సొంత గూటికి మహిపాల్ రెడ్డి.., అసెంబ్లీ వేదికగా హరీష్ రావు మాటల్లో స్పష్టం..
రాజకీయాల్లో ‘శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు’ అనే మాట పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో అక్షరాలా నిజమవుతోంది.
By: Tupaki Political Desk | 28 March 2026 9:00 PM ISTరాజకీయాల్లో ‘శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు’ అనే మాట పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో అక్షరాలా నిజమవుతోంది. కొంత కాలంగా కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడు మళ్ళీ ఆయన ‘బ్యాక్ టూ బీఆర్ఎస్’ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఊహాగానాలు మాత్రమే కాదు.., అసెంబ్లీ వేదికగా హరీష్ రావు ఆయనను సమర్థించడం ద్వారా మహిపాల్ రెడ్డి ‘సొంతగూటి’ ప్రయాణం దాదాపు అధికారికం అయిపోయింది. ఈ రాజకీయ మార్పులు, దాని వెనుక ఉన్న వ్యూహాలను పరిశీలిస్తే..
మున్సిపల్ ఎన్నికల ముందే దూరం..
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన కంటే ముందే ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి, కుమారుడు విక్రమ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి యాక్టివ్ గా పనిచేశారు. ఇది ఆయన మళ్లీ కారు ఎక్కబోతున్నారనే దానికి తొలి సంకేతం. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన తెరవెనుక చక్రం తిప్పారు. దీనివల్ల పార్టీ అధిష్టానం వద్ద ఆయనకు మంచి మార్కులు పడ్డాయి.
బిఆర్ఎస్ వ్యూహాత్మక మినహాయింపు!
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న స్టాండ్ మహిపాల్ రెడ్డికి కలిసొచ్చింది. 9 మందిపైనే యాక్షన్ స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పేర్లు కాకుండా, కేవలం 9 మందిపైనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ జాబితా నుంచి మహిపాల్ రెడ్డిని మినహాయించడం ద్వారా, ఆయన తమవాడే అని బీఆర్ఎస్ పరోక్షంగా ప్రకటించింది.
అసెంబ్లీ సాక్షిగా..
తాజాగా అసెంబ్లీలో మైనింగ్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. మహిపాల్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు గట్టిగా తిప్పికొట్టారు. ఆయనను ‘ప్రతిపక్ష ఎమ్మెల్యే’ అని సంబోధించడం ద్వారా మహిపాల్ రెడ్డి ఇప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ పక్షాన ఉన్నట్లు తేలిపోయింది. మైనింగ్ అక్రమాల విషయంలో ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేస్తున్న సమయంలో హరీష్ రావు అండగా నిలబడడం, కేటీఆర్ తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు పార్టీలో ఆయన ప్రాధాన్యతను పెంచాయి.
పటాన్‌చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డికి ఉన్న పట్టు బీఆర్ఎస్ కు అదనపు బలం. పార్టీ ఫిరాయింపుల రచ్చ సాగుతున్న వేళ, ఒక ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి రావడం బీఆర్ఎస్ కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మైనింగ్ అంశాన్ని ఇంకా ఎంత వరకు లాగుతుంది? మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ రక్షణ కవచంలా మారుతుందా? అనేది రాబోయే రోజుల్లో చూడాలి. పటాన్‌చెరు 'కారు' ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కినట్లే కనిపిస్తోంది.
