Begin typing your search above and press return to search.

రేవంత్ వర్సెస్ మహేష్ గౌడ్...గ్యాప్ నిజమేనా ?

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు.

By:  Satya P   |   29 Aug 2026 11:44 PM IST
రేవంత్ వర్సెస్ మహేష్ గౌడ్...గ్యాప్ నిజమేనా ?
X

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ పీసీసీ నిర్వహణలో విశేష అనుభవం కలిగిన వారు, ఆయన ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. ఇక 2024 సెప్టెంబర్ నుంచి ఆయన పీసీసీ చీఫ్ గా తెలంగాణాలో కొనసాగుతూ వస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి తరచూ తమది ఆనాడు వైఎస్సార్ డీఎస్ కాంబినేషన్ లాంటిది అని చెబుతూ ఉంటారు. తామిద్దరం ఒక్కటే అని కూడా అంటూ ఉంటారు. మంచి కో ఆర్డినేషన్ తమ మధ్య ఉందని కూడా చెబుతూ ఉంటారు, అలాంటిది పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రిల మధ్య భారీ గ్యాప్ ఉందని ప్రచారంలో ఉన్న మాట. దీని మీద ఒక ముఖాముఖి ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ ఏమి చెప్పారు అంటే ఆసక్తికరమైనదే మరి.

కాంగ్రెస్ లో సహజమే అంటూ :

ఒక ప్రముఖ తెలుగు చానల్ ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక క్లిష్టమైన ప్రశ్నను యాంకర్ సంధించారు. పీసీసీ చీఫ్ కి రేవంత్ రెడ్డికి మధ్య బిగ్ గ్యాప్ ఉందని కాంగ్రెస్ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి, ఇందులో నిజం ఉందా అని ప్రశ్నించారు. దానికి మహేష్ గౌడ్ బదులిస్తూ అలాంటిది ఏమీ లేదని అన్నారు. అయితే చిన్న చిన్న విభేదాలు అన్ని పార్టీలో ఉంటాయని అన్నారు. అభిప్రాయ భేదాలు తప్పించి మరేమీ లేదని అన్నారు. తాను రేవంత్ రెడ్డి ఎంతో కో ఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తున్నామని చెప్పారు. ఏమైనా ఉంటే ఇద్దరం కలసి చర్చించుకుంటామని అన్నారు. ఇక తాను వర్గాలను ప్రోత్సహించను అలాగే గ్రూపులు కట్టను అన్నారు. తాను పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నాను తాను అందరి వాడిని అన్నారు.

ఉత్తం మీద గౌరవం :

తాను ఉత్తం కుమార్ పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి గౌరవం ఉందని అన్నారు. తాను ఉత్తం కుమార్ రెడ్డితో కలసి ప్రత్యేకంగా వర్గం కట్టాను అన్నది తప్పు అన్నారు. అలాగే కాంగ్రెస్ లో అంతా ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ పెద్ద పార్టీ అని అందుకే విభేదాలు సహజం అన్నారు. ఎవరు అయినా ఎంతటి వారు అయినా ఒక దశ వరకే చూస్తామని లక్ష్మణ రేఖ దాటితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ విషయం అయినా ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యవహారం అయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అయినా ఏఐసీసీ పరిశీలిస్తుందని అన్నారు. తమకు పార్టీ పరంగా క్రమశిక్షణా సంఘం ఉందని నివేదికను తయారు చేస్తందని అన్నారు. దానిని అక్కడికి పంపిస్తామని చర్యలు తీసుకునేది ఏఐసీసీ అన్నారు.

పార్టీ ప్రభుత్వం మధ్యలో :

ఇక తాను కాంగ్రెస్ ప్రభుత్వానికి పీసీసీకి వారధిగా ఉంటాను అని చెప్పారు. తమదే ప్రభుత్వం కాబట్టి తాను సలహా సూచనలు ఇస్తూ ఉంటాను అన్నారు. అంతే కాకుండా ఎనిమిది మందితో కలిపి కో ఆర్డినేషన్ కమిటీ కూడా ఉందని చెప్పారు. ప్రభుత్వం సజావుగా పనిచేసేలా కాంగ్రెస్ విధానాలు అమలు చేసేలా ఈ కమిటీ చూస్తుందని అన్నారు. ఇటీవల ఢిల్లీలో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగిందని పూర్తి సామరస్య వాతావరణంలో ఈ మీటింగ్ జరిగితే సోషల్ మీడియాలో చిలవలు పలవలుగా రాశారని ఆయన అన్నారు.

బీసీలకు మంత్రి పదవులు :

ఇక జనాభాలో యాభై శాతం పైగా ఉన్న బీసీలకు తగినన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కుల గణన చేయాలని డిమాండ్ చేస్తుందని పార్లమెంట్ లో దీనిని ఆమోదించి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్నది తమ పార్టీ విధానం అన్నారు. అలాగే తెలంగాణాలో తమ పార్టీ అన్ని వర్గాల కోసం పని చేస్తుందని అన్నారు. సంక్షేమం అభివృద్ధి అజెండా మేరకు తాము ప్రజలకు ఇచ్చిన హామీలకు తగిన విధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.