మహేష్ గౌడ్ మాటల వెనక మర్మమేంటి ?!
ఈ మౌనం వెనక కారణాలు ఏంటి అని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కానీ అంతలోనే పార్టీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ బాంబు పేల్చారు.
By: Garuda Media | 20 Aug 2026 1:10 PM ISTఅసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ? ఎవరు దేనిని నడిపిస్తున్నారు ? ఎవరు దేనిని నియంత్రిస్తున్నారు ? ఎవరి వెనక ఎవరున్నారు ? ఎవరు ? ఎవరితో మాట్లాడిస్తున్నారు ? అసలు ఆ మాటల వెనక మర్మం ఏంటి ? కొందరి మౌనం వెనక మర్మం ఏంటి ? అన్నది తీవ్ర చర్చానీయాంశంగా మారింది.
బుధవారం వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన మంత్రి సురేఖ జన్మదిన వేడుకలలో ఆమె కూతురు సుష్మిత రేవంత్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పరకాల నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని, వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడి నుండి పోటీ చేస్తానని, చేతనైతే రేవంత్ రెడ్డి ఓడించాలని, గత ఎన్నికల్లో తన తండ్రి కొండా మురళి దగ్గరుండి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాడని, ఈ సారి తనకు టికెట్ రాకున్నా స్వతంత్రంగా నిలబడి గెలుస్తానని సుష్మిత రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది.
దీంతో నిన్న రాత్రి కొండా సుష్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీచేసింది. దానికి ఇంకా కొండా సురేఖ వివరణ కూడా ఇవ్వలేదు. సుష్మిత ఆరోపణలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించకపోగా, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సుష్మిత అసలు కాంగ్రెస్ కార్యకర్త కాదని, ఆమెకు పరిణతి లేదని, రేవంత్ ను అనే స్థాయి కాదని అన్నారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు, వేం నరేందర్ రెడ్డి సన్నిహితులు, మంత్రి పొంగులేటి సన్నిహితులు గానీ ఇంత వరకు స్పందించకుండా మౌనం వహించారు. ఈ మౌనం వెనక కారణాలు ఏంటి అని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కానీ అంతలోనే పార్టీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ బాంబు పేల్చారు. ‘ఎమ్మెల్యే అభ్యర్థిని రేవంత్ రెడ్డి ప్రకటించినంత మాత్రాన చెల్లదని, ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే‘ అని పీసీసీ అధ్యక్షుడి హోదాలో అన్నారు. సుష్మిత ఆరోపణల నేపథ్యంలో ఆక్రోశంగా ఉన్న రేవంత్ వర్గం మీద మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుందని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక నియోజకవర్గ అభ్యర్థిని నిర్ణయించి, అధిష్టానాన్ని ఒప్పించే సమర్ధత లేదా ? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదాలు ఎటువైపు దారి తీస్తాయో వేచిచూడాలి.
