల్బమ్ "యే రబ్బా" ప్రారంభించింది. సరిగ్గా ఒక ఏడాది తర్వాత ఆమె రైజింగ్ స్టార్ షోలో కనిపించింది. నివేదికల ప్రకారం.. రైజింగ్ స్టార్ మొదటి సీజన్ ను కేవలం రెండు ఓట్ల తేడాతో కోల్పోయింది.. దీంతో ఆ షోలో మొదటి రన్నరప్ గా నిలిచింది. తాజా ఎన్నికల్లో 11,730 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది!
