టీ కాంగ్రెస్ లో బీసీ సీఎం ప్రకంపనలు !
ఇక కాంగ్రెస్ జాతీయ నాయకత్వం టార్గెట్ అయితే 2029 లో లోక్ సభలో అధిక సీట్లు సాధించి ఢిల్లీ కోటపైన పాగా వేయాలన్నది అని గుర్తు చేస్తున్నారు.
By: Satya P | 5 Oct 2026 11:00 PM ISTతెలంగాణా కాంగ్రెస్ మరో రెండు నెలలలో మూడేళ్ల అధికారం పూర్తి చేసుకోబోతోంది. తెలంగాణా ఇచ్చామని చెప్పుకున్న ఆ పార్టీకి ప్రజలు రెండు ఎన్నికల తరువాత 2023లో అధికారం ఇచ్చారు. 2014, 2018లలో వరసబెట్టి కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. ఇక టీ పీసీసీ చీఫ్ పదవిని మొదట్లో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కువ కాలం చేపట్టారు. ఆయన తరువాత రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇపుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీసీ నేతగా మహేష్ కుమార్ గౌడ్ కి ఈ కీలక స్థానం దక్కింది. అయితే బీసీలకు రాజ్యాధికారం కావాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ అది ఎప్పటికి నెరవేరుతుంది అన్నది మాత్రం తెలియదనే అంటారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ ఓబీసీ సభలో తెలంగాణాకు తరువాత సీఎం బీసీ వర్గాల నుంచి వస్తారు అని సంచలన ప్రకటన చేశారు. దానికి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గెతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇస్తారు అని కూడా చెప్పారు. దీంతో ఈ స్టేట్మెంట్ తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాలలో ప్రకంపనలు రేపుతోంది అని అంటున్నారు.
పదేళ్ల సీఎం అంటూ :
ఇక రేవంత్ రెడ్డి అయితే 2023లో సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఆయన మరో రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రతీ సభలోనూ చెబుతున్నారు. తాను 2034 దాకా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతాను అని ఆ మీదటనే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తాను అని కూడా చెబుతున్నారు. దానిని బట్టి చూస్తే కనీసంగా మరో ఎనిమిదేళ్ళ పాటు ఆయన సీఎం గా ఉంటాను అని పరోక్షంగా చెబుతున్నారు అని గుర్తు చేస్తున్నారు. మరి వచ్చేది బీసీ సీఎం అని మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన బిగ్ స్టేట్మెంట్ చూస్తే కాంగ్రెస్ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తోందా అన్న చర్చ అయితే మొదలైంది.
రేవంత్ ఇమేజ్ తోనే :
నిజం చెప్పాలీ అంటే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఇమేజ్ ఎంతగానో దోహదపడింది. ఆయన టీడీపీలో పూర్వాశ్రమంలో కీలకంగా పనిచేయడం కూడా ఆ ఎన్నికల్లో కలిసి వచ్చింది. టీడీపీ అభిమానులు ఆ ఓటర్లు కూడా కాంగ్రెస్ కి టర్న్ అయ్యారు అని విశ్లేషణలు ఉన్నాయి. ఇక కేసీఆర్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ ని ఢీ కొట్టి కాంగ్రెస్ కి అధికారం తీసుకుని రావడం అంటే మామూలు విషయం కాదనే అంటున్నారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని కూడా చెబుతున్నారు. ఇక జాతీయ కాంగ్రెస్ స్థాయిలో చూస్తే రేవంత్ కి పెద్దల నుంచి పూర్తి సానుకూలత ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ గా ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తున్నారు. ఆయనని అన్ని విధాలుగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రోత్సహిస్తోంది.
టార్గెట్ అదే మరి :
ఇక కాంగ్రెస్ జాతీయ నాయకత్వం టార్గెట్ అయితే 2029 లో లోక్ సభలో అధిక సీట్లు సాధించి ఢిల్లీ కోటపైన పాగా వేయాలన్నది అని గుర్తు చేస్తున్నారు. దాని కోసం కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసుకుంటూ సాగుతోంది. ఎక్కడ ఏమి చేయాలో అవి చేస్తోంది. ఇక దక్షిణాదిన రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ లాంటి వారి మీద పూర్తి విశ్వాసం ఉంచి ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి కదుపుతుందా అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. 2028 నవంబర్ లో తెలంగాణాలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అంటే లోక్ సభకు ఆరు నెలల ముందు అన్న మాట. రెండవసారి కాంగ్రెస్ ని గెలిపిస్తే రేవంత్ రెడ్డికే చాన్స్ ఇస్తారని కూడా రాజకీయ సమీకరణలు కాంగ్రెస్ అవసరాలు జాతీయ స్థాయి అనివార్యతల బట్టి చూస్తే విశ్లేషించే వారు ఉన్నారు.
అప్పటి మాటేనా :
ఇక కాంగ్రెస్ ఒక వేళ కేంద్రంలో ఇండియా కూటమి మిత్రులతో కలుపుకుని 2029 ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే అపుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మార్పులు చేర్పులు చేయవచ్చు అని అంటున్నారు. అలా చేయాలనుకున్నా బలమైన నాయకులను పార్టీకి ఎక్కువ సీట్లు తెచ్చేలా చేసిన కీలక నేతలను పక్కన పెడుతుందా అంటే అది కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ ప్రకటన బీసీ వర్గాలకు పెద్ద బూస్టింగ్ లాంటిదే అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ వర్గాలలో దీని మీదనే ప్రస్తుతం చర్చ అయితే సాగుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి 2034 వరకూ సీఎం గా కొనసాగుతాను అంటూ చేస్తున్న ప్రకటనలు ఈ స్టేట్మెంట్ అయితే భిన్నంగా ఉంది అనే అంటున్నారు.
